వేద ప్రామాణ్య మంత్రపేటికే పురాణపండ ” శ్రీపూర్ణిమ “

మహాగ్రంధాన్ని ఆవిష్కరించిన ఈ.వో సూర్యకళ

సింహాచలం : జులై : 8

అఖండమైన ప్రార్థనాశక్తి వల్లనే మనలోని శారీరక , మానసిక దోషాలు దూరమై నిస్వార్ధ యజ్ఞభావన ఏర్పడుతుందని సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎం.వి .సూర్యకళ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అద్భుత మంత్రపేటిక ‘ శ్రీపూర్ణిమ ‘ ఇరవై ప్రచురణ విశేష మహాగ్రంధాన్ని దేవస్థాన ప్రాంగణంలో వైదిక లాంఛనాల మధ్య ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సూర్యకళ మాట్లాడుతూ ఈ శ్రీపూర్ణిమ మహాగ్రంధం దివ్యమైన మంత్ర గుణాలతో ప్రకాశిస్తోందని, అత్యుత్తమ క్రియాశీలత, సృజనాత్మకత ఉన్న పురాణపండ శ్రీనివాస్ ఈ గ్రంధాన్ని వేదం ప్రామాణ్యంతో, శృతి గౌరవంతో తీర్చిదిద్దడం అభినందనీయమని చెప్పారు. ఆవిష్కృతమైన శ్రీపూర్ణిమ తొలిప్రతిని దేవస్థానం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అప్పల నాయుడు కు అందజేశారు.

శ్రీపూర్ణిమ ఇరవై ఐదవ ముద్రణా భాగ్యాన్ని పంచుకోవడం మా అదృష్టమని గ్రంథ సమర్పకులు సెంట్రల్ ఎక్సయిజ్ అధికారి జయంతి బలరామ మూర్తి, శ్రీమతి శాంతావరలక్ష్మి దంపతులు ఇది సింహాచల వరాహలక్ష్మీ నారసింహుడు, సింహావల్లీ తాయార్ల అనుగ్రహమేనని చెప్పడం విశేషం. ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు డాక్టర్ టి. రాజగోపాల్ , ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఆనందకుమార్ , దేవస్థానం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అప్పల నాయుడు, అమెరికాకు చెందిన రమేష్ తిప్పాభట్ల, శశికళ తిప్పాభట్ల , విశాల్ ధనుకా, కిరణ్మయి ధనుకా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Exit mobile version