సమీక్ష : వాంటెడ్ పండుగాడ్ – ఆకట్టుకోలేకపోయిన బోరింగ్ సిల్లీ డ్రామా !

Wanted PanduGod Movie Review

విడుదల తేదీ : ఆగస్టు 19, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: సునీల్, సుధీర్, దీపికా పిల్లి, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, తనికెళ్ల భరణి, షకలక శంకర్

దర్శకత్వం : శ్రీధర్ సీపాన

నిర్మాత: వెంకట్ కోవెలమూడి

సంగీత దర్శకుడు: జనార్ధన మహర్షి

సినిమాటోగ్రఫీ: మహి రెడ్డి పండుగల

ఎడిటర్: తమ్మిరాజు

కే రాఘవేంద్రరావు సమర్పణలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది వాంటెడ్ పండుగాడ్. దర్శకుడు శ్రీధర్ సీపాన రూపొందించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్ష చూద్దాం…

 

కథ :

పండుగాడు(సునీల్) ఒక భయంకరమైన నేరస్థుడు, అతను జైలు నుండి తప్పించుకుని అడవిలో దాక్కుంటాడు. ఈ క్రమంలో అతన్ని పట్టుకున్న వారికి కోటి రూపాయల రివార్డును ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇంతకీ ఈ పండు ఎవరు ?. కోటీ రివార్డు కోసం పాండు సు(సుధీర్), డీ(దీపికా పిల్లి) రిపోర్టర్స్‌గా రంగంలోకి దిగుతారు. వీళ్లంతా కలిసి పండును పట్టుకునే క్రమంలో ఎటువంటి అడ్డంకులను ఎదుర్కున్నారు ?, చివరకు పండును పట్టుకొని కోటి రూపాయల రివార్డు అందుకున్నారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్లు :

ఈ సినిమాలో పలువురు హాస్యనటులు ఉండటమే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. చాలా మంది ప్రముఖ హాస్యనటులను ఒకే ఫ్రేమ్‌లో చూసి చాలా కాలం అయ్యింది. పైగా చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మానందం ఓ చిన్న పాత్ర చేసి నవ్వించారు. ఆయన ఈ సినిమాలో ఫన్నీ డాక్టర్‌గా నటించాడు. అలాగే వెన్నెల కిషోర్ కూడా సినిమాలో నవ్వులు పూయించాడు.

అదే విధంగా సప్తగిరి, కమెడియన్ అండ్ హీరో శ్రీనివాస్ రెడ్డి, మరియు థర్టీ ఇయర్స్ పృథ్వీ కొంత కామెడీని రేకెత్తించడానికి తమ వంతు కృషి చేశారు. అనసూయ తన పాత్రలో నీట్‌గా నటించింది. ఆమె చేసిన సోలో సాంగ్‌ కూడా బాగుంది. అలాగే ఈ చిత్రంలో కూడా ఆమె గ్లామరస్‌గా కనిపించింది. సునీల్‌ కి ఈ చిత్రంలో మెయిన్ పార్ట్ దక్కింది. సునీల్ కూడా చాలా బాగా నటించాడు. దీపికా పిల్లి పాటల్లో అందంగా కనిపించినా ఆమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ మాత్రం లేదు. ఇక మిగిలిన నటీనటులు కూడా బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ వాంటెడ్ పండుగాడ్ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించాడు. మెయిన్ గా సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా.. కథ చాలా వీక్ గా ఉంది. దీనికి తోడు స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమా ఏమాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. ముఖ్యంగా కథకు అవసరం లేని సీన్స్ ఎక్కువైపోయాయి.

పైగా ఆ సీన్స్ కూడా లాజిక్ లేకుండా సాగడం.. అలాగే కామెడీ కోసమని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం కూడా సినిమాకి మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. మొత్తానికి శ్రీధర్ సీపాన తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు. సినిమాను ఇంట్రెస్టింగ్ ఎలెమెంట్స్ తో ఆసక్తికరంగా మలచలేకపోయాడు.

కంటెంట్ పరంగా మంచి ఎంటర్ టైన్మెంట్ మరియు ఫుల్ కామెడీని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, శ్రీధర్ సీపాన మాత్రం సినిమాని ఆ దిశగా నడిపలేకపోయారు. దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం లోపించింది. బోరింగ్ ట్రీట్మెంట్ తో పాటు ఆసక్తి కలగించలేని కొన్ని కీలక సన్నివేశాల కారణంగా.. ప్లే లో సరైన ప్లో కూడా లేకుండా పోయింది. పైగా చాలామంది కమెడియన్లు ఉన్నప్పటికీ, సినిమాలో సరైన కామెడీ లేదు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు, కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది. సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ బాగాలేదు. దర్శకుడు శ్రీధర్ సీపాన విషయానికి వస్తే, ఈ రోజుల్లో కామెడీ షోలలో మరియు యూట్యూబ్‌లో ఎక్కువ కామెడీని చూడవచ్చు. ఏది ఏమైనా ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం శ్రీధర్ సీపాన రాసుకోలేదు.

 

తీర్పు :

మొత్తమ్మీద, ఈ వాంటెడ్ పండుగాడ్ పాతికేళ్ల క్రితం నాటి కామెడీ అంశాలతో నడుస్తోంది. దాంతో, ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. కథా కథనాలు ఏ మాత్రం ఆసక్తి కరంగా సాగకపోవడం, సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, ఓవరాల్ గా సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే కొన్ని కామెడీ సన్నివేశాలు, అక్కడక్కడా రేర్ గా వచ్చే కొన్ని జోక్స్ పర్వాలేదనిపిస్తాయి. మొత్తమ్మీద ఈ సినిమా ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version