విడుదల తేదీ : సెప్టెంబరు 20, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాళిని రవి, బ్రహ్మనందం, బ్రహ్మజీ, సత్య తదితరులు
దర్శకత్వం : హరీష్ శంకర్
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట
సంగీతం : మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫర్ : ఆయాంక బోస్
ఎడిటర్ : చోటా కే ప్రసాద్
హీరో వరుణ్ తేజ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేష్. వరుణ్ గత చిత్రాలకు భిన్నంగా ఊర మాస్ గ్యాంగ్ స్టర్ గా చేయడం జరిగింది. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు విడుదలైంది. మరి గద్దలకొండ గణేష్ గా వరుణ్ ఎంత వరకు మెప్పించారో సమీక్షలో చూద్దాం.
కథ:
అభిలాష్ (అధర్వ) సినిమాపై ఉన్న మక్కువతో మూవీ డైరెక్టర్ అవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాడు.ఒక సీనియర్ దర్శకుడితో ఎలాగైనా ఒక ఏడాదిలో సినిమా తీస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఒక గ్యాంగ్ స్టర్ మూవీ చేయాలని భావించిన అభిలాష్ మూవీ కథ కొరకు ఒక ఏరియాలో పెద్ద గ్యాంగ్ స్టర్ గా చలామణి అవుతున్న గద్దలకొండ గణేష్(వరుణ్ తేజ్) జీవితాన్ని అతనికి తెలియకుండా అధ్యయనం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అభిలాష్ గురించి తెలుసుకున్న గద్దలకొండ గణేష్, తన గురించి కాదు, తానే హీరోగా సినిమా తీయాలని అభిలాష్ ని బెదిరిస్తాడు. మరి అభిలాష్ గద్దలకొండ గణేష్ తో సినిమా తీశాడా? అసలు ఈ గద్దలకొండ గణేష్ ఎవరు? సినిమా డైరెక్టర్ కావాలని కలలుకన్న అభిలాష్ కోరిక తీరిందా? గద్దలకొండ గణేష్ మరియు అభిలాష్ ల కథ చివరికి ఎలా ముగిసింది? అన్నది తెరపైన చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
ఈ మూవీకి ప్రధాన బలం వరుణ్. ఊర మాస్ గ్యాంగ్ స్టర్ పాత్రలో ఆయన జీవించారని చెప్పొచ్చు. తెలంగాణా మాండలికంలో ఆయన చెప్పిన మాస్ డైలాగ్స్ చక్కగా పేలాయి. ఇప్పటివరకు ఒక లవర్ బాయ్ ఇమేజ్ లో కనిపించిన వరుణ్, గద్దలకొండ గణేష్ పాత్రలో కొత్త అనుభూతి కలిగిస్తాడు. భారీ కట్ అవుట్ కలిగిన వరుణ్ డీగ్లామర్ రోల్ లో మాస్ మేనరిజంతో వన్ మ్యాన్ షో చేశారు.
హీరోకి సమానమైన మరో పాత్ర చేసిన తమిళ నటుడు అధర్వ యంగ్ డైరెక్టర్ పాత్రలో చక్కగా సరిపోయాడు. సీరియస్ సన్నివేశాలతో పాటు కమెడియన్ సత్య కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ లో కూడా ఆయన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. అధర్వకు జంటగా నటించిన మృణాలిని రవి చాలా అందంగా ఉన్నారు. అధర్వ, మృణాళిని మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆహ్లాదకరంగా సాగుతాయి. వీరి కెమిస్ట్రీని ఎలివేట్ చేసేలా సాగే గగనపు వీధిలో సాంగ్ సంధర్బాను సారంగా సాగింది.
ఇక ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో 90ల కాలం నాటి అమ్మాయి గెటప్‌లో పూజా పక్కా తెలుగమ్మాయి లుక్ అద్భుతంగా ఉంది. రెండు జడలు, లంగావోణీలో పూజా సరికొత్తగా కనిపించింది. తక్కువ నిడివి గల పాత్రలో షార్ట్ అండ్ స్వీట్ అన్న భావన కలిగించింది.
ఇక వరుణ్ పూజాలపై తెరకెక్కిన శ్రీదేవి, శోభన్ బాబుల హిట్ సాంగ్ ‘వెల్లువొచ్చి గోదారమ్మ’ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అభినయం నుండి ఆహార్యం వరకు వరుణ్, పూజా పాత పాటను అనుకరించారు. వరుణ్ ఐతే కెరీర్ ఇంట్లో ఒకప్పటి చిరంజీవిని గుర్తు చేశారు.
సెకండ్ హీరో అధర్వ స్నేహితుడిగా చేసిన సత్య కామెడీ తెరపై నవ్వులు పూయించింది. సత్య ఈ మూవీకి చాలా ప్లస్ అయ్యాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఆయన కామెడీ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను,రచ్చ రవి కూడా తమదైన కామెడీ పండించడంలో విజయం సాధించారనే చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :
అధర్వ మరియు మృణాలిని రవి మధ్య నడిచే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు సత్య కామెడీ తో ఎంటర్టైనింగ్ గా సాగిన ఫస్ట్ హాఫ్ రెండవ సగంలో ఈ రెండు మిస్సయ్యాయి.
హీరోయిజం ఎలివేషన్ కోసం హరీష్ చేసిన మార్పులు మూవీ సోల్ ని దెబ్బతీశాయి. దీనితో జిగర్తాండకు మూవీకి ప్రధాన బలమైన క్లైమాక్స్ ఎమోషన్స్ ఈ చిత్రంలో తెరపై ఆవిష్కృతం కాలేదు.
తన పాత్ర పరంగా గంభీరముగా ఉన్న తేజ్ సినిమాలో వచ్చివెళ్లే పాత్రలా అనిపిస్తుంటాడు కానీ, సినిమాలో భాగం అన్న భావన కలగదు. ఒక పర్ఫెక్ట్ క్లాసిక్ స్టోరీ కి హరీష్ చేసిన అదనపు ఆకర్షణలు నప్పలేదు.
వరుణ్ మాస్ గెటప్ చూసి బీభత్సమైన పోరాటాలు ఉంటాయని ఆశించినవారికి కనీసం ఒక్క పూర్తి స్థాయి యాక్షన్ ఎపిసోడ్ కూడా లేకపోవడం నిరాశకు గురిచేస్తుంది.
సాంకేతిక విభాగం:
గబ్బర్ సింగ్ మూవీ ఫార్ములా మరోసారి గద్దలకొండ గణేష్ మూవీకి కూడా అప్లై చేసిన హరీష్ కొంత మేర విజయం సాధించినా, జిగర్తాండ మూవీ విజయానికి కారణమైన ఎమోషన్స్ అనేవి మిస్ అయ్యారు. కొన్ని కథలను మార్చి తీయాలనుకుంటే మొదటికే మోసం వస్తుంది.ఐతే ఒకప్పుడు సుఖంగా బ్రతకాలి అనుకునే వాళ్లు.., ఇప్పుడు సుఖంగా చావాలని కోరుకుంటున్నారు…,నమ్మకం ప్రాణం ఒకటే తమ్మి, ఒకేసారి పొతే మళ్ళీ రావు…,వంటి హరీష్ వన్ లైనర్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ తన గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం కొరకు అందించిన మాస్ బీట్స్ అంచనాలకు మించి ఉన్నాయి. ముఖ్యంగా జర్రా…, జర్రా..సాంగ్ తోపాటు వరుణ్ ఇంట్రడక్షన్ సాంగ్ వాకా వాకా సాంగ్స్ అరిపించాయి.
జిగర్తాండ మూవీ స్పూర్తితో ఆయన చేసిన బీజీఎమ్ కూడా బాగుంది. ఆయాంక్ బోస్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.
తీర్పు:
ఓ అద్భుతమైన కథకు అదనపు ఆకర్షణలతో తెరకెక్కించిన హరీష్ కొంత వరకు విజయం సాధించారని చెప్పవచ్చు. ఐతే ఈ కథకు అవసరమైన ఎమోషన్స్ తెరపై పండక పోవడంతో ప్రేక్షకులకు మంచి అనుభూతి కలగదు. ఐతే వరుణ్ మాత్రం ఊర మాస్ గ్యాంగ్ స్టర్ అవతారంలో కేకపుట్టించారు. ఒక కొత్త వరుణ్ ని తెరపై చూడవచ్చు. మొదటిసగం అధర్వ, మృణాలిని రవి ల కెమిస్ట్రీ తో పాటు, సత్య కామెడీతో ఆహ్లదకరంగా సాగినా, సెకండ్ హాఫ్ నిరుస్తాహపరిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అవకాశం లేకపోయినా మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు మాత్రం ఉన్నాయి.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team