ఇంటర్వ్యూ : నాని- పదే పదే అందరూ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు?

నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన తాజాగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం.

 

గ్యాంగ్ లీడర్ మూవీ ఎలా కార్యరూపం దాల్చింది?

 

ఎప్పటి నుండో విక్రమ్ గారు నేను కలిసి పనిచేయాలని చూస్తున్నాం. నేను జెర్సీ మూవీ చిత్రీకరణలో ఉన్నప్పుడు నాకు ఆయన కొన్ని కథలు వినిపించారు. వాటిలో నాకు గ్యాంగ్ లీడర్ కథ నచ్చింది. ఇక నేను సుముఖత తెలపడంతో ఈ చిత్రం సెట్స్ పైకెళ్లింది.

 

గ్యాంగ్ లీడర్ టైటిల్ ఆలోచన ఎవరిది ?

 

గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచన విక్రమ్ గారిదే. ఐతే ఈ టైటిల్ పై కొన్ని వివాదాలు, భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. అందుకే మేము నాని గ్యాంగ్ లీడర్ అని పెట్టడం జరిగింది. నా దృష్టిలో ఈ టైటిల్ ఈ కథకు చక్కగా సరిపోతుంది. మూవీ చూసిన తర్వాత మీకు కూడా అర్థం అవుతుంది.

 

విక్రమ్ సినిమాలలో క్లిష్టమైన స్క్రీన్ ప్లే ఉంటుంది, మరి ఈ చిత్రం?

 

గ్యాంగ్ లీడర్ చిత్రంలో కొన్ని ఆసక్తికర మలుపులు ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే మరీ అంత సంక్లిష్టంగా ఉండదు. విక్రమ్ ఈ చిత్రాన్ని అందరికి అర్థమయ్యేలా సింపుల్ గా ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారు.

 

మీరు గ్యాంగ్ లీడర్ చిత్రం చేయడానికి కారణాలు చెప్పండి?

 

ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ కథ కొత్తగా ఉంటుంది. రివేంజ్ స్టోరీని హాస్యంతో వినూత్నంగా దర్శకుడు తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఐదుగురు ఆడవాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరికి కథలో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే నేను గ్యాంగ్ లీడర్ చేయడానికి ఒప్పుకున్నాను.

 

విలన్ పాత్రకు హీరో కార్తికేయను తీసుకోవాలన్న ఆలోచన ఎవరిదీ?

 

ఆ పాత్ర కోసం మొత్తం నలుగురు పేర్లు అనుకోవడం జరిగింది. మొదటగా కార్తికేయను సంప్రదించి కథ చెప్పగా ఆయన నాకు ఫోన్ చేసి ఆ పాత్ర చేయడానికి సముఖత తెలిపారు. గ్యాంగ్ లీడర్ లో కార్తికేయ ది కీలకపాత్ర. ఆయన పాత్ర అందరికి బాగా కనెక్ట్ అవుతుంది.

 

జెర్సీ మూవీ ఫలితం పై మీ అభిప్రాయం చెప్పండి?

 

చాలా మంది ఇదే ప్రశ్న ఎందుకు పదే పదే అడుగుతున్నారో అర్థం కావడం లేదు. జెర్సీ మూవీకి మంచి స్పందన రావడంతో పాటు, కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. జెర్సీ బాక్సాఫీస్ వద్ద 30కోట్ల వసూళ్లు రాబట్టింది. అలాగే జెర్సీ అనేక ఇతర భాషలలో రీమేక్ చేయబడుతుంది. జెర్సీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్.

 

జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలలో ఏది మీకు కష్టంగా అనిపించింది?

 

జెర్సీ చిత్రం కొరకు మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చింది, గ్యాంగ్ లీడర్ విషయంలో అలా కాదు. విక్రమ్ కుమార్ వలన గ్యాంగ్ లీడర్ షూటింగ్ స్మూత్ గా హ్యాపీ గా గడిచిపోయింది.

 

చిత్ర పరిశ్రమలో 11ఏళ్ల ప్రయాణం చేశారు,ఆ అనుభవం ఎలా ఉంది?

 

11ఏళ్ల సమయం ఎప్పుడైందో కూడా తెలియనంతగా కాలం గడిచిపోయింది. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న అభిమానులకు కృతఙ్ఞతలు.

Exit mobile version