ఓటిటి సమీక్ష: వళరి – ఈటీవీ విన్‌లో తెలుగు సినిమా

Valari Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 06, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రితికా సింగ్, శ్రీరామ్, ఉత్తేజ్, సుబ్బరాజు, ప్రిన్సెస్ సహస్ర, పర్ణిత రుద్రరాజు

దర్శకుడు: మృతిక సంతోషిని

నిర్మాత: సత్య సాయి బాబా

సంగీత దర్శకులు: TS విష్ణు, హరి గౌర

సినిమాటోగ్రాఫర్‌: సుజాత సిద్ధార్థ్

ఎడిటింగ్: తమ్మి రాజు

సంబంధిత లింక్స్: ట్రైలర్

రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ వళరి ఈరోజు ఈటీవీ విన్‌లోకి వచ్చింది. లేడీ డైరెక్టర్ మృతికా సంతోషిని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీరామ్ మరియు ఉత్తేజ్ లు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ:

నవీన్ (శ్రీరామ్) చెన్నైలో పనిచేసే నేవీ కెప్టెన్. అతను తన భార్య దివ్య (రితికా సింగ్) మరియు కొడుకుతో కలిసి ఉంటున్నాడు. దివ్యకు ఒక విచిత్రమైన కల వస్తూ ఉంటుంది. అందులో 13 ఏళ్ల అమ్మాయి తన తల్లిదండ్రులను చంపేస్తుంది. నవీన్ కృష్ణపట్నం కి ట్రాన్స్ ఫర్ అవుతాడు. కుటుంబాన్ని తనవెంట తీసుకు వెళతాడు. మొదట్లో ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసం ప్రారంభిస్తారు. దివ్య అక్కడ ఉన్న పాత బంగ్లా పట్ల ఆకర్షితురాలవుతుంది. అక్కడ కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ను ఎక్స్ పీరియన్స్ చేస్తుంది. ఒక రోజు, ఆమె ప్రమాదానికి గురి అవుతుంది. దివ్య కోలుకున్న తర్వాత కుటుంబం మొత్తం ఆ పాత బంగ్లాకు వెళ్లిపోతుంది. బంగ్లా వారి జీవితాలతో అనుసంధానించబడిందని కుటుంబం తొందరగానే తెలుసుకుంటుంది. ఆ బంగ్లాలో ఏం జరిగింది? నవీన్ కుటుంబానికి ఎలా సంబంధం ఉంది? దివ్యకి ఇంత విచిత్రమైన కల ఎందుకు వస్తోంది? అనే ప్రశ్నలకు సినిమాలో సమాధానాలు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

రితికా సింగ్ ఈ చిత్రం కి ప్రాణం పోసింది. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇందులో నటి సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. రితికా సింగ్ తన యాక్షన్ ఎలిమెంట్స్ ను ప్రదర్శించే అవకాశాన్ని కూడా పొందింది. ఆమె ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌ లో చాలా అద్భుతంగా నటించింది. కీలకమైన ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత, రితికా పాత్ర మరింత పవర్ ఫుల్ గా మారుతుంది.

శ్రీరామ్ తన పాత్రతో ఆకట్టుకున్నాడు. అతను రితికా సింగ్‌కి చక్కని సపోర్ట్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాలను చక్కగా హ్యాండిల్ చేయడం తో క్లైమాక్స్‌లో సినిమా ఆసక్తికరంగా మారింది. చిత్రంలో చూపించిన సామాజిక సమస్యకు మరింత ప్రజల శ్రద్ధ అవసరం. ఈ అంశాన్ని చూపించినందుకు మేకర్స్ ను తప్పకుండా అభినందించాలి.

చివర్లో రితికా సింగ్ నాల్గవ గోడను బద్దలు కొట్టి సమాజానికి ఒక ముఖ్యమైన ప్రశ్న వేసే చిన్న డైలాగ్ ఉంది. ఇలాంటి సన్నివేశాలు బాగా ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఉత్తేజ్, సుబ్బరాజు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

ఎవరైనా సాలిడ్ థ్రిల్లర్ లేదా స్కేరీ మూమెంట్స్ ను ఆశించినట్లయితే, వళరి మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. ట్రైలర్‌ని బట్టి చూస్తే, ఇది ఒక హారర్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. కానీ సినిమాలో ఎఫెక్టివ్ థ్రిల్స్ లేదా వావ్ మూమెంట్స్ లేవు. వళరి కూడా మనల్ని భయపెట్టదు. ఇలాంటి చిత్రాలకు అవసరమైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇందులో లేదు.

వళరి కి కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు ఉన్నాయి. కానీ చాలా సన్నివేశాల్లో సరిగ్గా ఎక్జిక్యూట్ చేయలేదు అని చెప్పాలి. రిలేటెడ్ సబ్జెక్ట్‌ని డీల్ చేసినప్పటికీ సినిమా మనకు సంతృప్తికరమైన అనుభూతిని ఇవ్వలేదు. కథానాయికకు విచిత్రమైన కల రావడం, ఆమె గతాన్ని రెండుసార్లు మరచిపోవడం వంటి ఆలోచనలు చాలా ఎగ్జైట్ గా అనిపిస్తాయి. కానీ వాటిని స్క్రీన్ పై సరిగ్గా చుపించలేకపోయారు.

కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకొవు. ఉదాహరణకు, స్త్రీలను చిన్నచూపు చూసే వ్యక్తిపై రితికా సింగ్ ఫైట్ సీన్ ఉంది. ఇలాంటి సీన్లు నెక్స్ట్ లెవల్లో ప్రెజెంట్ చేయాల్సి ఉంది. కానీ ముందే చెప్పుకున్నట్టు వాటిని సరిగ్గా డిజైన్ చేయలేదు. కాబట్టి ఇంపాక్ట్ మిస్ అయింది. డైలాగ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది.

సాంకేతిక విభాగం:

టిఎస్ విష్ణు సంగీతం పర్వాలేదు. హరి గౌర కంపోజ్ చేసిన లాలీ సాంగ్ డీసెంట్ గా ఉంది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. చాలా షాట్‌లలో గ్రీన్ స్క్రీన్‌ని గమనించకుండా ఉండలేము. VFX వర్క్స్ ఇంకాస్త బెటర్ గా ఉండే అవకాశం ఉంది. ఎడిటింగ్ ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

డైరెక్టర్ మృత్తిక సంతోషిని ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రదర్శించాలనే ఇంటెన్షన్ బాగుంది. సామాజిక సందేశంను చక్కగా అందించబడినప్పటికీ, అది సరిపోదు. ఇందులో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మరియు థ్రిల్లింగ్ మూమెంట్స్ లేవు.

తీర్పు:

మొత్తమ్మీద, వళరి కొన్ని సన్నివేశాలలో మాత్రమే ఆకట్టుకుంటుంది. ఇంట్రెస్టింగ్ థాట్స్ ఉన్నప్పటికీ, సినిమా సంతృప్తికరంగా లేదు. ఈ చిత్రం ఒక ముఖ్యమైన సామాజిక సమస్యతో వ్యవహరించడం, చివరికి ఇచ్చిన సందేశం బాగుంది. ఇందులో రితికా సింగ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. గ్రిప్పింగ్ నేరేషన్ లేకపోవడం, థ్రిల్లింగ్ మూమెంట్స్ మరియు కొన్ని కీలకమైన సన్నివేశాలను సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోవడం సినిమాకి మైనస్ గా మారాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version