సమీక్ష : ‘విక్రాంత్ రోణా’ – స్లోగా సాగే యాక్షన్ థ్రిల్లర్ !

Vikrant Rona Movie Review

విడుదల తేదీ : జులై 28, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవిశంకర్ గౌడ్

దర్శకత్వం : అనూప్ భండారి

నిర్మాత: షాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్

సంగీత దర్శకుడు: బి అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్

ఎడిటర్: ఆశిక్ కుసుగొల్లి

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కొత్త మూవీ విక్రాంత్ రోణా. బాలీవుడ్ నటి జాక్వలీన్ ఫెర్నాండజ్, నీతా అశోక్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి అనుప్ భండారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం.

 

కథ :

కోమరట్టు అనే గ్రామంలో ఆ ఊరు ఇన్ స్పెక్టర్ చనిపోతాడు. అతని ప్లేస్ లోకి కొత్త ఇన్ స్పెక్టర్ విక్రాంత్ రోణా (కిచ్చా సుదీప్ ) వస్తాడు. మరో వైపు ఆ గ్రామంలో వరుసగా పిల్లలు చనిపోతూ ఉంటారు. ఆ పిల్లలను చంపుతున్న వ్యక్తి ఎవరు ?, అసలు ఆ కోమరట్టు గ్రామంలో భూతాలు ఉన్నాయని ఎవరు పుకారు పుట్టించారు ?, విక్రాంత్ రోణా ఈ గ్రామానికే ఎందుకు వచ్చాడు ?, పిల్లలను చంపుతున్న వ్యక్తిని విక్రాంత్ రోణా ఎలా పట్టుకున్నాడు?, చనిపోయిన పిల్లల్లో ఎవరికైనా విక్రాంత్ రోణాకి సంబంధం ఉందా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోనా’ పాత్రలో అద్భుతంగా నటించాడు. కోమరట్టు అనే గ్రామంలో వరుసగా పిల్లలు చనిపోతున్న క్రమంలో అక్కడకి పోలీస్ గా వచ్చిన సుదీప్ పాత్ర, ఈ పాత్ర తాలూకు సన్నివేశాలు బాగున్నాయి. సుదీప్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్ లో సుదీప్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

అలాగే సినిమాలో బలమైన యాక్షన్ సీన్స్ మరియు కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. దర్శకుడు అనూప్ భండారి చెప్పాలనుకున్న థీమ్ తో పాటు సినిమాలో గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతాయి. విలన్ గా నటించిన నటుడు… అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఒదిగిపోయారు.

 

మైనస్ పాయింట్స్

పీరియాడిక్ డ్రామాకి సంబంధించి చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ బాగున్నా.. ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. అవసరానికి మించి బిల్డప్ సీన్స్ ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే సరైన ప్లో కూడా ఉండదు. పైగా ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతుంది. ఇక యాక్షన్ సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ కథ ప్రకారమే సాగుతున్న భావన కలిగినా ఓవరాల్ గా కథనాన్ని మాత్రం ముందుకు నడిపించవు.

పైగా కొన్ని యాక్షన్ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. దీనికి తోడు ప్లే ఆసక్తికరంగా సాగకపోగా స్లోగా సాగుతుంది. మొత్తానికి అనూప్ భండారి తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోయారు.

కాకపోతే, సినిమాలో అక్కడక్కడ ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ఉన్నా… అనూప్ భండారి సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయారు. మెయిన్ గా స్టోరీ పాయింట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, అనూప్ భండారి మాత్రం ఆ పాయింట్ ను సెకెండ్ ప్రీ క్లైమాక్స్ ముందు రివీల్ చేసి అసలు కథాంశాన్ని తక్కువ సీన్స్ కే పరిమితం చేశాడు.

 

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ముందు చెప్పుకున్నట్లుగానే దర్శకుడు అనూప్ భండారి కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మరియు విజువల్స్ పరంగా మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాలన్నీ చాలా బాగా చూపించారు. సంగీత దర్శకుడు అందించిన నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాత ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

భారీ అంచనాలతో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ డ్రామా.. భారీ విజువల్స్ తో హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కింది. కానీ, కథాకథనాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. బాగా స్లోగా సాగే స్క్రీన్ ప్లే, బోరింగ్ ట్రీట్మెంట్, అన్నిటికి మించి సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కాకపోతే.. ఎమోషనల్ సీన్స్ మరియు యాక్షన్ సీన్స్ అండ్ క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. అలాగే సుదీప్ అద్భుతంగా నటించాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు ఆకట్టుకుంటాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version