సమీక్ష : అంబాజీపేట మ్యారేజి బ్యాండు – ఆకట్టుకునే ఫీల్ గుడ్ డ్రామా !

Captain Miller Movie Review in Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: సుహాస్, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, శివాని నాగరం, జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, గాయత్రి భార్గవి, సురభి ప్రభావతి, కిట్టయ్య తదితరులు

దర్శకుడు : దుశ్యంత్‌ కటికినేని

నిర్మాతలు: ధీరజ్ మోగిలినేని

సంగీత దర్శకులు: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్

ఎడిటింగ్: కొదాటి పవన్ కల్యాణ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

నటుడు సుహాస్ హీరోగా శివాని నాగారం హీరోయిన్ గా పరిచయం అవుతూ దర్శకుడు దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “అంబాజీపేట మ్యారేజీ బ్యాండు”. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ:

అంబాజీపేట అనే ఊర్లో వెంకట్ (నితిన్ ప్రసన్న) పెద్ద మనిషిగా చెలామణి అవుతుంటాడు. ఊర్లో సగం మంది వెంకట్ దగ్గర అప్పులు తీసుకుని వడ్డీలు కట్టుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే గ్రామంలో మల్లి (సుహాస్) మ్యారేజి బ్యాండులో పని చేస్తుంటాడు. మల్లి అక్క పద్మ (శరణ్య) అదే ఊర్లో స్కూల్ టీచర్‌గా పని చేస్తుంటుంది. వెంకట్ వల్లే పద్మకి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. దాంతో, పద్మ తనకు ఇష్టం లేకపోయినా ప్రతి ఆదివారం వెంకట్ దగ్గరకు వెళ్లి అతని వ్యాపారాలకు సంబంధించిన లెక్కలు రాస్తుంటుంది. మరోవైపు, వెంకట్ చెల్లి లక్ష్మీ (శివానీ)తో ‘మల్లి’ ప్రేమలో పడతాడు. శివాని కూడా మల్లిని ప్రేమిస్తోంది. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ?, కులం, డబ్బుని చూసుకుని అహంకారంతో రెచ్చిపోయిన వెంకట్ కి.. మల్లి, మరియు అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ గ్రూప్ ఎలా బుద్ధి చెప్పింది ?, చివరకు మల్లి ప్రేమ కథ ఎలా సాగింది ? అన్నది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్:

కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంలో కొన్ని ఎమోషన్స్ అండ్ ప్లే అలాగే సినిమాలో ఇచ్చిన మెసేజ్ ప్రేక్షకుల మనసును కదిలిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే.. సామాజికంగా వెనుకబడిన అణగారిన వర్గాల మనోభావాలను ఆవిష్కరించే చిత్రం ఇది. వాస్తవిక కథతో పాటు కథనం కూడా చాలా వాస్తవంగా సాగడంతో సినిమా పై ఆసక్తి పెరుగుతుంది. ఏ తప్పు చెయ్యని వారిని కులం పేరుతో అగ్ర కుల సమాజం మానసికంగా హింసించే సన్నివేశాలు కూడా చాలా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి.

అలాగే, ఆత్మాభిమానంతో ఉండే పద్మ – మల్లి పాత్రలకు – వెంకట్ పాత్రకు మధ్య మొదలైన వైరం.. ఈ గొడవల్లో మల్లి, లక్ష్మీల ప్రేమ కథ కొత్త మలుపు తీసుకోవడం, చివరకు వెంకట్ పరిస్థితి ఊహించని విధంగా మారిపోవడం.. ఇలా కథలో దర్శకుడు దుష్యంత్ కటికినేని మంచి ఎలిమెంట్స్ రాసుకుని అంతే సమర్ధవంతంగా ఆ సన్నివేశాలను తెరకెక్కించాడు. సుహాస్ నటన అద్భుతంగా అనిపిస్తోంది. మరో కీలక పాత్రలో శరణ్య ప్రదీప్ కూడా చాలా బాగా నటించింది. నితిన్ ప్రసన్న పాత్ర మాత్రం ఈ సినిమాకి ప్రత్యేకం. హీరోయిన్ గా శివాని నాగరం బాగా అలరించింది. అలాగే, జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, గాయత్రి భార్గవి, సురభి ప్రభావతి, కిట్టయ్య తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు దర్శకుడు దుష్యంత్ పనితీరు సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది.

 

మైనస్ పాయింట్స్ :

మనసును కదిలించే మెసేజ్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలతో ఈ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం, అదేవిధంగా స్క్రీన్ ప్లే చాలా స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా దర్శకుడు ఫస్ట్ హాఫ్ కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. నిజానికి ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలోడ్రామాలా అనిపిస్తోంది.

అదేవిధంగా ఫస్ట్ హాఫ్ కామెడీ కోసం పెట్టిన అనవసరమైన ఎలిమెంట్స్ కూడా ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, ప్రధాన పాత్రలు ఎలాంటి కష్టాల్లో పడతారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా సినిమాని నడపలేదు.

 

సాంకేతిక విభాగం :

మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు అంతే స్థాయిలో ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ, దుశ్యంత్‌ కటికినేని రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని చాలా బాగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వాస్తవిక చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాత ధీరజ్ మోగిలినేనిను అభినందించాలి. ఆయన నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు:

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుపోయాయి. అలాగే నటీనటుల నటన కూడా బాగుంది. కాకపోతే, స్లో నేరేషన్, పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం, రొటీన్ లవ్ డ్రామా వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రంలో ఎమోషనల్ ఎలిమెంట్స్ అండ్ మెసేజ్ మాత్రం ఆకట్టుకుంటాయి.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version