రిలీజ్ కు ముందే లాభాల కోసం యత్నిస్తోన్న త్రివిక్రమ్


తన సినిమాలో చమత్కారమైన సంభాషణలు, గుర్తుండి పోయే సన్నివేశాలకు పెట్టింది పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. బడ్జెట్ ను అమాంతం పెంచేస్తారని, ప్రొడక్షన్ లో విపరీతమైన జాప్యం చేస్తారన్న అపవాదు కూడా ఈ ప్రముఖ దర్శకుని సొంతం. వీటినుండి బయటపడాలని ప్రస్తుతం త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే చిత్ర నిర్మాణ వ్యయాన్ని తగ్గించే చర్యలకు పూనుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ తో చేస్తున్న తన తాజా చిత్రంలో అన్ని విభాగాల్లోనూ కాస్ట్ కట్టింగ్ చర్యలు అవలభించినట్టు తెలిసింది. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తుంటే, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

సాధ్యమైనంత తక్కువ తో ఖర్చుతో సినిమాను తెరకెక్కించాలన్న ఉద్దేశ్యంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ సైతం తమ రెమ్యునరేషన్ తగ్గించు కున్నట్టు తెలిసింది. ఖచ్చితమైన స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్లి ప్రొడక్షన్ లో జాప్యాన్ని నివారించాలని త్రివిక్రమ్ సాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. పరిశ్రమ సాధారణ నివేదికల ప్రకారం అల్లు అర్జున్ సినిమాలు 34 కోట్ల వ్యాపారాన్ని చేయగలవని అంచనా. అందుకని ఈ తాజా సినిమాను 30 కోట్ల లోనే పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నట్టు వినికిడి. తద్వారా ప్రొడ్యూసర్ దానయ్యకు ఈ సినిమా విడుదలకు ముందే 4 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టాలని త్రివిక్రమ్ పావులు కడుపుతున్నారట.

ఈ చర్యలు ఎంతవరకూ సఫలీకృతం అవుతాయో వేచి చూడాలి. మొత్తానికి తక్కువ బడ్జట్ లో చిత్రాన్ని పూర్తి చేయాలన్న త్రివిక్రమ్ తలంపుకు మెచ్చుకోవాల్సిందే . గుడ్ గోయింగ్ త్రివిక్రమ్ .

Exit mobile version