ఇంట‌ర్వ్యూ : వారికి ‘స‌త్య‌భామ’ మూవీ బాగా న‌చ్చుతుంది – శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌

స్టార్ హీరోయిన్ గా త‌న స‌త్తా చాటిన అందాల భామ కాజ‌ల్ అగ‌ర్వాల్, ప్ర‌స్తుతం తిరిగి ఆ స్టార్ డ‌మ్ తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. త‌ల్లి అయిన త‌రువాత కూడా స్టార్ గా తిరిగి స‌క్సెస్ అందుకునేందుకు కాజ‌ల్ బాగా కష్ట‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమె ప్ర‌స్తుతం ‘స‌త్య‌భామ’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను అలరించేందుకు సిద్ధ‌మైంది. సుమ‌న్ చిక్కాల డైరెక్ట్ చేస్తున్న ఈ కాప్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీకి శ‌శి కిర‌ణ్ తిక్క స్క్రీన్ ప్లే అందిస్తుండ‌గా శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. జూన్ 7న ఈ సినిమా రిలీజ్ అవుతుండ‌టంతో సంగీత ద‌ర్శకుడు శ్రీచ‌ర‌ణ్ మీడియాతో ముచ్చ‌టించారు.

 

మీరు ‘స‌త్య‌భామ’ మూవీ ఓకే చేయ‌డానికి గ‌ల కార‌ణం ఏమిటి?
కాజ‌ల్ అగ‌ర్వాల్ లాంటి హీరోయిన్ లీడ్ రోల్ ప్లే చేస్తుంద‌ని తెలుసుకుని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇక ప‌దేళ్ల నుంచి ప‌రిచ‌యం ఉన్న శ‌శికిర‌ణ్ తిక్క‌తో మూడో సినిమా కావ‌డం కూడా నన్ను ఈ సినిమాను ఓకే చేసేలా చేసింది. మంచి ఫ్రెండ్ అయిన శ‌శికిర‌ణ్ కోసం ఈ సినిమా చేస్తున్నాను.

 

ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంది.. ఆడియెన్స్ కి న‌చ్చుతుందా..?
థ్రిల్ల‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారికి ‘స‌త్య‌భామ’ సినిమా బాగా న‌చ్చుతుంది. ఈ సినిమాలోని ట్విస్టులు సూప‌ర్ గా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. కాజ‌ల్ చేసిన యాక్ష‌న్ సీన్స్ ప్రేక్షకుల‌కు చాలా రోజుల వ‌ర‌కు గుర్తుండిపోతాయి.

 

ఈ సినిమాలోని సంగీతం గురించి చెప్పండి..?
స‌త్య‌భామ సినిమాలో మొత్తం ఐదు పాట‌లు ఉన్నాయి. అందులో ఒక‌టి ఇంగ్లీష్ సాంగ్ కూడా ఉంటుంది. కీర‌వాణి గారు పాడిన ‘వెతుకు వెతుకు’ అనే సాంగ్ చాలా బాగా వ‌చ్చింది. కీర‌వాణి, చంద్ర‌బోస్ ల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది.

మీరు ఎక్కువ‌గా థ్రిల్ల‌ర్ సినిమాల‌కు ఎందుకు వ‌ర్క్ చేస్తారు..?
నేను థ్రిల్ల‌ర్ సినిమాల‌కే ఎక్కువ‌గా ప‌ని చేస్తున్నాన‌నే పేరొచ్చింది. ఇది నాకు కాస్త ఇబ్బందిగానే ఉంది. కృష్ణ అండ్ హిజ్ లీల‌, డీజే టిల్లు, గుంటూరు టాకీస్ వంటి క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కూడా వ‌ర్క్ చేశాను. కానీ నాకు ఎక్కువ‌గా వ‌చ్చిన ప్రాజెక్టుల‌న్నీ థ్రిల్ల‌ర్ సినిమాలే కావ‌డంతో ఆ పేరు వ‌చ్చింది.

మీరు ఎలాంటి సినిమాల‌కు మ్యూజిక్ చేయ‌డం ఇష్ట‌ప‌డ‌తారు..?
నేను అన్ని ర‌కాల సినిమాలకు మ్యూజిక్ చేయ‌డం ఇష్ట‌ప‌డ‌తాను. కానీ అలాంటి అవ‌కాశాలు రావాలి క‌దా. థ్రిల్ల‌ర్ మూవీస్ లో బీజీఎంకు ఎక్కువ పేరొస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో పాట‌ల‌కు గుర్తింపు వ‌స్తుంది. నేను రెండు ర‌కాల సంగీతాన్ని అందించాను.

కాపీ మ్యూజిక్ పై మీ ఒపీనియ‌న్..?
ప్ర‌స్తుతం ఆడియెన్స్ చాలా క్లియ‌ర్ గా ఉన్నారు. ఏ మ్యూజిక్ చేస్తున్నామ‌నేది వారు గ‌మ‌నిస్తున్నారు. ఎక్క‌డి నుండో లేపేసి మ్యూజిక్ ఇస్తే వారు ఇట్టే గుర్తుప‌ట్టేస్తున్నారు. వారికి కొత్త మ్యూజిక్ కావాలి. దానికోస‌మే నేను ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతుంటాను.

మీకు ఇండ‌స్ట్రీలో పోటీ ఎవ‌ర‌ని అనుకుంటున్నారు..?
నాకు ఎవ‌రితోనూ పోటీ ప‌డాల‌ని ఉండ‌దు. నాకు నాతోనే పోటీ. తోటి మ్యూజిక్ డైరెక్టర్స్ అంద‌రూ ఫ్రెండ్లీగా ఉంటారు. మూవీ త‌రువాత మూవీ వ‌స్తూనే ఉండ‌టంతో నేను బిజీగా ఉంటున్నాను. గూఢ‌చారి-2 త‌రువాత మ‌రో నాలుగైదు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

Exit mobile version