సమీక్ష : హలో మీరా – అక్కడక్కడా ఆకట్టుకునే ప్రయోగాత్మక డ్రామా

Organic Mama Hybrid Alludu Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: గార్గేయ ఎల్లాప్రగడ.

దర్శకుడు : శ్రీనివాసు కాకర్ల

నిర్మాతలు: పద్మ కాకర్ల, డాక్టర్ లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల

సంగీత దర్శకులు: ఎస్. చిన్నా

సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ కొప్పినీడి

ఎడిటర్ : రాంబాబు మేడికొండ

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఒకింత మంచి కంటెంట్ తో వస్తున్న ప్రయోగాత్మక సినిమాలు సైతం ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయి. ఆ విధంగా కేవలం ఒకే ఒక పాత్రతో శ్రీనివాసు కాకర్ల తెరకెక్కించిన తాజా సినిమా హలో మీరా. గార్గేయ ఎల్లాప్రగడ నటించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి దీని సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

విజయవాడ కు చెందిన మీరా (గార్గేయ ఎల్లాప్రగడ) కి పెళ్లి నిశ్చయం అవడంతో కొత్తగా పెళ్లి దుస్తులు కొనుక్కునేందుకు ఆమె షాపింగ్ కి బయల్దేరుతుంది. అయితే అదే సమయంలో హైదరాబద్ కు చెందిన సుధీర్ అనే ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకున్నాడని, అలానే అతడు ఆ సమయంలో తన పేరు వెల్లడించాడని పోలీసులు ఫోన్ చేసి మీరాని అడుగుతారు. ఆ ఆత్మహత్య కేసు విచారణ విషయమై మీరాని హైదరాబాద్ రావాల్సింది గా ఆమెను కోరతారు. అయితే ఆత్మహత్యకు ముందు రోజు మీరాతో కలిసి దిగిన తమ నాలుగవ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ తాలూకు పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాడు సుధీర్. కాగా సుధీర్ తో చాలా కాలం క్రితమే విడిపోయిన మీరా, పోలీసులు చెప్పిన ఈ విషయాలు అన్ని విని ఒక్కసారిగా నిర్ఘాంతపోతుంది. మరి ఆ తరువాత ఆమె రియాక్షన్ ఏమిటి, పోలీసు విచారణకు ఆమె హైదరాబాద్ వెళ్లిందా, ఈ విషయాన్ని తన తల్లితండ్రులు, చేసుకోబోయే భర్తకు వెల్లడించిందా, మరి సుధీర్ ఆత్మహత్యకు కారణం ఏమిటి, దానితో నిజంగానే మీరాకు లింక్ ఉందా అనేటువంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం కావాలంటే మూవీ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

సినిమా మొత్తం ఒక ఫోన్ కన్వర్జేషన్ లోనే నడుస్తుంది. మనం స్క్రీన్ పై కేవలం మీరాని మాత్రమే చూస్తాము. ఇక మీరాని చేసుకోబోయే ఆమె భర్త, తల్లితండ్రులు, పోలీసులు, టైలర్, లా అధికారులు వంటి పలువురి వాయిస్ మనం సినిమాలో వింటాము. ప్రతి ఒక్క పాత్రధారి యొక్క వాయిస్ సినిమాకు ఎంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ విధంగా ప్రతి పాత్రని వారి వాయిస్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తూ, ఆకట్టుకునే రీతిన దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. నిజానికి ఈ విధమైన సినిమాల్లో నటించడం అంత సులువు కాదు. ఒక్క పాత్రతోనే సినిమా మొత్తాన్ని తన హావభావాలతో నడిపించి ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు నూతన నటి గార్గేయ ఎల్లాప్రగడ. ప్రతి సీన్ లో ఆమె పండించిన ఎమోషన్స్ ఎంతో బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో మొదటి గంట వరకు సినిమా ఎంతో మంచి ఆసక్తికర రీతిన సాగుతుంది. కేవలం గంటన్నర మాత్రమే నిడివి గల రన్ టైం కూడా ఈ సినిమాకి ఒక బలంగా చెప్పుకోవచ్చు.

 

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ తో పాటు క్లైమాక్స్ పోర్షన్స్ హలో మీరా సినిమాకి కొంత మైనస్ అనే చెప్పాలి. చాలా వరకు ఇంట్రెస్టింగ్ కథనం మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే సాగడంతో సెకండ్ హాఫ్ పెద్దగా ఆసక్తికరంగా ఉండదు. కొంత అతి డ్రామాగా కనిపించే కొన్ని సీన్స్ ఆడియన్స్ కి పరీక్ష పెడతాయి. ఫస్ట్ హాఫ్ లో థ్రిల్లింగ్ గా మెయింటెయిన్ చేసిన అంశం క్లైమాక్స్ లో చప్పగా మారుతుంది. ఫైనల్ ట్విస్ట్ ఆకట్టుకోకపోగా ఫస్ట్ హాఫ్ లో చూపించిన ఇంట్రెస్టింగ్ పార్ట్ అంతా వృధా అయినట్లు అనిపిస్తుంది. సినిమా స్వభావాన్ని బట్టి ఒకే ఒక్క పాత్ర ద్వారా కథనం సాగడం వంటివి ఫోన్ కాల్ ద్వారా తక్షణమే జరగాలి కాబట్టి కథ, కథనాల్ని నివారించలేము. అందుకే చివర్లో వచ్చే సన్నివేశాలు నమ్మశక్యం కానివిగా అనిపిస్తాయి. అలానే ఒకే పాత్రతో నడిచే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.

 

సాంకేతిక వర్గం :

కేవలం సినిమాలో ఒక్క పాత్ర ఉన్నప్పటికీ టెక్నీకల్ గా ఎంతో బాగా చూపించారు. ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్, అలానే కెమెరా యాంగిల్స్ వంటివి పలు సీన్స్ లో ఎంతో బాగున్నాయి. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అలానే ప్రశాంత్ కొప్పినీడి ఫోటోగ్రఫి సినిమాకు ఒకింత హెల్ప్ అయ్యాయి అనే చెప్పాలి. ఎడిటింగ్ పర్వాలేదనిపించగా కొన్ని సీన్స్ కొంత ట్రిమ్ చేసి ఉంటె బాగుండేదనిపిస్తుంది. ఇక దర్శకుడు శ్రీనివాసు కాకర్ల విషయానికి వస్తే, ఈ విధంగా ఒక్క పాత్రతో ప్రయోగాత్మకంగా సినిమా తీయాలి అనే ఆలోచన, దానిని తెరపై ఆకట్టుకునే రీతిన తీయడంలో ఆయన బాగానే హ్యాండిల్ చేసారు అని చెప్పాలి. అయితే అంతర్లీనంగా కొన్ని పరిమితులు సినిమా ప్రభావాన్ని బలహీనపరిచాయి. సెకండ్ హాఫ్ కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకుని ఉంటె తప్పకుండా హలో మీరా మూవీ మంచి సక్సెస్ అందుకుని ఉండేది.

 

తీర్పు :

మొత్తంగా ఒక్క పాత్రతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన హలో మీరా మూవీ భాగాలుగా ఆకట్టుకుంటుంది. నటి గార్గేయ ఎల్లాప్రగడ నటన, టెక్నీకల్ టీమ్ పనితీరు మంచి బలాలుగా చెప్పుకోవాలి. అయితే మధ్యలో కొంత మేర సినిమా ఆసక్తికరంగా లేకపోవడంతో పాటు క్లైమాక్స్ కూడా నిరాసక్తత కలిగించేలా ఉంటుంది. అయితే ఈ వారం ఒకసారి మీ ఫామిలీతో కలిసి ఈ మూవీ చూసేయొచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version