సమీక్ష : విశ్వామిత్ర – థ్రిల్ కలిగించలేకపోయిన హారర్ థ్రిల్లర్ !

Vishwamitra movie review

విడుదల తేదీ : జూన్ 14, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : సత్యం రాజేష్, నందిత, అశుతోష్ రానా, ప్రసన్న, చంద్ర తదితరులు

దర్శకత్వం : రాజ్ కిరణ్

నిర్మాత : మాధవి అద్దంకి

సంగీతం : అనూప్ రూబెన్స్

స్క్రీన్ ప్లే : రాజ్ కిరణ్

కమెడియన్ సత్యం రాజేష్, నందిత ప్రధాన పాత్రలలో రాజ్ కిరణ్ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ ” విశ్వామిత్ర”. సత్యం రాజేష్ మొదటిసారి హీరోగా నటించిన ఈ మూవీ ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ:

 

అనాధ అయిన మిత్ర (నందిత) ఎప్పుడూ సమాజం మంచి కోరుతూ, ఇతరుల పట్ల ప్రేమ,దయ కలిగి ఉండే ఓ ట్రెడిషనల్ అమ్మాయి. ఐతే ఓ కంపెనీలో పని చేస్తోన్న మిత్ర పై ఆమె బాస్ (అశుతోష్ రానా) కన్ను పడుతుంది. మిత్రను ఎలాగైనా లొంగదీసుకోవాలనే ఉద్దేశ్యంతో.. కొన్ని నాటకీయ సంఘటనల మధ్య రానా, మిత్రను కొన్ని సమస్యల్లో ప్లాన్డ్ గా ఇరికిస్తుంటాడు. అయితే మిత్ర సమస్యలో చిక్కుకున్న ప్రతిసారి విశ్వ (సత్యం రాజేష్) ప్రత్యక్షమై ఆమెను ఆ సమస్యల నుండి బయటపడేస్తూ ఉంటాడు. దాంతో మిత్ర విశ్వ విషయం గురించి తన ఫ్రెండైన పోలీస్ ఆఫీస్ గోపాల్ (ప్రసన్న)తో చెప్తుంది. ఈ క్రమంలో విశ్వ ఎవరో తెలుసుకోవాలని గోపాల్ ఎంక్వయిరీ మొదలుపెడతాడు. ఈ క్రమంలో విశ్వ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఇంతకీ మిత్రకు విశ్వకు మధ్య ఉన్న సంబందం ఏమిటి ? మిత్రకు ఎదురవుతున్న సమస్యలకు అతను ఎందుకు స్పందిస్తున్నాడు. చివరికీ రానా వేధింపుల నుండి మిత్ర ఎలా బయట పడింది ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

సత్యం రాజేష్ హీరోగా తన మొదటి ప్రయత్నంగా చేసిన ‘విశ్వామిత్ర’లో నటన పరంగా బాగానే చేసాడు. ఇక హీరోయిన్ నందిత అసలు ఫేస్ బుక్, వాట్సాఫ్, ట్విట్టర్ లాంటి సామాజిక మాద్యమాలంటేనే అసహ్యించుకుంటూ, స్మార్ట్ ఫోన్ అంటేనే గిట్టని ట్రెడిషనల్ అమ్మాయిగా చక్కగా నటించింది. సినిమాలో ఆద్యంతం శారీస్ లో కనిపిస్తూ నందిత ఆకట్టుకుంటుంది.

విలన్ పాత్రలో నటించిన అశుతోష్ రానా తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ.. చాల బాగా నటించారు. ముఖ్యంగా ఆయన కేవలం తన నటనతోనే సినిమాలో సీరియస్ నెస్ తీసుకొచ్చిన విధానం బాగా ఆకట్టుకుంటుంది. ఇక జబర్దస్త్ ఫేమ్ చంద్ర రానా అసిస్టెంట్ గా అక్కడక్కడా పంచ్ లు వేస్తూ నవ్వించే ప్రయత్నం చేశాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్:

 

ముందుగా కథలో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకి మొదటి లోపం. అయినా కోమాలో ఉన్న మనిషి ఆత్మ నచ్చినవారితో మాట్లాడటం అనే కాన్సెప్ట్ ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూసేశాం. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన “ఎందుకంటే ప్రేమంట” కాన్సెప్ట్ నే “విశ్వామిత్ర”కి కూడా తీసుకోవడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ గా నిలుస్తోంది.

హీరో పాత్ర ప్రేమించిన అమ్మాయిని కలుసునే క్రమంలో ప్రమాదానికి గురవడం వంటి కీలకమైన సన్నివేశం కూడా “ఎక్కడికి పోతావు చిన్నవాడా” మూవీని గుర్తు చేస్తుంది. ఇలా పలు సినిమాల కథల ఆధారంగా వచ్చిన ఈ సినిమా కథాకథనాలు ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు చాలా పూర్ గా ఉన్నాయి.

మొత్తానికి దర్శకుడు సినిమాని బాగా తెరకెక్కించడంలో కనీస ప్రతిభను కూడా కనబరచలేకపోయాడు. హారర్ థ్రిల్లింగ్ జోనర్ లో వచ్చే ఏ మూవీకైనా స్క్రీన్ ప్లే నే ప్రధాన బలం. కానీ ఈ సినిమాలో స్క్రీన్ ప్లేనే పెద్ద బలహీనత. మరి ఇలాంటి సినిమా ప్రేక్షకుడికి ఎలాంటి ఉత్కంఠ ఇవ్వలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

సాంకేతిక విభాగం :

 

ఈ సినిమాలో దర్శకత్వం లోపం కొట్టొచినట్లుగా కనపడుతుంది. ప్రధానంగా అన్ని కీలక సన్నివేశాలు తేలిపోయాయి. ఒక్క సన్నివేశం కూడా బలంగా ప్రేక్షకుడిని తాకదంటే దర్శకుడి పనితనం అర్ధంచేసుకోవచ్చు. పైగా చిన్న సినిమా కావడంతో నిర్మాణ విలువలు కూడా చాలా పూర్ గా ఉన్నాయి.

సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్రధానమైన లోపంగా నిలుస్తోంది. హీరోకి ఆక్సిడెంట్ జరిగే సీన్ లో అయితే కెమెరామెన్ డొల్లతనం చాలా క్లారిటీగా కనిపిస్తోంది. ఇక ఈ అనూప్ రూబెన్స్ సంగీతం కూడా అంతగా ఆకర్షణీయంగా అనిపించదు. ఎడిటింగ్ పర్వాలేదు.

 

తీర్పు :

 

రాజ్ కిరణ్ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. సినిమా కాన్సెప్టే కాపీ కావడం, పైగా కథ కథనాల్లో ప్లో మిస్ అవ్వడం, సత్యం రాజేష్ సన్నివేశాలన్నీ సహజత్వానికి దూరంగా సాగడం, ఆకట్టుకునే కామెడీ లేకపోవడం.. ఉన్న కాస్త కామెడీ కూడా అస్సలు ఆకట్టుకోకపోవడం, కథనం బాగా స్లోగా సాగడం.. వంటి అంశాలు ప్రేక్షకుడికి సినిమా పై ఆసక్తిని చంపేస్తాయి. చివిరిగా ఈ ‘విశ్వామిత్ర’ సగటు ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకోదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version