సమీక్ష : కౌసల్య కృష్ణమూర్తి – సందేశంతో కూడిన స్పోర్ట్స్ డ్రామా

Kousalya Krishnamurthy movie review

విడుదల తేదీ : ఆగస్టు 23, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  3/5

నటీనటులు : ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్, కార్తీక్ రాజు,ఝాన్సీ, వెన్నెల కిషోర్

దర్శకత్వం : భీమనేని శ్రీనివాస రావు

నిర్మాత‌లు : కే ఎస్ రామారావు

సంగీతం : ధిబు నినన్ థామస్

సినిమాటోగ్రఫర్ : అండ్రూ

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రదారురాలిగా కార్తీక్ రాజు హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “కౌసల్య కృష్ణ మూర్తి”.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గత ఏడాది తమిళ్ లో “కనా”గా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కించబడింది.మరి ఈ చిత్రం మన తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించగలిగిందో ఇప్పుడు సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే వ్యవసాయం అలాగే క్రికెట్ అంటే అపారమైన ఇష్టం, గౌరవం ఉన్న వ్యక్తి కృష్ణమూర్తి(రాజేంద్ర ప్రసాద్).అతని కూతురే కౌసల్య,ఒకసారి క్రికెట్ చూస్తుండగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోవడం చూసి కృష్ణ మూర్తి మొట్టమొదటిసారిగా కన్నీరు పెట్టుకుంటాడు.ఈ సంఘటన చూసి కౌసల్య ఎలా అయినా సరే ఒక క్రికెటర్ గా మారి తన తండ్రి ఆశయాన్ని తాను నెరవేర్చాలని అనుకుంటుంది.ఈ క్రమంలో తాను క్రికెట్ ఎలా నేర్చుకుంది?ఒక ఆడపిల్లగా ఆమె ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి?హీరో పాత్ర ఈమెకు ఎలా సహాయపడింది?ఈ కథలో శివ కార్తికేయన్ పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?చివరగా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందా లేదా అన్నది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకు మొట్టమొదటగా చెప్పుకునే ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే ఆల్రెడీ హిట్టయిన చిత్రాన్ని రీమేక్ గా ఎన్నుకోవడమే అని చెప్పాలి.దాన్ని ఎక్కడా కూడా చెడగొట్టకుండా రీమేక్ సినిమాలు తీయడంలో దిట్ట అయినటువంటి భీమనేని శ్రీనివాస్ చక్కగా హ్యాండిల్ చేసారు.ఒక పక్క క్రికెట్ మరోపక్క వ్యవసాయం అనే రెండు కోణాలను భీమనేని తెరేక్కించిన తీరు హర్షణీయం.అలాగే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అందులోను క్రికెట్ ఆట కావడం వల్ల ఎక్కువ మందే ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారు.

అందుకు తగ్గట్టుగానే సినిమాలో చూపించే క్రికెట్ ఆడే సన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయి.అలాగే మొదటి సగంలో జబర్దస్త్ ఫేమ్ మహేష్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ ట్రాక్ ఎంటెర్టైమెంట్ కోరుకునే ఆడియెన్స్ ను మెప్పిస్తుంది.ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమా టైటిల్ లో ఉన్నట్టుగానే ప్రధాన పాత్రధారి కౌసల్య పాత్ర పైనే ఈ చిత్రం అంతా నడుస్తుంది.ఈ పాత్రలో కనిపించిన ఐశ్వర్య రాజేష్ తన తెలుగులో మొట్టమొదటి సినిమా అయినా సరే చాలా పరిణితి కలిగిన నటన కనబర్చింది.ఈ విషయంలో ఆమెను మెచ్చుకొనే తీరాలి.

అంతే కాకుండా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మరియు ఐశ్వర్యలు మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి.ఒక తండ్రి కూతుర్ల మధ్య నిజ జీవితంలో కూడా ఎలాంటి అఫెక్షన్ ఉంటుందో భీమనేని చాలా బాగా చూపించారు,ఈ సీన్స్ తక్కువే ఉన్నా కూడా ఖచ్చితంగా చాలా మంది కనెక్ట్ అవుతారు.ఒక పక్క క్రికెట్ కోసం చెప్తూనే మనకి అన్నం పెట్టే రైతు కోసం,వారు చేసే వ్యవసాయం కోసం ఇచ్చిన సందేశం సినిమా చూసే ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఇక అలాగే మరో ముఖ్యపాత్రలో కనిపించిన తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ పాత్ర ఎంటర్ అయ్యిన దగ్గర నుంచి సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది.అలాగే హీరోగా కనిపించిన కార్తీక్ రాజు నటన కూడా బాగుంటుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం మొదటి నుంచే అంత ఆసక్తికరంగా ఏమి మొదలయినట్టు అనిపించదు.అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు అంతగా కూడా ఏమి నవ్వించవు.అలాంటి సీన్స్ అన్ని తగ్గించి ఉంటే బాగున్ను.అలాగే రాజేంద్ర ప్రసాద్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రేక్షకుడికి తెలిజేయడానికి కూడా కొన్ని అనవసరమైన సీన్స్ పెట్టినట్టు అనిపిస్తుంది.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర మీదే ఎక్కువ బేస్ అయ్యి ఉండడం వల్ల హీరో పాత్రను మరీ పక్కన పెట్టేసినట్టుగా అనిపిస్తుంది.ముఖ్యంగా అయితే ఇప్పటికే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చేసాయి.

అందువల్ల చాలా సన్నివేశాలు మనం ముందుగానే ఊహించేయవచ్చు. అలాగే హీరోయిన్ పాత్రలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టేందుకు హీరో పాత్ర అవకాశం ఇస్తుంది.కానీ చివరకు వచ్చేసరికి అర్ధాంతరంగా అసలు హీరో పాత్రకు,సినిమాకు ముగింపు ఇచేసినట్టు అనిపిస్తుంది.ఈ విషయంలో భీమనేని ఏమన్నా మార్పులు చేర్పులు చేసి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

 

ఇది వరకే మంచి హిట్టయిన స్టోరీలను హ్యాండిల్ చెయ్యడంలో దర్శకుడు భీమనేని మరో సారి సక్సెస్ అయ్యారనే చెప్పాలి.కానీ ఫస్ట్ హాఫ్,సెకండాఫ్ లలో అక్కడక్కడా నెమ్మదించారు.అలాగే అండ్రూ అందించిన సినిమాటోగ్రఫీ సన్నివేశాలకు తగ్గట్టు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంది.ముఖ్యంగా ధిబు నినన్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.ఈ సినిమాలోని హిట్ ట్రాక్ అయినటువంటి అమ్మాడివే తప్ప మిగతా పాటలు పర్వాలేదనిపిస్తాయి.సినిమాకు నిర్మాత కె ఎస్ రామారావు అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

 

ఇక ఫైనల్ గా తమిళ్ లో మంచి విజయాన్ని అందుకున్న “కనా” చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన “కౌసల్య కృష్ణమూర్తి” అనే తండ్రి కూతుర్ల మధ్య జరిగే ఒక ఎమోషనల్ జర్నీ బాగుందని చెప్పొచ్చు.కేవలం క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో మాత్రమే కాకుండా వ్యవసాయం అనే కాన్సెప్ట్ పై కూడా ఇచ్చిన సందేశం చక్కగా కుదిరగా శివ కార్తికేయన్ పాత్ర వచ్చిన తర్వాత నుంచి సినిమా మరింత ఆసక్తికరంగా సాగడం వంటివి హైలైట్ అవ్వగా అక్కడక్కడా నెమ్మదించిన కథనం ముఖ్య పాత్రలకే ఇంపార్టెన్స్ తగ్గినట్టు అనిపించడం,ఇది వరకే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలను చూసిన వారికి అయితే ఈ చిత్రం అంత గొప్పగా అనిపించకపోవచ్చు.

123telugu.com Rating :  3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version