విడుదల తేదీ : సెప్టెంబర్ 03, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల తదితరులు
దర్శకుడు: ఏ . సుశాంత్ రెడ్డి
నిర్మాత: అర్జున్ దాస్యన్
సంగీత దర్శకుడు: హరి గౌర
సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ
ఎడిటర్: ప్రవీణ్ పూడి
మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ”డియర్ మేఘ”. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
మేఘా స్వరూప్ (మేఘా ఆకాష్) కాలేజీ రోజుల్లోనే అర్జున్ (అర్జున్ సోమయాజుల)తో ప్రేమలో పడుతుంది. అయితే, ఆమె తన ప్రేమను వ్యక్త పరచాలని నిత్యం తనలో తానే మదన పడినా అర్జున్ తో ప్రేమ గురించి మాట్లాడలేకపోతుంది. మళ్ళీ మూడేళ్ళ తర్వాత అర్జున్, మేఘ జీవితంలోకి వస్తాడు. ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉన్నాయని, ఇద్దరి పరిస్థితి ఒకటే అని అర్థమవుతుంది. ప్రేమ మొదలవుతుంది. పెళ్లితో ఒక్కటి అయ్యేలోపు జరిగిన ఓ ప్రమాదం, మేఘ జీవితాన్ని తలక్రిందులు చేస్తోంది. ఆ పరిస్థితుల్లో మేఘాకి తారసపడతాడు ఆది (ఆదిత్ అరుణ్). అతని స్నేహంలో మేఘా మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ఆది – మేఘా ప్రేమలో పడతారు. కానీ అర్జున్ రాకతో వారి ప్రేమ ఎలాంటి మలుపు తీసుకుంది ? అసలు జరిగిన ప్రమాదంలో అర్జున్ కి ఏమైంది ? చివరకు ఆది కథ ఎలా ముగిసింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
”డియర్ మేఘ” అంటూ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలతో వచ్చిన దర్శకుడు ఏ . సుశాంత్ రెడ్డి, ఈ సినిమా క్లైమాక్స్ తో కాస్త కొత్తగానే ప్రయత్నం చేశాడు. ఇక ప్రధాన పాత్రలో నటించిన మేఘా ఆకాష్ తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి ఆమె బాగానే తాపత్రయ పడింది.
ఎప్పుడూ సరదాగా తిరిగే కుర్రాడి పాత్రలతో మరియు తన ఈజ్ యాక్టింగ్ తో ఆకట్టుకునే ఆదిత్ అరుణ్ నుండి.. ఇలాంటి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ రావడంతో ఫ్రెష్ గా అనిపించింది. ఆదిత్ అరుణ్ కూడా ఆది పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. మరో కీలక పాత్రలో నటించిన అర్జున్ సోమయాజుల నటన పరంగా పర్వాలేదు అనిపించాడు.
ఇక ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. మదర్ క్యారెక్టర్ పోషించిన పవిత్రా లోకేష్ కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో గౌర హరి అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు ఏ . సుశాంత్ రెడ్డి ప్యూర్ లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. మేఘ – అర్జున్ మధ్య సాగే సీన్స్ స్లోగా సాగుతాయి. అలాగే వారి ప్రేమకు బలమైన సంఘర్షణ కూడా లేదు. ఇక ఆది – మేఘ లవ్ ట్రాక్ బాగున్నా.. వీరి మధ్య అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి.
పైగా సినిమా స్లో నేరేషన్ తో బోరింగ్ ట్రీట్మెంట్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు బైక్ యాక్సిడెంట్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కొన్ని చోట్ల ఆ ఎమోషన్, ఆ ఫీల్ బాగానే వర్కౌట్ అయినా.. అవసరం లేని సీన్స్ కారణంగా సినిమాకి కొంత మైనస్ జరిగింది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. సంగీత దర్శకుడు గౌర హరి అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సాంగ్ బాగుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు ఏ . సుశాంత్ రెడ్డి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నా.. ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. ఇక సినిమాలోని నిర్మాత అర్జున్ దాస్యన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
ఎమోషనల్ లవ్ స్టోరీలతో వచ్చిన ఈ ‘ డియర్ మేఘ’లో లవ్ సీన్స్, ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. కాకపోతే స్లో నేరేషన్, కొన్ని చోట్ల బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమాలోని కొన్ని అంశాలు నచ్చుతాయి. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చకపోవచ్చు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team