ఇంటర్వ్యూ : నటుడు అంకిత్ కొయ్య – “మారుతి నగర్ సుబ్రమణ్యం” కి రావు రమేష్ గారితో పని చేసాక మరింత గౌరవం పెరిగింది

టాలీవుడ్ వెర్సటైల్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రమే “మారుతి నగర్ సుబ్రమణ్యం”. మరి ఈ సినిమాలో ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మరి తాను ఏ;ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం.

మీరు చాలా సినిమాల్లో నటించారు. కానీ మొదటిసారి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మీ గురించి చెప్పండి

మాది విశాఖ. గీతం యూనివర్సిటీలో బీటెక్ చేశా. స్కూల్ డేస్ వరకు సాధారణంగా ఉన్నాను. గ్రూమింగ్ అంటే కూడా తెలియదు. దీపక్ సరోజ్ అని నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు. తను చైల్డ్ ఆర్టిస్ట్. చాలా సినిమాల్లో నటించాడు. అతని వల్ల నాకు కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశా. రెండేళ్ల తర్వాత సీనియర్లు కొత్తగా వచ్చే వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వమని నాకు అప్పజెప్పేవారు. అక్కడి నుంచి మెల్లగా యాడ్స్, సినిమాల్లోకి వచ్చాను. కాలేజీలో ఉండగా… అల్లు అర్జున్ గారితో ఓఎల్ఎక్స్ యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. ఆడిషన్ చూసి బన్నీ గారు స్వయంగా నన్ను ఎంపిక చేశారు.

ఈ ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ లో అవకాశం ఎలా వచ్చింది?

సినిమాలో ఇంద్రజ గారు నాకు అమ్మ క్యారెక్టర్ చేశారు. ఆవిడకు మా దర్శకుడు లక్ష్మణ్ కార్య కథ నేరేట్ చేసినప్పుడు… అబ్బాయి పాత్రకు ఆవిడ నన్ను సజెస్ట్ చేశారు. ఓ సినిమాలో మేం మదర్ అండ్ సన్ రోల్స్ చేశాం. ఆ మూవీ ఇంకా విడుదల కాలేదు. నేను ఆవిడతో షూటింగ్ చేసినది రెండు రోజులే. నా పేరు కూడా ఆవిడకు గుర్తు లేదు. కానీ, లక్ష్మణ్ అన్న కథ చెబితే… ఆ అబ్బాయి అయితే చాలా బావుంటాడని రిఫర్ చేశారు. లక్ష్మణ్ కార్య కనుక్కుంటే… అప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్లు చూసి చేయగలనో లేదో అని సందేహించారు. ఆడిషన్ తర్వాత అంతా ఓకే అయ్యింది.

సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి

చిన్నప్పుడు ఇంట్లో ఏడిపిస్తారు కదా… ‘నువ్వు మాకు పుట్టలేదు. ఎక్కడి నుంచో తీసుకు వచ్చాం’ అని! నా క్యారెక్టర్ ఏమిటంటే… ‘నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్ కొడుకును. అల్లు అర్జున్ మా అన్నయ్య’ అనుకునే టైపు. ఒకానొక సీన్ వచ్చినప్పుడు రావు రమేష్ గారిని ‘మా ఇంటికి ఎప్పుడు పంపిస్తావ్’ అని కూడా అడుగుతాడు. ఆ క్యారెక్టర్ నుంచి మంచి ఫన్ జనరేట్ అయ్యింది.

‘ఆయ్’కి అల్లు అరవింద్ గారు ప్రజెంటర్. ఆయన్ను కలిసినప్పుడు ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ గురించి అడిగారా?*

ఇటీవల అల్లు అరవింద్ గారిని కలిశా. ఆయన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ట్రైలర్ చూశారు. అందులో నేను అరవింద్ కొడుకును అని చెబుతా కదా! ‘ఏవయ్యా… నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతున్నావ్ అంట. తెలిసింది’ అని సరదాగా అన్నారు. అల్లు ఫ్యామిలీకి, నాకు ఏదో కనెక్షన్ ఉందేమో! అల్లు అర్జున్ గారితో ‘ఓఎల్ఎక్స్’ యాడ్ చేశా. అల్లు అరవింద్ గారి బ్యానర్ లో ‘ఆయ్’ చేశా. ఈ ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాలో అల్లు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే రోల్ చేశా.

రావు రమేష్ గారితో మీ వర్క్ ఇష్క్ పీరియన్స్ కోసం చెప్పండి? అయన నుంచి ఏమన్నా నేర్చుకున్నారా?

నేను ఎలా నటిస్తానో నాకు ఇప్పటికీ తెలియదు. దర్శకుడు చెప్పింది ఫాలో అయిపోతా. రావు రమేష్ గారిని ఒకసారి ఏమైనా సలహా ఇస్తారేమో అని అడిగా. ‘నువ్వు బాగా చేస్తున్నావ్. అలా కంటిన్యూ అయిపో’ అని చెప్పారు. నాన్నగారు, తాతయ్యగారు నాటకాలు వేసేవారట. బహుశా… ఆ జీన్స్‌ వచ్చాయేమో! రావు రమేష్ గారితో నాకు ఫస్ట్ డే షూటింగ్. మా ఇద్దరి కాంబోలో ఒక సీన్ ఉంది. ఆయన భుజం మీద చెయ్యి వేసి డైలాగ్ చెప్పాలి. ఎప్పుడు, ఏ టైమింగ్ లో చెయ్యి వేయాలో మా దర్శకుడు లక్ష్మణ్ అన్న చెప్పారు. సీన్ అయ్యాక ‘మంచి టైమింగ్ ఉంది నీకు’ అని మెచ్చుకున్నారు. షూటింగ్ చేసేటప్పుడు షాట్ గ్యాప్ మధ్యలో ఆయనకు కాస్త దూరంగా కూర్చునేవాడిని. ప్యాకప్ చెప్పేసి వెళ్లేటప్పుడు ‘లవ్ యు నాన్న’ అంటూ హగ్ చేసుకునేవారు. ఆయనతో పని చేశాక మరింత గౌరవం పెరిగింది.

సుకుమార్ గారు సినిమాకు సపోర్ట్ ఇస్తున్నారు, ఇదంతా ఎలా?

సుకుమార్ గారిని కలిసే అదృష్టం ఇంకా రాలేదు. అయితే, లక్ష్మణ్ అన్న ద్వారా ఎప్పటికప్పుడు సుకుమార్ గారు, తబిత గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారనేది నాకు తెలుస్తోంది. సినిమా చూశాక సుకుమార్ గారు అందరి గురించి బాగా చెప్పారని లక్ష్మణ్ చెప్పారు. సుకుమార్, తబిత దంపతుల దృష్టికి వెళ్లేలా లక్ష్మణ్ సినిమా పబ్లిసిటీ చేశారు.

Exit mobile version