సమీక్ష : ‘ఆకాశవాణి’ – తెలుగు చిత్రం సోనీ లివ్ లో ప్రసారం

Aakashavaani Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 24, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : స‌ముద్రఖ‌ని, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ తదితరులు

దర్శకుడు : అశ్విన్ గంగరాజు

నిర్మాతలు : ప‌ద్మ‌నాభ రెడ్డి

సంగీత దర్శకుడు : కాలభైరవ

సినిమాటోగ్రఫీ : సురేష్‌ రగుతు

ఎడిటర్ : శ్రీకర్‌ ప్రసాద్‌

స‌ముద్ర ఖ‌ని, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘ఆకాశవాణి’. రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఓటీటీ ‘సోనీ లివ్‌’లో ఈ సినిమా ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

ప్రపంచానికి దూరంగా, బయట ఇంకో ప్రపంచం కూడా ఉందని తెలియకుండా ఓ అడవిలో కొందరు గూడెం వాసులు బతుకుతూ ఉంటారు. వారంతా దొర (విన‌య్ వ‌ర్మ‌) కనుసన్నలలో జీవిస్తుంటారు. ఆ దొర తానే దేవుడిని అని వారిని నమ్మిస్తూ, భయపెడుతూ ఆ గూడెం ప్రజలను అడవి దాటకుండా చూస్తుంటాడు. అయితే ఆ గూడెంలోని కిట్టా అనే పిల్లాడికి దొరికిన ఒక రేడియో ఆ ఆటవిక ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది. ఇంతకీ స్కూల్ మాస్టర్ (స‌ముద్రఖ‌ని) ఆ గూడెంలోకి ఎలా వచ్చాడు ? దుర్మార్గులైన దొర, అతని అనుచరుడు సాంబడు నుంచి ఆ గూడెం ప్రజలను ఎలా కాపాడాడు ? మూఢనమ్మకాలతో మగ్గిపోతున్న ఆ ఆటవిక ప్రజలకు ఆ రేడియో సహాయంతో స్కూల్ మాస్టర్ వారికి ఎలా విముక్తి కలిగించాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్.. ఈ కథ జరిగిన నేపధ్యమే. దర్శకుడు అశ్విన్ గంగరాజు రాసుకున్న సున్నితమైన అంశాలు, భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే ప్రధానంగా ఈ సినిమాలో ఆటవిక ప్రజల అమాయకత్వం ప్రేక్షకుడ్ని సినిమాతో పాటే ప్రయాణించేలా చేస్తోంది. అశ్విన్ గంగరాజు టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది.

కథనం స్లో అవుతుంది అనుకునే సమయానికి ఒక ఎమోషనల్ సీన్ వస్తూ సినిమా పై ఆసక్తిని పెంచుతుంది. అన్నిటికీ మించి కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ఇక కథలో అంతర్లీనంగా ఇచ్చిన మెసేజ్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. సినిమా చివరకి వచ్చేసరికి పాత్రలకు ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు బాగా మెయింటైన్ చేశాడు.

స్కూల్ మాస్టర్ గా స‌ముద్రఖ‌ని, అలాగే దొరగా విన‌య్ వర్మ చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా మీద మంచి భావేద్వేగంతో కూడుకున్న అనుభూతి కలుగుతుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

కథా నేపథ్యం, పాత్రల చిత్రీకరణ పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు, కథను మొదలు పెట్టడంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. పాత్రలు పరిచయానికి సమయం తీసుకున్నారనుకున్నా.. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా బోరింగ్ గా సాగుతుంది. దీనికి తోడు ఏ పాత్ర ఎందుకు వస్తోంది ?

అసలు ఆ పాత్రల తాలూకు బాధ, ఆలోచనా విధానం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. దీనికి తోడు నూతన నటినటులతోనే సినిమాని తెరకెక్కించడం, దాంతో.. వారిలో కొంతమంది హావభావాల్లో అతి కనిపించడం, స్పష్టమైన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేకపోవడం కూడా సీన్ లోని డెప్త్ ను ఎలివేట్ చేయలేకపోయింది.

పైగా ఎలాంటి కమర్షియల్ హంగులు ఆర్భాటాలు లేకపోవడం కూడా ఈ సినిమా ఫలితాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించదు.

 

సాంకేతిక విభాగం :

 

అశ్విన్ గంగరాజు దర్శకుడిగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. అయితే రచయితగా మాత్రం ఆయన కథనం ఆకట్టుకోదు. సినిమా మొదటి భాగం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫర్ సురేష్‌ రగుతు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు బాగున్నాయి. నిర్మాత ప‌ద్మ‌నాభ రెడ్డి ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

 

తీర్పు :

 

అడవి నేపథ్యంలో విభిన్న కథాంశంతో వచ్చిన ఈ ‘ఆకాశవాణి’ డిఫరెంట్ సినిమాగా కొన్ని అంశాల్లో ఆకట్టుకున్నా.. స్లో నేరేషన్, ఫస్ట్ హాఫ్ లో బోరింగ్ ట్రీట్మెంట్ ఎక్కువవడం, కమర్షియల్ అంశాలు మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, డిఫరెంట్ ఎమోషనల్ మూవీస్ ఇష్టపడేవారికి.. కథా నేపథ్యం, కథలోని ప్రధాన సంఘర్షణ మరియు సందేశం వంటి కొన్ని అంశాలు నచ్చుతాయి. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చకపోవచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

Exit mobile version