సమీక్ష : మిస్టర్ బచ్చన్ – అక్కడక్కడ ఆకట్టుకునే యాక్షన్ డ్రామా !

Committie Kurrollu Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 15, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, తదితరులు

దర్శకుడు: హరీశ్ శంకర్

నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అభిషేక్ పాఠక్

సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్,

సినిమాటోగ్రఫీ: అయానక బోసే

ఎడిట‌ర్ : ఉజ్వల్ కులకర్ణి

సంబంధిత లింక్స్: ట్రైలర్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన కొత్త సినిమా మిస్టర్ బచ్చన్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోస్ నేడు పడ్డాయి. మరి ఏ మేరకు ఈ సినిమా మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ:

ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. అవినీతికి వ్యతిరేకి. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో, ఆగ్రహించిన పైఅధికారులు మిస్టర్ బచ్చన్ ని డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వస్తాడు. అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం బచ్చన్ ఏం చేశాడు ?, బచ్చన్ తో జిక్కీ ఎలా ప్రేమలో పడింది ?, వీరి ప్రేమ విషయం ఇంట్లో ఎలా తెలిసింది ?, పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు ?, అంతలో బచ్చన్ కి ఉద్యోగంలో చేరమని ఫోన్ రావడం, బచ్చన్ తన తదుపరి రైడ్ ఎంపీ అయిన ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి రావడంతో కథ మలుపు తిరుగుతుంది. అధికారులని సైతం భయపెట్టే ముత్యం జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు ?, అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి ?, చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

మిస్టర్ బచ్చన్ గా రవితేజ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. తన శైలి కామెడీ టైమింగ్ తో పాటు స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్ తో మరియు బలమైన ఎమోషన్స్ తోనూ రవితేజ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. రవితేజ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో మరియు తన లుక్స్ తో రవితేజ చాలా బాగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్ తో అలరించింది. ముఖ్యంగా సాంగ్స్ లో భాగ్యశ్రీ బోర్సే లుక్స్, స్టెప్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి.

విలన్ గా జగపతి బాబు తన పాత్రకు పూర్తి నాయ్యం చేశారు. కమెడియన్ స‌త్య తన కామెడీతో నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ లో స‌త్య సీన్స్ దాదాపు వర్కౌట్ అయ్యాయి. ఇతర కీలక పాత్రల్లో నటించిన సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, గౌతమి, ప్రవీణ్ తమ పాత్రలో ఒదిగిపోయారు. అలాగే, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఒక ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నిజాయితీతో పని చేస్తే.. సిస్టమ్ కి ఎంతో మేలు జరుగుతుందని చూపించిన విధానంతో పాటు హరీశ్ శంకర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

మిస్టర్ బచ్చన్ పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న హరీశ్ శంకర్, అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో – విలన్ మధ్య మైండ్ గేమ్ ని ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది.

ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకత మిస్ అయ్యింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. మొత్తానికి హరీశ్ శంకర్ డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్, బీజీఎం బాగున్నప్పటికీ.. సినిమా మాత్రం యావరేజ్ గానే అనిపిస్తుంది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు హరీశ్ శంకర్ తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి తగ్గించాల్సింది. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అభిషేక్ పాఠక్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

‘మిస్టర్ బచ్చన్’ అంటూ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. రవితేజ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్, అలాగే మాస్ ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఐతే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version