సమీక్ష : గంగూబాయి కాఠియావాడి – అక్కడక్కడ ఇంట్రెస్ట్ గా సాగే గంగూబాయి జర్నీ!

Gangubai Kathiawadi Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 25, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అలియా భట్‌, అజయ్‌దేవ్‌గణ్‌, విజయ్‌ రాజ్‌, శంతను మహేశ్వరి, ఇందిరా తివారి తదితరులు

దర్శకత్వం : సంజయ్‌ లీలా భన్సాలీ

నిర్మాత: జయంతిలాల్‌ గడా

సంగీత దర్శకుడు: సంచిత్‌ బల్హారా, అంకింత్‌ బల్హారా, సంజయ్‌ (పాటలు)

సినిమాటోగ్రఫీ: సుదీప్‌ ఛటర్జీ

ఎడిటర్ : సంజయ్‌ లీలా భన్సాలీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘అలియా భట్’ మెయిన్ లీడ్ గా బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో “గంగూబాయి ఖతియావాది” సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే ఈ బిగ్గెస్ట్ ఎమోషనల్ డ్రామా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని ఓ ఉన్నత కుటుంబంలో పుడుతుంది. ఆమెకు చిన్న తనం నుంచే సినిమాలంటే ప్రాణం. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని కల కంటూ ఉంటుంది. అయితే, గంగూబాయి హర్జీవందాస్‌ ఆసక్తిని, ఇష్టాన్ని ఆసరా తీసుకున్న ఆమె ప్రియుడు… సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, ఆమెను ముంబై తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆమెను కామాటిపురలోని ఓ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో వేశ్య వృత్తిలోకి వచ్చిన గంగూబాయి మనసు చంపుకొని వేశ్యగానే కొనసాగుతుంది. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ? గంగూబాయి జీవన ప్రయాణం ఎలా సాగింది ? వేశ్యల అభ్యున్నతికి ఆమె ఎలాంటి కృషి చేసింది ? ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

అలియా భట్.. వన్ విమెన్ షోగా నడిచిన ఈ సినిమాలో.. గంగూబాయి పాత్ర పరిస్థితులకు తగ్గట్టు పాత్రలోని ఎమోషన్స్ కు తగ్గట్టు చక్కగా నటించి అలియా మెప్పించింది. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన శైలి నటనతో అలియా చాలా బాగా నటించింది.

పైగా తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా అలియా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. పైగా అలియా భట్ తన హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సంజయ్‌ లీలా భన్సాలీ తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ బాగున్నాయి.

మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలు, మరియు గంగూబాయి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక చివర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా ఆకట్టుకుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

గంగూబాయి పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. అలాగే జాతీయ స్థాయిలో గొప్పగా ప్రభావితం చేసిన ఓ గొప్ప స్త్రీ మూర్తి జీవితాన్ని సంపూర్ణంగా సమర్ధవంతంగా చూపించలేకపోయారు.

ఇక గంగూబాయి ఇప్పటి తరానికి, తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎవరికి తెలియదు. దీనికి తోడు కొన్ని సీన్స్ లాజికల్ గా కరెక్ట్ గా అనిపించవు. అయితే, రాసుకున్న కథను తెర పై చాలా క్లారిటీగా చాలా కలర్ ఫుల్ గా మేకింగ్ చేసిన దర్శకుడు భన్సాలీ, ప్లేను మాత్రం చాలా స్లోగా నడిపాడు. కొన్ని సీన్స్ కూడా బోర్ గా సాగాయి. అలాగే సినిమా కళాత్మకంగా ఉండటం కారణంగా పక్కా మాస్ ఆడియన్స్ ను ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవచ్చు.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ విభాగానికి వస్తే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. నేపధ్య సంగీతం చాలా బాగుంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దర్శకుడు భన్సాలీ డైరెక్షన్ పరంగా బాగా ఆకట్టుకున్నాడు. ఇక నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

‘గంగూబాయి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామాలో అలియా భట్ నటన, భన్సాలీ గ్రేట్ విజన్ అండ్ విజువల్స్ సినిమాలో హైలైట్ నిలిచాయి. సినిమా కూడా కళాత్మకంగా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. అయితే స్క్రీన్ ప్లే లో స్లో నేరేషన్, చాలా సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, వేశ్య వృత్తిలో చిక్కుకున్న అలియా పాత్ర ఎదుర్కొనే సమస్యల తాలూకు పర్యవసానాలను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తమ్మీద ఈ చిత్రం బిలౌవ్ ఏవరేజ్ అనిపించింది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

Exit mobile version