విడుదల తేదీ : సెప్టెంబర్ 24, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి, ఈశ్వరి రావు, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, దేవయాని
దర్శకుడు: శేఖర్ కమ్ముల
నిర్మాతలు: నారాయణ్ దాస్ కె నారంగ్,పుస్కర్ రామ్ మోహన్ రావు
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
సంగీత దర్శకుడు: పవన్ సి.హెచ్
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
‘దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి జంటగా వస్తోన్న సినిమా “లవ్ స్టోరి”. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకోగలిగిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
రేవంత్ (నాగచైతన్య) హైదరాబాద్ లో జుంబా సెంటర్ నడుపుతూ ఉంటాడు. అతను ఉండే ఇంటి పక్క ఇంట్లో దిగుతుంది మౌనీ అలియాస్ మౌనిక (సాయిపల్లవి). జాబ్ కోసం ఊరు నుంచి వస్తోంది. కొన్ని ప్రయత్నాలు తర్వాత జాబ్ రాకపోవడంతో మౌనిక కూడా రేవంత్ జుంబా సెంటర్ లో పార్టనర్ గా జాయిన్ అవుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఇద్దరి మధ్య రిలేషన్ బిల్డ్ అయి ప్రేమలో పడతారు. అయితే ఇద్దరు కులాలు వేరు కావడం, వారి ప్రేమకు అడ్డంకి అవుతుంది. ఆ అడ్డంకులను దాటుకుని రేవంత్ – మౌనీ తమ ప్రేమను ఎలా గెలుచుకున్నారు ? ఈ క్రమంలో ఒకరి కోసం ఒకరు ఏమి చేశారనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా నాగ చైతన్య, సాయి పల్లవి తమ పాత్రలకు ప్రాణం పోశారు. డ్యాన్స్ ట్రైనర్ గా చైతు చక్కని నటనను కనబరిచాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో సాయి పల్లవితో సాగే సన్నివేశాలు అలాగే క్లైమాక్స్ లో చైతు నటన బాగుంది. ఇక సాయి పల్లవి నటన అండ్ డ్యాన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.
అలాగే నాగ చైతన్యకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. అలాగే సాయి పల్లవి కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆ పెయిన్ అర్ధమయ్యేలా కేవలం తన కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. కీలక పాత్రలో నటించిన రాజీవ్ కనకాల తన నతనతో ఆకట్టుకోగా.. ఇక ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన ఈశ్వరి రావు కూడా బాగా నటించింది.
ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. శేఖర్ కమ్ముల రాసిన కథ మరియు పాత్రలు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల్లోని సంఘటనలు పరిస్థితుల ఆధారంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కథను దర్శకుడు చాలా సున్నితంగా నడుపుతూ.. సినిమాలో ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్ని, పెయిన్ని కూడా హైలెట్ అయ్యే విధంగా కొన్ని ఏమోషనల్ సన్నివేశాలను బాగా మలిచాడు.
మైనస్ పాయింట్స్ :
పాత్రలు, నేపథ్యం అలాగే సినిమాలో కొన్ని ఎమోషన్స్ బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతూ రెగ్యులర్ సీన్స్ తో బోర్ కొడతాయి. అలాగే క్లైమాక్స్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. ఇక హీరో హీరోయిన్ల మధ్య కొన్ని లవ్ సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. మొత్తంగా రెగ్యులర్ ప్లే, స్లో నరేషన్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.
ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. వీటికి తోడు హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా అనవసరమైన ఎమోషన్ కి లోబడి.. మరి నాటకీయకంగా సాగుతున్న భావన కలుగుతుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రేమకు సంబంధించి మంచి పాయింట్ తీసుకున్నారు. అయితే సినిమాలో కొన్ని సీక్వెన్స్ స్లోగా నడిపారు. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రేమ కథకు అనుగుణంగా విజువల్స్ ను చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు పవన్ అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. నేపధ్య సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా సాయి పల్లవి, చైతుల మధ్య వచ్చే సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. ల్యాగ్ సీన్స్ లెంగ్త్ తగ్గించి ఉంటే బాగుండేది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
తీర్పు:
సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా వచ్చిన ఈ లవ్ స్టోరి ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల ప్రేమకు సంబంధించి మంచి కథను తీసుకుని మంచి ఎమోషనల్ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. అలాగే ప్రేమలో కులం సమస్య తాలూకు పర్యవసానాలను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే స్క్రీన్ ప్లే లో స్లో నెరేషన్, కొన్ని సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, చైతు, సాయి పల్లవి తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తమ్మీద ఈ చిత్రం మెప్పిస్తోంది.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team