సమీక్ష : ‘మిషన్ 2020’ – పేరులో ఉన్న ‘మిషన్’.. సినిమాలో లేదు !

Mission 2020 Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 29, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్, స్వాతి, తదితరులు

దర్శకుడు: కరణం బాబ్జి

నిర్మాతలు: కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు

సంగీత దర్శకుడు: ర్యాప్ రాక్ షకీల్

ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్

నవీన్ చంద్ర హీరోగా కరణం బాబ్జి దర్శకత్వంలో వచ్చిన సినిమా “మిషన్ 2020”. కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

జయంత్ (నవీన్ చంద్ర) సీరియస్ పోలీస్ ఆఫీసర్. నేరం రుజువు అయితే ఎన్ కౌంటర్ చేయడానికి కూడా వెనుకాడడు. అయితే మరోపక్క ప్రకాష్ అతని ముగ్గురు ఫ్రెండ్స్ గుడ్ స్టూడెంట్స్. కాలేజీలో టాపర్స్ కూడా. అయితే, నలుగురూ అశ్లీల వీడియోల మత్తులో పడి.. చదువు పై నిర్లక్ష్యం చేస్తారు. ఆ అశ్లీలతను చూసిన ఉద్రేకంలో అనుకోకుండా తమ స్నేహితురాలు స్వాతి పై వారు అత్యాచారం జరుపుతారు. దాంతో మంచి వాళ్ళుగా, మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ మరియు అతని ఫ్రెండ్స్ జీవితాలు ఎలా తారుమారయ్యాయి ? అసలు వీళ్ళను పోలీస్ ఆఫీసర్ జయంత్ (నవీన్ చంద్ర) ఎలా పట్టుకున్నాడు ? ఈ క్రమంలో జయంత్ ఏమి చేశాడు ? అసలు ప్రకాష్, అతని ఫ్రెండ్స్ అత్యాచారం చేయడానికి అసలు కారణం ఏమిటి ? చివరకు వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మంచి సందేశంతో పాటు ఫాదర్ సెంటిమెంట్ మరియు శ్రీ రాపాక స్పెషల్ సాంగ్ వంటి అంశాలు ఆకట్టుకున్నాయి. ఇక చైతన్యంతో ఎదగాల్సిన యువత అశ్లీల వీడియోల మత్తులో పడి బతుకును ఎలా దుర్భరం చేసుకుంటుంది ? అనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా సందేశం పరంగా మాత్రం నిజంగా స్ఫూర్తినిచ్చే సినిమానే.

ముఖ్యంగా అశ్లీల వీడియోల ప్రభావం కారణంగా తెలిసీ తెలియని వయసులో కొందరు ఎలా తమ జీవితాన్ని వృధా చేసుకుంటారో లాంటి అంశాలను కూడా చాలా ఎమోషనల్ గా చూపించారు. అలాగే సమాజం చుట్టూ ఉన్న పరిస్థితులను, జనం ఆలోచనా విధానాన్ని హైలైట్ చేస్తూ చెప్పడం కూడా బాగుంది. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్ర‌లో నటించిన నవీన్ చంద్ర తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నాగ బాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అదే విధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన సమీర్, చలాకి చంటి, మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

మంచి మెసేజ్ తో కూడుకున్న కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు కరణం బాబ్జి, ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. అయితే, కొన్ని సీన్స్ ను తెర మీదకు ఆసక్తికరంగా మలిచినప్పటికీ.. స్లో నేరేషన్ కారణంగా సినిమా చాలా బోర్ గా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌ ఇంట్రస్ట్ లేని సీన్లతో మరియు సాగతీత సన్నివేశాలతో, ఎలివేట్ కానీ బోరింగ్ ఎమోషన్ తో స్క్రీన్ ప్లే సాగింది.

అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఆకట్టుకోవు. ఇక ప్రధాన పాత్రల క్యారెక్టరైజేషన్స్ మరియు ఆ పాత్రల సంఘర్షణ నమ్మశక్యంగా ఉండదు. అలాగే ప్రధాన పాత్రలు చాలా బలహీనంగా ఉన్నాయి. మెయిన్ గా స్వాతి పాత్రలోని పెయిన్ తో పాటు ఆమె క్యారెక్టర్ లోని ఆర్క్ అండ్ మోటివ్ ను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది.

పైగా చాలా సన్నివేశాల్లో కొందరు నటీనటుల హావభావాలు, వారి నటన కూడా పాత్రల స్థాయికి తగ్గట్టుగా లేదు. అన్నిటికీ మించి సినిమాలో అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగుతాయి. అసలు ఇంటర్వెల్ కి గాని కథ ముందుకు కదలదు. కానీ ఆ ఇంటర్వెల్ వచ్చే సరికి ప్రేక్షకుడికి సినిమా పై విసుగు వచ్చేస్తుంది.

 

సాంకేతిక విభాగం :

 

ముందు ముచ్చటించుకున్నట్లుగానే సినిమాలో మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నా.. కరణం బాబ్జి దాన్ని తెర మీద చూపెట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. కెమెరామెన్ వెంకట్ ప్రసాద్ పనితనం మాత్రం ఆకట్టుకుంది. విజువల్స్, మరియు కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ర్యాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ ను బాగా ఎలివేట్ చేసింది. ఇక ఎడిటర్ వర్క్ వర్కౌట్ కాలేదు. నిర్మాతలు కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు సినిమాకి తగ్గట్టు బాగానే ఖర్చు పెట్టారు.

 

తీర్పు :

 

మంచి మార్గంలో స్వేచ్ఛగా చైతన్యవంతులుగా ఎదగాల్సిన యువత అశ్లీల వీడియోల మత్తులో పడి తమ బతుకును ఎలా దుర్భరం చేసుకుంటున్నారనే కోణంలో సందేశాత్మకంగా సాగిన ఈ సినిమా.. మెసేజ్ పరంగా ఆకట్టుకుంది. అయితే ఆకట్టుకోని కథ కథనాలు, మెప్పించలేకపోయిన సన్నివేశాలు, బలం లేని బలహీన పాత్రలు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ సినిమాలో అతి సాధారణ సగటు ప్రేక్షకుడికి కొన్ని అంశాలు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ, మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Version

Exit mobile version