సమీక్ష : ఇందువదన – ఆసక్తిగా సాగని ఎమోషనల్ లవ్ డ్రామా !

Arjuna Phalguna Movie Review In Telugu

విడుదల తేదీ : జ‌న‌వ‌రి 1, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: వరుణ్‌ సందేశ్‌, ‘ఫర్నాజ్ శెట్టి’, ధన్‌రాజ్‌, రఘుబాబు, అలీ త‌దిత‌రులు.

దర్శకత్వం : ఎంఎస్‌ఆర్‌

నిర్మాత: మాధవి ఆదుర్తి

సంగీత దర్శకుడు: శివ కాకాని

స్క్రీన్ ప్లే : ఎంఎస్‌ఆర్‌

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

`హ్యాపీడేస్‌`, `కొత్త బంగారు లోకం`, `ఏమైంది ఈ వేళా` లాంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌ సందేశ్‌ హీరోగా ‘ఎంఎస్‌ఆర్‌’ దర్శకత్వంలో వచ్చిన సినిమా `ఇందువదన`. ‘ఫర్నాజ్ శెట్టి’ హీరోయిన్ గా నటించింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

వాసు (వరుణ్‌ సందేశ్‌) ఒక ఫారెస్ట్ ఆఫీసర్. గిరిజన జాతికి చెందిన ఇందు ( ఫర్నాజ్ శెట్టి)ని చూసి ప్రేమలో పడతాడు. వాసు – ఇందు మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనల అనంతరం ఇద్దరు ఒకరిని ఒకరు ఘాడంగా ప్రేమించుకుంటారు. అయితే, వారి ప్రేమను, అలాగే వారి పెళ్లిని ఇందు గూడెం పెద్దలు ఒప్పుకోరు. ఇటు వాసు కుటుంబం మరియు గ్రామం కూడా వీరి పెళ్లిని అంగీకరించదు. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇందుని చంపేస్తారు. ఆ విషయం తెలిసిన వాసు చివరకు ఏమైపోయాడు ? అసలు ఇందును ఎవరు చంపారు ? వాసు వాళ్ళను ఏమి చేశాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

వాసు పాత్రలో వరుణ్‌ సందేశ్‌ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో మరియు కొన్ని హారర్ సీన్స్ లో వరుణ్‌ సందేశ్‌ తన హావాబావాలతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన ఫర్నాజ్ శెట్టి తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. బోల్డ్ లుక్ లో కూడా ఆమె చాలా సహజంగా నటించింది. ఎంఎస్‌ఆర్‌ దర్శకత్వంలో ఎమోషనల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి.

ప్రేమించిన అమ్మాయి కోసం తనే ప్రాణ త్యాగం చేయడం, అలాగే ప్రేమ కోసం ఒకరికి ఒకరు బాసటగా నిలవడం బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన రఘుబాబు, అలీ ఎప్పటిలాగే తమ కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. అదే విధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు ఈ చిత్రాన్ని ఎమోషనల్ డ్రైవ్ తో ప్యూర్ లవ్ స్టోరీగా చెప్పడానికి చేసిన ప్రయత్నం బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

ప్రేమ కథకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. పైగా కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది.

కానీ సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న కథాంశం బాగుంది. కథాంశం బాగున్నా ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతుంది. కథ పరంగా ఇంటర్నల్ లింక్స్ తో సాగే స్క్రీన్ ప్లేలోని తేడాను సినిమాటోగ్ర‌ఫర్ స్క్రీన్ మీద సరిగ్గా చూపించలేకపోయాడు. నిజానికి సినిమాలో బలమైన ఎమోషన్ ఉన్నా.. సరైన ట్రీట్మెంట్ లేకపోవడంతో ఆ ఎమోషన్ ఆశించిన స్థాయిలో ఎలివేట్ కాలేదు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి ముందు చెప్పుకున్నట్లుగానే సినిమాలో సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సాంగ్ బాగుంది. అలాగే ఆ పాటను చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. ఇక ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదు. అలాగే దర్శకుడు సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

 

తీర్పు :

టైటిల్ మాదిరిగానే ఈ సినిమా కూడా ‘ఇందు’ చుట్టే తిరిగింది. హీరో వరుణ్‌ సందేశ్‌, హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి మధ్య వచ్చే రొమాంటిక్ అండ్ ప్రేమ సన్నివేశాలు బాగున్నాయి. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, లవర్స్ కు సినిమాలో కొన్ని సీన్స్ కనెక్ట్ అవుతాయి. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా బోర్ కొడుతుంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version