విడుదల తేదీ: 14 సెప్టెంబర్ 2012 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5 | ||
దర్శకుడు : శేఖర్ కమ్ముల | ||
నిర్మాత : శేఖర్ కమ్ముల | ||
సంగీతం: మిక్కీ జే మేయర్ | ||
నటీనటులు : శ్రియ, అమల అక్కినేని, అంజలా జావేరి |
శేఖర్ కమ్ముల చూడటానికి ఎంత సింపుల్ గా ఉంటారో అయన సినిమాలు కూడా అంతే సింపుల్ మరియు బ్యూటిఫుల్ గా ఉంటాయి. లీడర్ సినిమా ఆశించిన స్థాయి ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సారి భారీ గ్యాప్ తీసుకుని దాదాపు 2 సంవత్సరాలు పైగా కష్టపడి తీసిన సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. హ్యాపీ డేస్ తరహాలో అభిజీత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా వంటి కొత్త వారిని పరిచయం చేస్తూ అమలా, శ్రియ, అంజలా జవేరి ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా బ్యూటిఫుల్ గా ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
హ్యాపీ డేస్ సినిమాలోని పాత్రలనే మళ్లీ కంటిన్యూ చేస్తూ … కాలేజ్ బ్యాక్ డ్రాప్ నుండి సన్ షైన్ వ్యాలీ అనే కాలనీకి మార్చారు. శ్రీనివాస్ (అబిజీత్), నాగరాజు (సుధాకర్), అభి (కౌశిక్), పద్మావతి (షగుణ్), లక్ష్మి (జారా) వీరంతా సన్ షైన్ కాలనీలో బి ఫేజ్ లో ఉండే ఒక బ్యాచ్. వీరికి పోటీగా గోల్డ్ ఫేజ్ లో ఉండే మరొక బ్యాచ్. ఈ రెండు గ్రూప్స్ మధ్య తగాదాలు ప్రేమలు వగైరా వగైరా ఇత్యాది అంశాలను కథనంగా తీసుకుని తెరకెక్కించారు. శ్రీనివాస్ కి తన మరదలు పద్మావతి అంటే ఇష్టం, సుధాకర్ కి పక్కింట్లో కొత్తగా దిగిన లక్ష్మి అంటే ఇష్టం, కౌశిక్ కి తన కంటె వయసులో పెద్దదైన పారు (శ్రియ) అంటే ఇష్టం. వీరి ప్రేమని పెళ్లి వరకు తీసుకు వెళ్ళడానికి పడ్డ కష్టాలు. లైఫ్ అంటే డబ్బు మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అని చూపించే ప్రయత్నం చేసారు.
ప్లస్ పాయింట్స్ :
అబిజీత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా దాదాపు అంతా కొత్త వారే కావడంతో సినిమా అంతా ఫ్రెష్ ఫీల్ తో ప్రారంభం అవుతుంది. అబిజీత్ చూడడానికి నాగ చైతన్య లాగా ఉన్నాడు. మొదటి సినిమా అయినా బాగానే చేసాడు. సుధాకర్ తెలంగాణా యాసలో మాట్లాడుతూ హ్యాపీ డేస్ సినిమాలోని రాజేష్ పాత్రని ఇమిటేట్ చేస్తూ నవ్వించే ప్రయత్నం చేసాడు. షగుణ్,జారా ఇద్దరు బావున్నారు. నటన విషయంలో పెద్దగా ఎంచటానికి ఏమీ లేదు. అమల డబ్బింగ్ కొంత ఇబ్బంది పెట్టిన పతాక సన్నివేశాల్లో నటనతో బాగా ఏడిపించింది.
మైనస్ పాయింట్స్ :
హ్యాపీ డేస్ సినిమాకి కొత్త పాత్రలని క్రియేట్ చేసి కాలేజ్ బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఆసక్తికరమైన కథనంతో ఉండటంతో ఆ సినిమా హిట్ అయింది. ఆ సినిమా పాత్రలనే మళ్లీ కంటిన్యూ చేస్తూ కేవలం బ్యాక్ డ్రాప్ మాత్రమే మార్చి మెప్పించాలని చూసాడు దర్శకుడు. సినిమాలోని అన్ని దాదాపు పాత్రలో అన్ని పాత్రలు తెలిసినవే కావడంతో అస్సలు ఆసక్తి కలిగించలేదు. అమల పాత్రతో మదర్ సెంటిమెంట్ పండించారు కాని అప్పటికే సమయం మించిపోవడంతో అది సరిగా చేరలేదు. సినిమాలో మెయిన్ మైనస్ హ్యాపీ డేస్ ఫ్లేవర్ కంటిన్యూ చేయడం అయితే రెండోది సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉండటం. ఫస్టాఫ్ అంతా బి ఫేజ్, గోల్డ్ ఫేజ్ మధ్య గొడవలు అంటూ సాగదీసి బాగా బోర్ కొట్టించగా సెకండాఫ్ లో కూడా అదే ధోరణి కొనసాగించి విసుగు తెప్పించాడు దర్శకుడు. శ్రియ అందంగా ఉందనే కాని అబికి, ఆమెకి మధ్య లవ్ ట్రాక్ అస్సలు పండలేదు. జవేరి కూడా సో సో. సెకండాఫ్ లో వచ్చే విమానం సన్నివేశం చూస్తే శేఖర్ కమ్ముల ఇంత చెత్తగా కూడా తీయగలరా అనిపించక మానదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు ఒక 30 నిముషాలు కత్తెర వేస్తే బానే ఉంటుంది.
సాంకేతిక విభాగం :
విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ప్లస్ అని చెప్పుకోవాలి. ఇట్స్ యువర్ లవ్ పాటలో అయన కెమెరా పని తనం స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారికి కత్తెర వేయడానికి మొహమాట పడ్డారో ఏమో గని దాదాపు 30 నిమిషాల సినిమాని ఎడిట్ చేయాల్సింది అలాగే వదిలారు. మికీ జే మేయర్ సంగీతంలో టైటిల్ సాంగ్, ఇట్స్ యువర్ లవ్ పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం ఏ మాత్రం ఆసక్తికరంగా లేదు. ఈ సినిమా కోసం సన్ షైన్ వ్యాలీ అనే సెట్ వేసి నిజంగానే కాలనీ సెట్ వేసిన తోట తరణి గారిని ప్రతి ఒక్కరు అభినందించి తీరాలి.
తీర్పు :
శేఖర్ కమ్ముల గత సినిమాలు ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ సినిమాలని గమనిస్తే ఆ సినిమాల్లో ఉండే రియాలిటీ, ఫ్రెష్ నెస్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో లోపించాయి. అమల, కొత్త వారంతా బాగానే నటించినప్పటికీ కేవలం పతాక సన్నివేశాలు తప్ప సినిమా అంతా బాగా కొట్టించడం, దాదాపు మూడు గంటల నిడివి గల సినిమాని ఏ మాత్రం ఆసక్తి లేకుండా ఉండటం మైనస్ అయ్యాయి. టైటిల్లో చెప్పినంత బ్యూటిఫుల్ గా లేనప్పటికీ టైం పాస్ కోసం ఒకసారి చూడండి.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
అశోక్ రెడ్డి. ఎమ్