ప్రత్యేక ఇంటర్వ్యూ : లక్ష్మి మంచు : బాలయ్య లుక్ లో 300 % క్రెడిట్ నాకే చెందుతుంది

నటి,నిర్మాత, టివి హోస్ట్ ఇలా పలు అవతారాలలో లక్ష్మి మంచు తనకంటూ ప్రత్యేకమయిన గుర్తింపు తెచ్చుకున్నారు. లక్ష్మి మంచు త్వరలో రెండు భారీ చిత్రాలు “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” మరియు “గుండెల్లో గోదారి” చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రేపు “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” విడుదల అవ్వనుంది ఈ సందర్భంగా లక్ష్మి మంచుతో సంభాషణ జరిపాము. “ఊ కొడతారా ఉలిక్కి పడతారా”, “గుండెల్లో గోదారి”, మనోజ్ తో కలిసి పని చెయ్యడానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది, తన ఆసక్తులు మరియు దైవం మీద తనకి ఉన్న నమ్మకాన్ని గురించి మాట్లాడారు. మీకోసం ఆమెతో జరపిన సంభాషణ

ప్ర) ఊ కొడతారా ఉలిక్కి పడతారా రేపు విడుదల అవుతుంది. ఈ చిత్రం మీద మీ అంచనాలు ఏంటి?
జ)
ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం మా నిర్మాణంలో వచ్చిన భారీ చిత్రం అవుతుందని నమ్మకం ఉంది. ఈ చిత్రం బాలయ్య మరియు మనోజ్ ఇద్దరికీ భారీ విజయం అవుతుంది. ఈ చిత్రం గురించి మేము పడిన కష్టం నాకు తెలుసు ఈ చిత్రం ఎంత బాగా వచ్చిందో కూడా నాకు తెలుసు. నేను చాలా ఆసక్తికరంగా ఈరోజు కోసం వేచి చూస్తున్నాను.

ప్ర) ఈ చిత్రం మీద అంతగా నమ్మకం కలిగించిన విషయలేంటి?
జ) నేను చేసే పనిని నేను నమ్ముతాను ఎందుకంటే నా ఎంపికల మీద నాకు నమ్మకముంది. నాకు బాగా నచ్చితేనే నేను నిర్మాణంలోకి దిగుతాను. నా దగ్గర పారవేసెంత డబ్బులు లేవు, అప్పుడప్పుడు చిత్రాలు చెయ్యడానికి మాత్రమే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. “ఇది బాగుంటుంది అనుకుంటేనే దిగుతాను(అని నవ్వేసారు)”

ప్ర) మోహన్ బాబు గారు సంతోషించారా?
జ) ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన చిత్రం చూసి మా పనితనాన్ని చూసి గర్వంగా ఉన్నారు. అలానే అయన కొంచెం ఉత్కంఠగా కూడా ఉన్నారు(నవ్వుతూ). గతంలో కథ విషయంలో కాని లుక్స్ విషయంలో కాని నిర్మాణం విషయంలో కాని ఇలాంటి చిత్రాన్ని ఎవ్వరూ ప్రయత్నించలేదు. చాలా రోజుల తరువాత మన చిత్రానికి ఇంత క్రేజ్ ఉందని ఆయన అన్నారు.

ప్ర) ఈ చిత్ర బడ్జెట్ విషయంలో మోహన్ బాబు గారిని ఎలా ఒప్పించారు?
జ) నేను చెప్పలేదు! ఇది ఒక చిన్న బడ్జెట్ చిత్రమనే చెప్పాను. తరువాత ఈ చిత్రం మొదలు పెట్టాక ఖర్చు పెరుగుతూ వచ్చింది. బాలయ్య ఈ చిత్రంలో అడుగుపెట్టగానే చిత్రం భారీతనాన్ని సంతరించుకుంది.

ప్ర) మీ రాబోతున్న రెండు చిత్రాలు “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” మరియు “గుండెల్లో గోదారి” చిత్రాలలో భారీ సెట్స్ వేశారు. ఏదయినా ప్రత్యేకత ఉందా?
జ) అదేం లేదండి. “అదేంటో అలా జరిగిపోయింది”. నాకు సెట్స్ వేయించడం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే అది ఎక్కువ సమయం తీసుకోవటమే కాకుండా శ్రమతో కూడకున్న పని. నాన్నకి ఏదయినా నిర్మించాలంటే చాలా ఆసక్తి, నేను అన్ని ఏర్పాటు అయిన ఇంటిని కొనడానికి ఇష్టపడే వ్యక్తిని. ఒక్క పెయింటింగ్ ని కదపాలన్నా నేను చాలా ఆలోచిస్తాను.

ప్ర) కాని ఈ రెండు సెట్స్ చిత్రం మీద మరింత అంచనాలను పెంచాయి.
జ) థాంక్స్ కాని నా రాబోయే చిత్రాలలో ఇలాంటి సెట్స్ లేకుండా కూడా అంచనాలు పెరిగేలా చేస్తాను. సెట్స్ వెయ్యడం చాలా కష్టమయిన పని.

ప్ర) బాలయ్య గురించి మాట్లాడుకుంటే. ఈ మధ్య కాలంలో బాలయ్య వేషదారణలో ఉత్తమం ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంలోనిదే.
జ) అవును దీనికి 300% నేనే కారణం( నవ్వుతూ). ఆయన లుక్ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను ఉదాహరణకి ఆయన విగ్ లో ఉన్న జట్టు అలానే ఉండటానికి మేకప్ మెన్ జెల్ వాడేవారు నేను వద్దని చెప్పేదాన్ని ఎందుకంటే నాకు జుట్టు అలానే డ్రై మరియు లూస్ గా కనిపిస్తే బాగుంటుంది అనిపించింది అది కాస్త కష్టమయిన పని అయినా అది ఫలించింది “ఆయన్ని ఒక విలువయిన బొమ్మలా చూసుకున్నాను” బాలయ్య అన్నయ్య కూడా నాకు చాలా సహకరించారు. అయన చాలా మంచి మనిషి.

ప్ర) మనోజ్ కూడా తన ఇంటర్వ్యూ లో బాలయ్య గురించి ఇదే చెప్పారు.
జ) అవును అయన గురించి బయట చాలా పుకార్లు ఉన్నాయి. నిజానికి ఆయనతో కలిసి పని చెయ్యటం చాలా సంతోషకరమయిన విషయం. సెట్ లో క్రమ శిక్షణ లేకపోతేనే అయనకి కోపం వస్తుంది. మేము సెట్ లో క్రమశిక్షణతో మెలిగేల చర్యలు తీసుకున్నాం అయన చాలా సంతోషించారు.

ప్ర) పూర్తి నిడివిగల పాత్రలో ఎప్పుడు కనిపించబోతున్నారు?
జ) (నవ్వుతూ) గుండెల్లో గోదారి వస్తుంది కదా అందులో నాపాత్ర పూర్తి నిడివి గల పాత్రే ఈ మధ్యనే ఒక కొత్త దర్శకుడి నుండి మంచి కథ విన్నాను నేను నిర్మించడంలేదు కాని అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. అన్ని సరిగ్గా జరిగాక ఈ చిత్రం మొదలు పెడతాను.

ప్ర) ఇతర హీరోలతో చిత్రాలను ఎప్పుడు నిర్మిస్తున్నారు?
జ) మనోజ్ తో కలిసి పని చెయ్యడానికి ప్రధాన కారణం అతను అందరిలా కాకుండా కొత్తగా ఆలోచిస్తాడు. ఇప్పుడు బాలయ్యతో కలిసి పని చేశాను ఇంకొకసారి కలిసి పని చెయ్యాలని ఉంది. ఇతర హీరోలతో చిత్రాలు చెయ్యాలంటే మంచి కథలు దొరకాలి, మాములుగా నాకు వారితో పని చెయ్యటం ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే వారి స్వంత అభిప్రాయాలు వారికి ఉంటాయి కదా. కానీ చూద్దాం.
ప్ర) మోహన్ బాబు కూతురిగా మీకు ఒక పేరు ఉంది పరిశ్రమలో ప్రముఖ ఫిలిం మేకర్స్ “లక్ష్మి మా ఆడపడచు” అంటుంటారు మీ కెరీర్ ఎంపికలో దీని ప్రభావం ఏమయినా ఉందా?
జ) (నవ్వుతూ) “మా ఆడపడచు” అని మీరు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. కృతజ్ఞతలు. అవును మోహన్ బాబు కూతురిగా నాకంటూ ఒక పేరు ఉంది. నేను కృత్రిమంగా మంచిగా నటించి జనాన్ని మోసం చెయ్యదలుచుకోలేదు. నేను చీర కట్టుకొని బొట్టు పెట్టుకునే అమ్మాయిని అయితే కాను నా కెరీర్ విషయంలో కాని నా కాస్ట్యుం విషయంలో కాని నేను నాలానే ఉంటాను. నూతన దర్శకులు నా దగ్గరకి వచ్చినప్పుడు వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది బాగాలేని కథని తీసుకొచ్చి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా వస్తారు. “మోహన్ బాబు గారి అమ్మాయి మన స్టొరీ ఒప్పేసుకుంటే మనకి పెద్ద ప్రొడక్షన్ లో చిత్రాన్ని చేసే అవకాశం ఉంటుంది అనుకుంటారు” ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.

ప్ర) ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రాన్ని చాలా మందికి చూపించినట్టున్నారు మీకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది?

జ) నాకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే “లక్ష్మి యు స్టోల్ ది షో”(నవ్వుతూ) ఇంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ నాకు ఏది దొరుకుతుంది. మా దగ్గర గొప్ప చిత్రం ఉందని ప్రతి ఒక్కరు నాన్నగారికి చెబుతున్నారు.

ప్ర) గుండెల్లో గోదారి చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది?
జ) స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ పని పూర్తవగానే విడుదల చేస్తాం. ఈ చిత్రంలో CGI సన్నివేశాలు ఎక్కువగా నీళ్ళలో ఉంటాయి. స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ నీళ్ళతో చేస్తున్నప్పుడు మరింత కష్టమవుతాయి అందులో నీళ్ళు మనుషులు కలిసినట్టు సన్నివేశాలను చూపించాలి, అందులో నీళ్ళు ఎగరడం, చిమ్మడం వంటివి కూడా జాగ్రత్తగా చూపించాలి. ఇది బ్యాక్ గ్రౌండ్ లో చెట్టుని పెట్టడమో లేదా కార్ ని పెట్టడమో కాదు కదా. నేను ఈ చిత్రం పర్ఫెక్ట్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను.
ప్ర) మణిరత్నం చిత్రం ఎలా వస్తుంది?
జ) చాలా బాగా వస్తుంది నాకు ఎప్పుడు ఒక కల ఉండేది మణి గారితో కలిసి పని చెయ్యాలని ఆ అనుభూతి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయన చాలా రోజుల తరువాత నేరుగా తమిళ(హిందీ వెర్షన్ లేకుండా) చిత్రాన్ని తీస్తున్నారు. ఆయన కూడా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు.
ప్ర) మీరు ఎలాంటి వంటకాలను ఇష్టపడతారు?
జ) నాకు అమ్మ చేసిన రాయలసీమ వంటకాలంటే చాలా ఇష్టం కాని అందులో కారం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. అది అలా ఉండటమే నాకు ఇష్టం అనుకోండీ అది కాకుండా నాకు శుషి అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ లో మంచి శుషి దొరకదు. ఈ మధ్య దుబాయ్ వెళ్ళినపుడు అక్కడ శుషి తిని తృప్తి చెందాను.

ప్ర) చిత్రాలు కాకుండా మరేదయినా వ్యాపారం చేసే ఆలోచనలు ఉన్నాయా? టాక్ షో ప్లాన్స్ గురించి చెప్పండి?
జ) “నేను ప్లాన్ చెయ్యడం మానేసాను మహేష్”. మాములుగా నేనేదయినా ప్లాన్ చేస్తే దేవుడు నాకోసం మరొకటి ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి నాకు దక్కిన విషయాన్నీ అలా తీసుకోడం అలవాటు చేసుకున్నా. ప్రస్తుతం నేను ఎటువంటి టాక్ షో చెయ్యట్లేదు. త్వరలో “లక్ ఉంటె లక్ష్మి” లో నాలుగైదు షోలకు నేను హోస్ట్ గా ఉండబోతున్నాను. గేమ్ షోలని హోస్ట్ చేస్తున్నప్పుడు నేను ఎంతలా ఎంజాయ్ చేస్తానో చూడాలి.


మహేష్

అనువాదం రవి
Click Here For Interview in English

Exit mobile version