సమీక్ష : వజ్ర కవచాదరా గోవిందా – ‘బోర్ గా సాగే కామెడీ డ్రామా’ !

Vajra Kavachadhara Govinda movie review

విడుదల తేదీ : జూన్ 14, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : సప్తగిరి, వైభవి జోషి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

దర్శకత్వం : అరుణ్ పవర్

నిర్మాత : నరేంద్ర, జీవిఎన్ రెడ్డి

సంగీతం : బుల్గానియన్

స్క్రీన్ ప్లే : అరుణ్ పవర్

అరుణ్ పవర్ దర్శకత్వంలో కమెడియన్ సప్తగిరి హీరోగా వైభవి జోషి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘వజ్ర కవచధార గోవింద’. శివ శివం ఫిల్మ్స్ బ్యానర్‌ పై నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించగా బుల్గానియన్ సంగీత అందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందోసమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

సప్తగిరి (గోవింద) తన ఊరి జనం వరుసగా క్యాన్సర్ తో చనిపోతుండటాన్ని జీర్ణయించుకోలేకపోతాడు. ఎలాగైనా తన ఊరి జనాన్ని కాపాడటానికి చేసే ప్రయత్నంలో ‘ఎమ్ఎల్ఏ’ లక్ష్మి ప్రసన్న (అర్చన శాస్త్రీ) చేతిలో దారుణంగా మోసపోతాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం సప్తగిరికి తన ఊరి ప్రజలను కాపాడుకోవడానికి ‘నిధి’ రూపంలో మరో అవకాశం వస్తోంది. అయితే నిధి కోసం వెతికే ప్రయత్నంలో రౌడీల చేతిలో చిక్కుకుంటాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల తరువాత సప్తగిరి రౌడీల నుండి ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు ? అసలు సప్తగిరికి నిధి దొరికిందా ? తన ఊరి ప్రజల కష్టాలను తీర్చాడా ?ఇంతకీ రౌడీల నుండి తప్పించుకోగలిగాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

ఈ సినిమాలో హీరోగా నటించిన సప్తగిరి నటనే ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతం మర్చిపోయిన సన్నివేశాల్లో.. రౌడీలతో సాగే సన్నివేశాల్లో అలాగే వజ్రం కోసం గుహలోకి వెళ్లిన సీన్స్ లో సప్తగిరి తన కామెడీ టైమింగ్ తో అలరించారు. ఇక సప్తగిరి సరసన హీరోయిన్ గా నటించిన ‘వైభవి జోషి’ తన నటనతో పాటు తన గ్లామర్ తోనూ ఆకట్టుకున్నే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మొదటి పాటలో అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి.

చివర్లో ఎంటర్ అయిన శ్రీనివాస్ రెడ్డి, వేణు అలాగే మిగిలిన కమెడియన్స్ అందరూ తమ కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. విలన్ బంగారయ్యగా నటించిన నటుడు కూడా తన ఆహార్యంతో కథలో సీరియస్ నెస్ తీసుకొచ్చారు. క్యాన్సర్ తో పిల్లాడి చనిపోయే సన్నివేశం కాస్త ఎమోషనల్ గా కనెక్ట్ చెయ్యడంతో పాటు సినిమాకే హైలెట్ నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ సినిమాలో చెప్పుకోవడానికి చాలా క్యారెక్టర్స్ చాలా ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి కానీ.. ఏది ఆసక్తికరంగా సాగదు. సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో అయితే దర్శకుడు తనకు తోచినట్లు రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడా అన్న భావన కలుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం సినిమాలోని హీరో కథను అతని సమస్యను మరియు అతని గోల్ పరిచయం చెయ్యడానికే ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు.. ఆ తరువాత కూడా ప్లో లేని సీన్లతో, అలరించని కామెడీతో సినిమాని నడిపాడు.

పైగా సినిమాలో హీరోగా కనిపించటానికి సప్తగిరి అనవసరమైన బిల్డప్స్ షాట్స్ ఇవ్వటం కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. సప్తగిరి నుండి కామెడీ కోరుకుంటారు గాని ఫైట్స్ కాదు. కానీ ఈ సినిమాలో కామెడీ సీన్స్ కంటే.. దర్శకుడు యాక్షన్ సీన్స్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇక రెగ్యులర్ కామెడీతో, కన్విన్స్ కానీ మరియు లాజిక్ లేని కామెడీ సన్నివేశాలతో నవ్వించడానికి దర్శకుడు శతవిధాలా ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా నాలుగుసార్లు కూడా నవ్వుకోరు.

దర్శకుడు ఉన్న కంటెంట్ ను చివరికీ ఆర్టిస్ట్ లను కూడా పూర్తిగా వాడుకోలేదు. కథ కథనం కూడా ఆసక్తికరంగా సాగదు. పైగా క్యాన్సర్ వల్ల ఒకే ఊరిలోని జనం వరుసగా చనిపోతున్న ఎమోషనల్ కంటెంట్ ను ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. అది కూడా సరిగ్గా ఎలివేట్ కాలేదు.

 

సాంకేతిక విభాగం :

 

దర్శకుడు అరుణ్ పవర్ పేపర్ మీద రాసుకున్న స్క్రిప్ట్ ను, స్క్రీన్ మీదకు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. పైగా ఆయన రాసుకున్న కథకథనాల్లో సహజత్వం కూడా లోపించింది. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది.

బుల్గానియన్ అందించిన పాటల్లో ఓ పాట ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లు సాగింది. ఎడిటర్, దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగానే ఉన్నాయి.

 

తీర్పు :

 

అరుణ్ పవర్ దర్శకత్వంలో సప్తగిరి హీరోగా వైభవి జోషి హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకున్నే విధంగా సాగలేదు. సప్తగిరి నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన్నప్పటికీ.. కన్వీన్స్ కానీ ట్రీట్మెంట్ మరియు నవ్వు రాని, లాజిక్ లేని కామెడీ సన్నివేశాలు అలాగే ఏ మాత్రం ఆసక్తికరంగా సాగని కథాకథనం లాంటి కొన్ని అంశాలు కారణంగా ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. మొత్తానికి ఈ సినిమా మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకోదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version