సమీక్ష : విశ్వాసం – రొటీన్ గా సాగే యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ !

Viswasam movie review

విడుదల తేదీ : మార్చి 01, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అజిత్ కుమార్, నయనతార, జగపతిబాబు తదితరులు

దర్శకత్వం : శివ, ఆదినారాయణ

నిర్మాత : సెంథిల్ త్యాగరాజన్

సంగీతం : డి.ఇమ్మాన్

సినిమాటోగ్రఫర్ : వెట్రి

శివ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన చిత్రం ‘విశ్వాసం’. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలై అక్కడ సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. కాగా ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

వీర్రాజు (అజిత్) రావుల పాలెం, అలాగే చుట్టూ పక్కల గ్రామాలకు కూడా పెద్ద లాంటి వాడు. ఆ గ్రామాలన్నీ పదేళ్లకు ఒకసారి జాతర జరుపుకుంటుంటాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ జాతర జరపకూడదని కొంతమంది పట్టు బడతారు. కానీ వీర్రాజు జాతరను ఘనంగా జరిపిస్తాడు. ఆ జాతరలో అందరూ తమ కుటుంబాలతో ఆనందంగా గడుపుతుంటే.. వీర్రాజు మాత్రం భార్య (నయనతార) దూరమై ఒక్కడే బాధ పడుతుంటుంటాడు. అది చూసిన వీర్రాజు బంధువులు.. ముంబైలో ఉంటున్న భార్యను ఒప్పించి మళ్లీ మన ఊరు తీసుకురమ్మంటారు. అలా వీర్రాజు, భార్య దగ్గరకు వస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనతంరం.. వీర్రాజు కూతురును ఎవరో చంపటానికి ప్రయత్నిస్తుంటారు. అసలు వాళ్ళు ఎవరు ? వీర్రాజు కూతురుని ఎందుకు చంపాలనుకుంటున్నారు ? అసలు వీర్రాజును అతని భార్య ఎందుకు వదిలేసింది ? చివరికి వీర్రాజు, అతని భార్య కలుస్తారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంతో మంచి ఎమోషనల్ ఫాదర్ లా.. అజిత్ నటన చాల బాగుంది. అచ్చం ఒక పల్లెటూరి వాడి పాత్రలో నటించిన ఆయన, తన పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని కీలకమైన ఎమోషనల్ సన్నివేశాల్లో తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆయన సినిమాకి హైలెట్ గా నిలచారు.

అలాగే నయనతారతో సాగే సీన్స్ .. అలాగే అజిత్ కూతురికి, అజిత్ కు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగానే అలరిస్తాయి. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార.. ఎప్పటిలాగే తమ నటనతో తమ గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. మరో కీలక పాత్రలో నటించిన జగపతిబాబు కూడా తన గంభీరమైన నటనతో మెప్పిస్తారు. తన నటనతో సినిమాలో సీరియస్ నెస్ తెచ్చారు.

అజిత్ కు మామయ్య, బావగా నటించిన నటులతో పాటు, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఇక డైరెక్టర్ శివ అజిత్ లోని మాస్ యాంగిల్ ని, బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా వాడుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం మెప్పిస్తోంది.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు శివ భార్య భర్తలకు, అలాగే తండ్రి కూతురుకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. చాలా సన్నివేశాలు ముఖ్యంగా వర్కౌట్ కానీ కామెడీ సన్నివేశాలతో శివ కథనాన్ని నెమ్మదిగా నడిపి బోర్ కొట్టించారు.

అజిత్ కు, జగపతిబాబుకు మధ్యన వచ్చే యాక్షన్ సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు సినిమాలోని సెకెండ్ హాఫ్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చాలా సాగతీతగా అనిపిస్తాయి.

మొదటి భాగంలో అజిత్ – నయనతార మధ్య లవ్ ట్రాక్ సరదాగా సాగినప్పటికీ.. సెకెండాఫ్ లో వారి మధ్య ఉండాల్సిన ఆ ఎమోషనల్ ట్రాక్ ను ఇంకా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో ఆ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు. ఇక సినిమాలో చాలామంది తెలుగు ఆర్టిస్ట్ లు కనిపిస్తున్నా.. అక్కడక్కడ తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు శివ హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ను, అలాగే తండ్రి కూతుర్ల మధ్య వచ్చే కొన్ని మంచి ఎమోషనల్ సన్నివేశాలను బాగా తెరకెక్కించినప్పటికీ.. సినిమాను మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. డి.ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఆయన అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని పల్లెటూరి సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. సెకెండ్ హాఫ్ లో సాగతీత సీన్స్ ను, అస్సలు వర్కౌట్ కానీ కామెడీ సీన్స్ ను తగ్గించాల్సింది. చివరగా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్, అలాగే తండ్రి కూతుర్ల మధ్య వచ్చే కొన్ని మంచి ఎమోషనల్ సన్నివేశాలు బాగా అలరిస్తాయి. అయితే సినిమాలో ముఖ్యమైన కథనం నెమ్మదిగా సాగడం, సినిమాలో మెయిన్ థీమ్ కు తగట్లు ట్రీట్మెంట్ లేకపోవడం, ఆకట్టుకునే విధంగా సన్నివేశాలను రూపొందించలేకపోవడం, సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా సాగడం.. వంటి అంశాలు సినిమాకు బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా ఈ సినిమా బి.సి సెంటర్ ప్రేక్షకులకు కనెక్ట్ కావొచ్చు. అయితే పెద్దగా బజ్ లేని ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో నిలబడుతుందో చూడాలి.

 

123telugu.com Rating : 2.75 /5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version