శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రంతో అమల అక్కినేని తిరిగి తెర మీద కనపడనున్నారు. ఈరోజు ఆమె మాతో “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్ర విశేషాలను, షూటింగ్ విశేషాలను, కుటుంబ విషయాలను పంచుకున్నారు. అమలతో మాట్లాడటం నిజంగా చాలా బాగుంది ఆమె తనదయిన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. ఆమెతో మేము జరిపిన సంభాషణ మీకోసం.
ప్ర) మీరు దాదాపుగా 20 సంవత్సరాల తరువాత వెండి తెర మీద కనిపించనున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు?
జ) (నవ్వుతూ) అవును దాదాపుగా 20 ఏళ్ళ తరువాత తెర మీదకి తిరిగి కనిపిస్తున్నాను కాని నేను ఎప్పుడు సినిమాతో సంబంధం కోల్పోలేదు తెర వెనుక ఏదో విధంగా సిని పరిశ్రమతోనే ఉన్నాను ఎందుకంటే నా కుటుంబం అంతా చిత్రాలతో ముడి పడింది కాబట్టి నేను ఎప్పుడు సినిమా పరిశ్రమకి దూరంగా వెళ్ళలేదు.
ప్ర) శేఖర్ చేసిన ఆఫర్ ని ఒప్పుకున్న తరువాత నాగార్జున గారు ఏమన్నారు?
జ) ఆయన ముందు నవ్వారు, కాస్త ఆశ్చర్యపోయారు కూడా కాని తర్వాత పూర్తి సహకారం అందించారు ఈ 20 ఏళ్ళలో పరిశ్రమ చాలా మారింది దాని గురించిన సలహాలు ఆయన ఇచ్చారు. “నీకు ఇంట్రెస్ట్ ఉంటె నా ఫిలింలోనే చేసే దానివి కదా” అని కూడా అన్నారు.
ప్ర) ఇంత విరామం తారువాత కెమెరా ముందుకి రావడం ఎలా అనిపించింది?
జ) నేను కూడా ఎలా నటించాలో మరిచిపోయాను మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను కాని తరువాత శేఖర్ నన్ను నాలాగా ఉండమని చెప్పారు “నటించకండి మీరు మీలాగా ఉండండి నేను అక్కడక్కడ కొన్ని విషయాలను చెబుతూ ఉంటాను” అని అన్నారు. కొంతమంది యువ నటులు కూడా కాస్త ఇబ్బంది పడటం చూశాను వాళ్ళతో వెళ్లి మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పాను.
ప్ర) ఈ పాత్రను ఒప్పుకోడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏవి?
జ) చాలా విషయాలు ఇందులోకి వస్తాయి ఆయన ఈ పాత్రను ఏడు రోజుల్లో ముగించేస్తానని ప్రమాణం చేశారు( తన మాట మీద నిలబడలేకపోయడన్నట్టు నవ్వారు). కొన్ని రషస్ కూడా చూపించారు అదే అయన ప్రత్యేకత విజువల్స్ చూశాక నాకు చాలా బాగా నచ్చాయి ఇందులో అమ్మాయికి అమ్మ పాత్రను చెయ్యడం కాదనలేకపోయాను.
ప్ర) శేఖర్ గారు ప్రమాణం చేసినట్టే మీ పాత్రను ఏడు రోజుల్లో పూర్తి చేశారా?
జ) (నవ్వుతూ). 7 రోజుల్లో అయితే పూర్తి కాలేదు. మండే వేసవిలో ఈ చిత్ర చిత్రీకరణ జరుపుకున్నాం కాబట్టి ప్రొద్దున 5 నుండి 7 లేదా 8 గంటల వరకు మాత్రమే పని చేసేవాళ్ళం దీనివలన ఆ పాత్ర 7 రోజుల్లో పూర్తి కాలేదు.
ప్ర) ఈ చిత్రంలో మీ పాత్ర గురించి కాస్త చెప్పండి?
జ) ఈ చిత్రంలో నేను భర్త చనిపోయి ఒంటరిగా కూతురిని పెంచే మహిళ పాత్రలో కనిపించనున్నాను. నాది చాలా బలమయిన మనస్తత్వం గల పాత్ర చాలా ప్రేరణ కలిగించే పాత్ర ఇది. తను ఎదుర్కున్న పరిస్థితులతో సంబంధం లేకుండా సానుకూల దృక్పధంతో స్పందిస్తూ ఉండే పాత్ర ఇది అందరు ఇష్టపడే పాత్ర ఇది నాకు ఈ పాత్రలో చెయ్యటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ పాత్రలోని మధురత్వాన్ని ధృడత్వాన్ని శేఖర్ అద్బుతంగా చూపించగలిగారు. బయటకి మృదువుగా కనిపించి లోపల దృడంగా ఉండే మహిళ పాత్ర ఇది.
ప్ర) మీరు నిజ జీవితానికి ఈ పాత్రకి పోలికలు ఏమయినా ఉన్నాయా?
జ) నిజానికి నేను అటువంటి పరిస్థితులను ఎదుర్కొనాల్సి రాలేదు. కాని నేను సమాజంతో కలిసి పని చేసినప్పుడు అలాంటి మహిళలు చాలా మందిని కలిసాను. ఈ చిత్రం విడుదలయ్యాక అలాంటి మహిళలు సమాజంలో మరింత గౌరవింపబడతారని ఆశిస్తున్నాను.
ప్ర) మీరు గతంలో చాలా మంది పెద్ద దర్శకులతో పని చేశారు శేఖర్ కమ్ములతో పని చెయ్యడం మీకు ఎలా అనిపించింది?
జ) నేను కథానాయికగా నటించే సమయంలో మేము ఎలా చేశాము అని చూసుకోడానికి మానిటర్స్ ఉండేవి కాదు. పూర్తిగా దర్శకుడి మీద ఆధారపడాల్సి వచ్చేది మేము చేసిన చిత్రాన్ని చూడటానికి రెండు నెలల దాకా వేచి చూసేవాళ్ళం కాని ఈ 20 ఏళ్ళలో టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది.ఫిలిం మేకింగ్ కాస్త సులభ తరం అయ్యింది శేఖర్ ఫిలిం మేకింగ్ చదువుకున్నాడు కూడా. అతనికి ఏం కావాలో అతనికి బాగా తెలుసు అతనితో పని చెయ్యడం చాలా సులభం. తనతో పని చెయ్యడం సులభంగా ఉండేలా శేఖర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ప్ర) ఈ చిత్రాన్ని మీరు చూసారా? మీరు తిరిగి తెర మీద కనపడడానికి ఇది సరయిన పాత్ర అని అనుకుంటున్నారా?
జ) నేను అలా అనుకోవట్లేదు కాని నేను ఈ చిత్రాన్ని ఎలా ఒప్పుకున్నాను ఎలా చేశాను అన్నది కూడా తెలియదు ఇంకా ఈ చిత్రాన్ని నేను చూడలేదు రాబోయే వారం ఈ చిత్రాన్ని చూడబోతున్నాను.
ప్ర) శిరిడి సాయి చిత్రాన్ని చూసారా?
జ) (స్పందించే ముందు ఆమె మోహంలో వెలుగు కనిపించింది) చూశాను నాగ్ ని ఆ పాత్రలో చూడటం నాకు చాలా ఆనందం కలిగించింది. ఈ చిత్రం చూశాక నేను కాసేపు ఏం మాట్లాడలేకపోయాను చిత్రం అంత అయిపోయాక ఉద్వేగానికి లోనయ్యాను . తరువాత నేను ఆయనతో చెప్పిన మాట “నాకు చాలా గర్వంగా ఉంది”.
ప్ర) మీరు ఇంకా వరుసగా చిత్రాలను చేస్తారా?
జ) నా కుటుంబానికి మరియు సమాజానికి నేను ఉపయోగపడటం మీదే నా దృష్టి అంతా ఉంటుంది ఇప్పుడు నేను ప్రత్యేకంగా కెరీర్ ఆరంభించాలని అనుకోవట్లేదు నాకు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నేను ఎటువంటి పాత్ర కోసం ఎదురుచూడదలచుకోలేదు కాని మంచి పాత్రలు అది కూడా 7 రోజుల్లో పూర్తయ్యే పాత్రలు (నవ్వుతూ) వస్తే తప్పకుండా చెయ్యడానికి ప్రయత్నిస్తా.
ప్రశ్న) అఖిల్ ఎప్పుడు అరంగేట్రం చేయనున్నాడు?
స) నాకు తెలిసి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం అఖిల్ లాస్ ఏంజెల్స్ లో ఫిల్మ్ మరియు థియేటర్ కి సంభందించిన కోర్సు చేస్తున్నాడు. నేను అఖిల్ ని సంతోషంగా ఉండేలా చూసుకుంటాను, తను ఏమి కావాలనుకుంటే అది అవుతాడు అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
ప్రశ్న) మీరు భవిష్యత్తులో చేయనున్న సినిమాలేమిటి?
స) నాగార్జున ‘శిరిడి సాయి’ సినిమాకి వచ్చిన డబ్బుని సొసైటీ కోసం వాడమన్నారు. అందువలన నేను ఆ డబ్బుతో బ్లూ క్రాస్ ఆవరణలో కొన్ని శాశ్వతమైన భవనాలు నిర్మించాలనుకుంటున్నాను, అలాగే కొన్ని ప్రాంతాల్లో విద్యకు సంభందించిన కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను, కావున నేను భవిష్యత్తులో ఆ పనులతో బిజీగా ఉండబోతున్నాను.
ఇంతటితో అమలతో మా సంభాషణ ముగిసింది ఆమె ఆకర్షణీయమయిన నవ్వు , అందమయిన మాటలు మాతోనే ఉన్నాయి.