సమీక్ష : రూలర్ – యాక్షన్ సీన్స్ వరకు ఓకే !

Ruler review

విడుదల తేదీ : డిసెంబర్  20, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు :  బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక, సప్తగిరి, సాయాజీ షిండే తదితరులు

దర్శకత్వం : కె ఎస్ రవికుమార్

నిర్మాత‌లు : సి కళ్యాణ్

సంగీతం :  చిరంతన్ భట్

సినిమాటోగ్రఫర్ : రామ్ ప్రసాద్

ఎడిటర్:  కోటగిరి వెంకటేశ్వర రావు-పత్స నాగరాజా


కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 105వ చిత్రం ‘రూలర్’. ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :
జయసుధ (సరోజినీ ప్రసాద్) పెద్ద ఐటీ బిజినెస్ మాగ్నెట్. అయితే ఆమె తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలయ్యను చూసి కాపాడుతుంది. గతం మర్చిపోయిన అతన్ని తన కొడుకుగా మార్చుకుని అతనికి అర్జున్ ప్రసాద్ అని పెట్టి అమెరికా పంపించి బిజినెస్ మెన్ గా తయారుచేస్తోంది. అర్జున్ ప్రసాద్ (బాలయ్య) ఆమె కంపెనీని నెంబర్ వన్ పోజిషన్ లో పెడతాడు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లో తన కంపెనీ మొదలుపెట్టి ఆపేసిన ఓ ప్రాజెక్ట్ ను మళ్ళీ స్టార్ట్ చేసే ప్రాసెస్ లో.. అక్కడ తన తల్లికి (జయసుధ) జరిగిన అవమానం గురించి తెలుస్తుంది. దానితో అర్జున్ ప్రసాద్ తన తల్లిని అవమానించిన వారిని టార్గెట్ చేసి మరి వారిని కొడతాడు. అయితే అంతలో కొన్ని ఊహించని క్యారెక్టర్స్ అతని జీవితంలోకి వస్తాయి. తనని అక్కడి వారందరూ ధర్మ అని పిలుస్తూ పోలీస్ ఆఫీసర్ ధర్మ గురించి చెబుతారు. ఇంతకీ ధర్మ ఎవరు? ధర్మకు నిరంజన (భూమిక)కు ఉన్న సంబంధం ఏమిటి? అసలు పోలీస్ ఆఫీసర్ ధర్మ గతం ఏమిటి? దేని కోసం అతను పోరాడాడు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో వచ్చిన ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో కొన్ని సన్నివేశాల్లో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో బాలయ్య స్టైలిష్ లుక్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, రైతుల నేపథ్యం మరియు భూమిక ట్రాక్, బాలయ్య డాన్స్, కొన్ని డైలాగ్స్ వంటి అంశాలు సినిమాకే ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

ఇక వెరీ స్టైలిష్ బిజినెస్ మెన్ గా బాలయ్య న్యూ లుక్ చాల బాగుంది. అలాగే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య ఎప్పటిలాగే పవర్ ఫుల్ గా నటించారు. ముఖ్యంగా తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ తన యాక్టింగ్ తో పాటు డాన్స్ తో కూడా ఆయన ఆకట్టుకుంటారు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, భూమిక, జయసుధ ఉత్తమమైన నటనను కనబర్చారు.

హీరోయిన్స్ గా నటించిన వేదిక, సోనాల్ చౌకన్ తమ నటన ఎలా ఉన్నా.. తమ గ్లామర్ తో మాత్రం బాగానే ఆకట్టుకుంటారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పిస్తారు.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు కె ఎస్ రవికుమార్ రాసుకున్న కాన్సెప్ట్ మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఆ కాన్సెప్ట్ కి తగట్లు సరైన ట్రీట్మెంట్ ను రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారు. సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ కు పెట్టిన ట్రాక్స్ కూడా ఎపెక్టివ్ గా అనిపించవు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్ లో హీరోకి హీరోయిన్లకు మధ్య వచ్చే సన్నివేశం కూడా బోర్ గా సాగుతాయి. సరే లవ్ సీన్స్ కోసం వాటిని పెట్టారు అనుకున్నా.. ఆ సీన్స్ లో లవ్ గాని, కామెడీ గాని ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు.

పైగా సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం, సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం, ప్రీ క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. వీటికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. అలాగే చాల కీలకమైన సన్నివేశాలను కూడా దర్శకుడు చాలా సినిమాటిక్ గా చూపించాడు.

దర్సకుడు టేకింగ్ తో ఆకట్టుకున్నా స్క్రిప్ట్ పరంగా మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఆయన స్క్రిప్ట్ మీద ఇంకా బాగా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా అవుట్ ఫుట్ మరోలా ఉండేది. అలాగే బాలయ్య చేసిన ధర్మ పాత్ర లుక్ కూడా బాలయ్యకు అసలు సెట్ అవ్వలేదు.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేసిన రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు చిరంతన్ భట్ అందించిన నేపథ్య సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. సాంగ్స్ కూడా పూర్తిగా ఆకట్టుకునే విధంగా లేవు. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. నిర్మాత సి కళ్యాణ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు మంచి కథాంశం తీసుకున్నా.. ఆ కథాంశానికి తగ్గట్లు ఉత్కంఠభరితమైన కథాకథనాలను మాత్రం రాసుకోలేకపోయాడు. ఆయన స్క్రిప్ట్ మీద ఇంకా బాగా శ్రద్ద పెట్టి ఉండాల్సింది.

 

తీర్పు :

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో కొన్నిచోట్ల ఆసక్తికరంగా సాగినా.. మొత్తానికి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే బాలయ్య నటన అండ్ ఆయన స్టైలిష్ లుక్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కానీ, దర్శకుడు రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ గా సాగకపోవడం, కొన్ని కీలక సన్నివేశాలు బోర్ కొట్టించడం, అలాగే చాల సీన్స్ లో నాటకీయత ఎక్కువడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ ‘చిత్రం’ బాలయ్య అభిమానులకు మరియు యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికి నచ్చే అవకాశం ఉంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

Exit mobile version