ఇటీవల కరోనా పరిస్థితుల సమయంలో ఎక్కువగా ప్రేక్షకులు సినిమాలు, షోలు, వెబ్ సిరీస్ ల వంటివి ఒటిటి మాద్యమాల్లోనే చూడడం జరిగింది. అప్పట్లో థియేటర్స్ కూడా కొన్ని నెలలపాటు తెరుచుకునే అవకాశం లేకపోవడంతొ ఓటిటి లకి బాగా క్రేజ్ ఏర్పడింది. ఇక ఇటీవల రాను రాను ప్రేక్షకులు థియేటర్స్ తో సమానంగా ఓటిటిలో కూడా సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. మరోవైపు కొన్నాళ్లుగా విడుదలవుతున్న సినిమాల్లో అక్కడక్కడా ప్లాప్ అయిన సినిమాలు ఎంతో త్వరగా ఓటిటిలో దర్శనమిస్తుంటే, సక్సెస్ఫుల్ సినిమాలు నెల అనంతరం అందులో అందుబాటులోకి వస్తున్నాయి.
వాస్తవానికి ఈ విధంగా త్వరగా ఓటిటిలకు సినిమాలు ఇవ్వడం వలన థియేటర్స్ కి ఒకింత ముప్పు వాటిల్లడంతో పాటు హీరోల యొక్క ఇమేజ్ కూడా ఇబ్బందుల్లో పడుతోందని నిశ్చయించిన తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై జులై 1 నుండి రిలీజ్ అయ్యే చిన్న, పెద్ద సినిమాలు అన్ని కూడా 50 రోజుల అనంతరమే ఓటిటిలో రిలీజ్ అయ్యేలా డెసిషన్ తీసుకున్నారట. మరొక రెండు రోజుల్లో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుండి అఫీషియల్ గా దీనిపై ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది