ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తమకు తోచిన విధంగా తమ అభిమాన హీరోకు విషెస్ చెప్పడం, ఆయన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం చూశాం. అయితే, ఈశ్వరయ్య అనే అభిమాని తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి తన అభిమానాన్ని చాటుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి పలు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, ఈశ్వరయ్య తో పాటు ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి, వారిక కుటుంబానికి పట్టు బట్టలు పెట్టి సత్కరించారు. తనపై ప్రేమాభిమానాలు చూపిన ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని మెగాస్టార్ హామీనిచ్చారు.
సోమవారం రోజున చిరంజీవి అయ్యప్ప మాలను ధరించారు. ప్రతీ ఏడాది లాగే ఈయేడు కూడా ఆయన అయ్యప్ప మాలను ధరించారు. మాలధారణలోనూ ఈశ్వరయ్య కుటుంబంతో చిరంజీవి కలిసి మాట్లాడటం విశేషం. చిరంజీవి తన వీరాభిమానులకు ఎప్పుడూ అండగా నిలుస్తుంటారు. చాలా సందర్భాల్లో ఇది నిరూపణ అయ్యింది కూడా. ఇప్పుడు ఈశ్వరయ్య గురించి తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబాన్ని సత్కరించడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక గతంలో ఈశ్వరయ్య తిరుపతి నుంచి మెగాస్టార్ ఇంటి వరకు సైకిల్ యాత్రను నిర్వహించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు, జనసేన పార్టీ నెగ్గాలని ఇలా అనేక సార్లు పొర్లు దండాలు చేశారు.