ఓటీటీ రివ్యూ : అమ్మోరు తల్లి – అక్కడక్కడా ఆకట్టుకునే సందేశాత్మక చిత్రం !

Ammoru Thalli Telugu Movie Review

విడుదల తేదీ: నవంబర్ 14, 2020

123telugu.com Rating : 2.75/5

తారాగణం : నయనతార, ఆర్‌.జె.బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్‌, మధు, అభినయ, అజయ్‌ ఘోష్‌, తిరునవక్కరసు, మౌళి తదితరులు

దర్శకత్వం : ఆర్‌.జె.బాలాజీ, ఎన్‌.జె.శరవణన్‌

సంగీతం : గిరీష్‌ గోపాలకృష్ణన్‌

ఛాయాగ్రహణం : దినేష్‌ కృష్ణన్‌.బి

ఎడిటర్‌ : సెల్వ ఆర్‌.కె

కథ, కథనం : ఆర్‌.జె.బాలాజీ & ఫ్రెండ్స్‌

 

 

నయనతార ప్రధాన పాత్రధారిగా ఆర్‌.జె.బాలాజీ, శరవణన్‌ డైరక్టర్స్‌గా వచ్చిన సినిమా ‘అమ్మోరు తల్లి’. తమిళంలో ‘మూకుత్తి అమ్మన్‌’గా తెరకెక్కిన సినిమాకు డబ్బింగ్‌ ఇది. సినిమాలో ప్రధాన పాత్రధారిగా నయనతారను ఎంచుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా ఈ రోజు ఈ సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

ఏంగెల్స్‌ రామస్వామి (ఆర్‌.జె.బాలాజీ) తండ్రి కుటుంబాన్ని వదిలేసి పారిపోతాడు. దాంతో రామస్వామి కాశీబుగ్గ పట్టణంలో రిపోర్టర్‌గా పని చేస్తూ.. తన తల్లి, ముగ్గురు చెల్లెళ్ల బాధ్యత తీసుకుంటాడు. అయితే భగవతిబాబా (అజయ్‌ఘోష్‌) అనే ఓ స్వామీ చేస్తున్న 11 వేల ఎకరాల భూ కబ్జా మీద ఆరేళ్లుగా రామస్వామి
స్టోరీ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ లోగా రామస్వామి తల్లి బంగారం (ఊర్వశి) పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఏది సెట్ అవ్వదు. అంతలో తమ ఇంటి దైవం ముక్కుపుడక అమ్మవారు (నయనతార) రామస్వామికి దర్శనమిస్తుంది. ఎందుకు అతనికి అమ్మవారు దర్శనం ఇచ్చింది ? అసలు అమ్మవారు రామస్వామి మధ్య జరిగినది ఏమిటి ? చివరకు రామస్వామి ఏం చేశాడు ? భగవతిబాబా (అజయ్‌ఘోష్‌)ను ఎలా అడ్డుకున్నాడు అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

దేవుడు భూముల అన్యాక్రాంతం, దొంగ బాబాలు… ఈ రెండు అంశాల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా.. ఈ సినిమాలో ప్రస్తావించిన సందేశం మాత్రం చాలావరకు ఆకట్టుకుంది. ఇక అమ్మవారిగా నయనతార నటన సినిమాకి బాగా ప్లస్ అయింది. అయితే ఆగ్రహించిన అమ్మవారిగా నయనతార చూపించిన హావభావాలు కంటే.. వినోదాత్మక సన్నివేశాల్లో ఆమె కనబర్చిన టైమింగ్, అండ్ తన ఎక్స్ ప్రెషన్స్ లో చూపించిన దైవత్వం బాగుంది. అమ్మవారి పాత్రకు నయనతార ప్రాణం పోసింది.

ఇక మధ్య తరగతి కుర్రాడిగా.. ఓ రిపోర్టర్ గా బాలాజీ చాల బాగా నటించాడు. తన పాత్రలో జీవించేశాడు. ముఖ్యంగా అతను చూపించిన కన్‌ఫ్యూజన్‌, అలాగే అతనిలోని దాగి ఉన్న కష్టం, బాధ గురించి చెప్పే సీన్స్ లో అతని నటన మొత్తానికి సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన పాత్ర అజయ్‌ ఘోష్‌ ది. దొంగ బాబాగా ఆయన అద్భుతమైన నటనతో అదరగొట్టేశారు. అచ్చం బాబాల మేనరిజమ్స్‌తో బాగా ఆకట్టుకున్నాడు. అలాగే హీరోకి తల్లిగా నటించిన ఊర్వశి కొన్ని చోట్ల బాగా నవ్విస్తోంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్

భక్తి పేరుతో దొంగ బాబాలు చేసే మోసాన్ని దేవుడి మాన్యాలు కాజేసిన వైనాన్ని ఇప్పటికే చాలా సినిమాల్లో చూసాము. కాస్త అటు ఇటుగా ఈ సినిమాలో అదే ఉంది. కాకపోతే మరీ మూసధోరణిలా కాకుండా కొంచెం కొత్తగా సినిమాను నడిపించడానికి దర్శకులు బాగానే కేర్ తీసుకున్నారు. కాకపోతే కొన్ని చోట్ల తమిళ నేటివిటి బాగా ఎక్కువ అయింది. కానీ, దర్శకులు రాసుకున్న కాన్సెప్ట్.. అలాగే అమ్మవారి సన్నివేశాలు బాగున్నప్పటికీ.. మధ్యలో వచ్చే సీన్స్ మాత్రం బాగా బోర్ గా సాగుతాయి. దీనికి తోడు అనవసరమైన కామెడీ ట్రాక్స్ పెట్టి.. ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆసక్తిని తగ్గించారు.

పైగా సెకెండ్ హాఫ్ లో మొదటి సగభాగం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. మొత్తానికి దర్శకులు సినిమాలోని ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ను పక్కన పెట్టి.. పండని కామెడీ సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. అలాగే కథకు అవసరం లేని అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది. సెకండాఫ్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయి ఉండేది.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు గిరీష్‌ గోపాలకృష్ణన్‌ అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తోంది. ముఖ్యంగా హీరో నయనతారల మధ్య వచ్చే సీన్స్.. మరియు క్లైమాక్స్ లో కీలక సీన్స్ లో నేపథ్య సంగీతం అలరిస్తోంది. ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. దినేష్‌ కృష్ణన్‌.బి సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. మెయిన్ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

 

తీర్పు :

ఆశ్రమాల పేరుతో బాబాలు వేల ఎకరాలు దోచుకోవాలనుకునే తరహా సినిమాలు ఇప్పటికే చాలా వచ్చినా.. ఈ సినిమాలో నయనతార అమ్మవారిగా నటించడం, సీనియర్ నటి ఊర్వశి తన కామెడీ టైమింగ్ తో అలరించడం, ఆర్‌.జె.బాలాజీ, శరవణన్‌ దర్శకత్వ పనితనం మొత్తానికి ‘అమ్మోరు తల్లి’ని ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ ను కలిగించింది. కాకపోతే అనవసరమైన కామెడీ ట్రాక్స్, సెకెండ్ హాఫ్ లో మొదటి సగభాగం బాగా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ గా నిలుస్తాయి. ఓవరాల్ గా నయనతార నటన కోసమైనా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

 

Click Here For English Review

Exit mobile version