విడుదల తేదీ : నవంబర్ 22, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సందీప్ మాధవ్, సత్య దేవ్, దేవిక, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, తదితరులు.
దర్శకత్వం : జీవన్ రెడ్డి
నిర్మాతలు : అప్పిరెడ్డి, దామోదర రెడ్డి ,సంజయ్ రెడ్డి.
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్ : సుధాకర్ యెక్కంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్- అర్జిత్ దత్త.
ఎడిటర్: ప్రతాప్ కుమార్
జార్జిరెడ్డి… విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ఎందరో విద్యార్తులను కదిలించిన వ్యక్తి, అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెర పై ఆవిష్కృతం అయిన సంగతి తెలిసిందే. గతంలో ‘దళం’ సినిమాతో విబిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
జార్జిరెడ్డి (సందీప్ మాధవ్) తన చిన్నతనం నుండి అన్యాయం పై ఎదురుతిరిగే ఆవేశం పూరితమైన స్వభావం గల వ్యక్తి. అలాంటి వ్యక్తి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విప్లవాత్మక విద్యార్థి నాయకుడుగా ఎదుగుతాడు. అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి ఒక మాములు స్టూడెంట్ గా వచ్చిన జార్జ్ నాయకుడుగా ఎలా మారాడు? అందుకు గల కారణాలు ఏమిటి? క్యాంపస్‌లోని వివిధ సమస్యలకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవి జార్జ్ కి ఎలాంటి సమస్యలను తీసుకొచ్చాయి? ప్రత్యర్థి ముఠాలు జార్జిని చంపటానికి చేసిన ప్లాన్ ఏంటి? వాళ్ళు జార్జ్ ని ఎలా చంపారు? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా ఎదిగి.. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన జార్జిరెడ్డి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేయడానికి దర్శకుడు జీవన్ రెడ్డి తీసుకున్న జాగ్రత్తలు… ముఖ్యంగా అప్పటి నేపథ్యం దగ్గరనుంచీ.. ఆయా పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూపించిన విధానం వరకూ.. ఇలా ప్రతిది జీవన్ రెడ్డి చాల చక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు.
ఇక సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం తాలూకు సన్నివేశాలు, అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాల బాగున్నాయి. జార్జిరెడ్డిని ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేసే సన్నివేశం.. జార్జ్ కి మంచి జాబ్ అవకాశం వచ్చినా తన నమ్మిన సిద్దాంతం కోసం ఆ అవకాశాన్ని కూడా వదులుకునే సీన్, అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయి. జార్జిరెడ్డి పాత్రలో కనిపించిన సందీప్ మాధవ్.. ఆ పాత్రలోని ఆవేశాన్ని విప్లవాన్ని మరియు ఆలోచనను తన హావభావాలతో చక్కగా పలికించాడు. కీలక పాత్రలో కనిపించిన సత్య దేవ్, ‘జార్జి రెడ్డి’ తల్లి పాత్రలో నటించిన ప్రముఖ మరాఠీ నటి దేవిక తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక జార్జ్ రెడ్డి సినిమా బయోపిక్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. ఒక కమర్షియల్ హీరో తెరమీర చేసే సాహసాలన్నీజార్జ్ నిజజీవితంలో ఉన్నాయి.
మైనస్ పాయింట్స్ :
కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కొన్నిసన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు జీవన్ మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు. సినిమాని ఎక్కువుగా ఎమోషనల్ సాగే యాక్షన్ సీక్వెన్స్ తో డ్రైవ్ చేసిన దర్శకుడు.. దాన్ని కంటిన్యూ చేయలేక పోయాడు. మధ్య మధ్యలో అనవసరమైన ల్యాగ్ సీన్స్ తో నిరాశ పరిచాడు.
పైగా సినిమాలోని ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకోవు. అవసరానికి మించి బిల్డప్ సీన్స్ ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే సరైన ప్లో కూడా ఉండదు. అక్కడక్కడా స్లోగా సాగుతూ బోర్ కొడుతుంది. ఇక యాక్షన్ సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ కథ ప్రకారమే సాగుతున్న భావన కలిగినా ఓవరాల్ గా కథనాన్ని మాత్రం ముందుకు నడిపించవు. పైగా కొన్ని యాక్షన్ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. సురేష్ బొబ్బిలి అందించిన పాటలు బాగున్నాయి. అలాగే హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సుధాకర్ యెక్కంటి సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ముఖ్యంగా 1960, 70 ల కాలం నాటి నేపథ్యాన్ని బాగా చూపించాడు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి. ఇక దర్శకుడు జార్జిరెడ్డి జీవితాన్ని తెర పైకి తీసుకురావడానికి పడిన కష్టం ప్రతి షాట్ లో కనిపిస్తోంది. అలాగే దర్శకుడు చేసిన రీసెర్చ్ అదేవిధంగా అప్పటి పరిస్థుతులను వాళ్ళ పాత్రలను అర్ధం చేసుకుని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం కూడా బాగుంది. అయితే స్క్రిప్ట్ లో ల్యాగ్ లేకుండా చూసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
తీర్పు :
విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా జార్జిరెడ్డి ఎందరో విద్యార్తులకు ఆదర్శనీయమైన విద్యార్థి నేతగా నిలిచినట్లే.. ఈ సినిమా కూడా జార్జిరెడ్డి జీవితాన్ని వెండితెర పై శాశ్వతంగా ఆవిష్కృతం చేసింది. సినిమాలోని డైలాగ్స్, టేకింగ్, నటీనటుల నటన.. ప్రధానంగా సందీప్ మాధవ్ నటన సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయి. అలాగే ఉద్యమం, అన్యాయం పై పోరాటం మరియు ఫ్రెండ్షిప్ తాలూకు ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశారు. అయితే సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం, క్లారిటీ మిస్ అవ్వడం కొన్ని చోట్ల పేలవమైన కథనం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. కానీ విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా జార్జ్ రెడ్డి లాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి, ఆయన ఆలోచన విధానం గురుంచి తెలుసుకోవటానికైనా ఈ సినిమాని చూడొచ్చు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team