విడుదల తేదీ : నవంబర్ 4, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: విశాల్, ఆర్య, మృణాళిని రవి, ప్రకాశరాజ్ తదితరులు
దర్శకుడు: ఆనంద్ శంకర్
నిర్మాత: వినోద్ కుమార్
సినిమాటోగ్రఫీ: డి రాజశేఖర్
సంగీత దర్శకుడు: తమన్ ఎస్ ఎస్
ఎడిటర్: రేమండ్ డెరిక్ క్రాస్టా
యాక్షన్ హీరోలుగా తమిళ సినిమాలతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విశాల్ – ఆర్య కలిసి చేసిన సినిమా ‘ఎనిమి’. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
సూర్య (విశాల్), రాజీవ్ (ఆర్య) ఇద్దరూ రాజీవ్ తండ్రి ప్రకాష్ రాజ్ దగ్గర చిన్నతనంలో కలిసి పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ ట్రైనింగ్ లో సూర్య గెలుపు చూసి అసూయ ద్వేషాలతో రాజీవ్ భయంకరమైన క్రిమినల్ గా మారతాడు. అయితే, చిన్నప్పుడే విడిపోయిన సూర్య – రాజీవ్ సింగపూర్ లో లిటిల్ ఇండియా అనే ప్రాంతంలో కలుసుకుంటారు. రాజీవ్ చేసే క్రైమ్ ను కనిపెట్టి.. అతని జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడు సూర్య. దాంతో రాజీవ్ సూర్య జీవితాన్ని ఎలా టార్గెట్ చేశాడు ? ఈ ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వీళ్లలో ఎవరు ఎవరి పై గెలుస్తారు ? ఈ క్రమంలో సూర్య ఏమి కోల్పోయాడు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఇది ఒక యాక్షన్ ప్యాకెడ్ మూవీ. ఫస్టాఫ్ అంతా క్రైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ తో థ్రిల్ చేసింది. అలాగే సెకండాఫ్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. ఇక విశాల్ ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్లు… ఎప్పటిలాగే తన రియలిస్టిక్ యాక్షన్ తో, అండ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.
ముఖ్యంగా క్లిష్టమైన తన పాత్రలో విశాల్ నటించిన విధానం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరో హీరో ఆర్య కూడా అద్భుతంగా నటించాడు. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే కీలక సన్నివేశాలతో పాటు ఆర్య క్యారెక్టర్ తో సాగే ట్రాక్ లో, మరియు క్లైమాక్స్ సన్నివేశాల్లో కూడా ఆర్య తన పాత్రలో అద్భుతంగా నటించాడు.
మెయిన్ గా ఆర్య తన క్లాసిక్ విలనిజంతో కొత్తగా కనిపించాడు. విశాల్ – ఆర్య మధ్య నువ్వా నేనా? అనేలా వచ్చే యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ సినిమాలో ప్రధాన బలంగా నిలుస్తాయి. దర్శకుడు ఆనంద్ శంకర్ ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథను చెప్పడానికే ప్రయత్నం చేసిన విధానం బాగుంది. కీలక పాత్రల్లో నటించిన మృణాళిని రవి, ప్రకాష్ రాజ్, మమతా మోహన్ దాస్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు ఆనంద్ శంకర్ తీసుకున్న మెయిన్ పాయింట్, మరియు ప్రధాన పాత్రలు, ఆ పాత్రల తాలూకు సంఘర్షణ బాగా ఆకట్టుకున్నా… సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం సినిమాకి మైనస్ అయింది. పైగా కథను ఎలివేట్ చేస్తూ ఆనంద్ శంకర్ రాసుకున్న సీరియస్ ట్రీట్మెంట్ కొన్ని చోట్ల లాజికల్ గా ఉండి ఉంటే బాగుండేది.
అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ల్యాగ్ సీన్స్ ను కూడా తగ్గించుకొని ఉండి ఉంటే, సినిమాకి ఇంకా బెటర్ అవుట్ ఫుట్ వచ్చి ఉండేది. అయితే దర్శకుడు రాసుకున్న మెయిన్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని సీన్స్ స్లోగా ఉండటం, అలాగే కొన్ని సన్నివేశాల్లో ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలు గా నిలిచాయి.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు తమన్ ఎస్ ఎస్ అందించిన సాంగ్స్ బాగానే ఉన్నాయి. అయితే, యాక్షన్ సీన్స్ లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎడిటింగ్ బాగుంది గాని, సెకండ్ హాఫ్ ను ఇంకా టైట్ గా ట్రిమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ సన్నివేశాలలోని విజువల్స్ ను డి. రాజశేఖర్ చాలా సహజంగా చూపించారు. నిర్మాత వినోద్ కుమార్ పాటించిన నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.
తీర్పు :
పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాకెడ్ తో పక్కా క్రైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ ‘ఎనిమి’ సినిమాలో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ కంటెంట్, అండ్ మెయిన్ ట్రాక్స్, అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే విశాల్ – ఆర్య నటన సినిమాలో హైలైట్ గా నిలిచాయి. కాకపోతే కొన్ని సీన్స్ బోర్ గా సాగడం, మరియు సెకండాఫ్ ప్లే కొన్ని చోట్ల ఆసక్తికరంగా సాగకపోవడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఇద్దరి హీరోల అభిమానులతో పాటు యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team