విడుదల తేదీ : సెప్టెంబర్ 13, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, నాజర్ తదితరులు.
దర్శకుడు: అర్జున్ సాయి
నిర్మాత : సురేష్ పాటిల్
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సంబంధిత లింక్స్: ట్రైలర్
అర్జున్ సాయి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఉత్సవం. సురేష్ పాటిల్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
సురభి నాటక మండలిలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు అభిమన్యు నారాయణ (ప్రకాష్ రాజ్) ఎలాంటి జాబ్ చేయకుండా నాటకాలనే నమ్ముకుని బతుకుతూ ఉంటాడు. అతని కొడుకు కృష్ణ (దిలీప్ ప్రకాష్) అనుకోకుండా మరో నాటకాల ప్రముఖుడు సహదేవ్(నాజర్) కూతురు రమ(రెజీనా కసాండ్రా)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రమ, కృష్ణ ఇద్దరూ ప్రేమలో పడతారు. మరోవైపు వీరిద్దరి పెళ్లి చేయడానికి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఐతే, ఆ విషయం వీరికి తెలియదు. ఆ తర్వాత వీరి ప్రేమ కథలో జరిగిన డ్రామా కారణంగా కృష్ణ – రమా జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి ?, ఇంతకీ.. కృష్ణ, నాటకాలకు పూర్వ వైభవం తీసుకువచ్చాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
అంతరించిపోతున్న నాటకాల గురించి, నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ‘ఉత్సవం’ సినిమాలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అండ్ గుడ్ మెసేజ్ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా, సురభి నాటకాల చుట్టూ దర్శకుడు మంచి ప్రేమ కథను డిజైన్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా నాటకాలు వేసేవాళ్ళ జీవితాల గురించి, నాటకాలకు పూర్వ వైభవం వస్తే ఎలా ఉంటుంది ? అనే కోణంలో వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి.
ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కి వస్తే.. దిలీప్ ప్రకాష్ నటన బాగుంది. అటు ప్రేమ కథలో ఇటు ఫ్యామిలీ సీన్స్ లో చాలా బాగా నటించాడు. అలాగే, తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు దిలీప్ ప్రకాష్ బాగా మెయింటైన్ చేశాడు. మరో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ చాలా బాగా నటించాడు.నాజర్, బ్రహ్మానందం కూడా ఆకట్టుకున్నారు. హీరోయిన్ పాత్రలో నటించిన రెజీనా కూడా తన పాత్రలో మెప్పించింది. అలాగే, రాజేంద్రప్రసాద్, అలీ, బ్రహ్మాజీ, LB శ్రీరామ్, జబర్దస్త్ అభి తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు అర్జున్ సాయి పనితీరు కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ లో హైలైట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా పలువురు నాటకాల్లోని పాత్రలతో, డైలాగ్స్ తో అదరగొట్టారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో చాలా భాగం నాటకాలు, దక్ష యజ్ఞం నాటకం, నాటకాల్లోని డైలాగ్స్ తోనే చాలా సీన్స్ సాగడంతో ఇంట్రెస్ట్ మిస్ అయ్యింది. పైగా ఆ సన్నివేశాలు కూడా సాగదీసినట్టు అనిపిస్తాయి. ఐతే, మనసును కదిలించే ఎమోషనల్ సన్నివేశాలతో ఈ ఉత్సవం సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం, అదేవిధంగా స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
ముఖ్యంగా దర్శకుడు ఫస్ట్ హాఫ్ కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. నిజానికి ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలోడ్రామాలా అనిపిస్తోంది. అదేవిధంగా కీలక సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. హీరో – హీరోయిన్ ఒకరికొకరు తెలియకుండా ఇష్టపడటం, వాళ్ళిద్దరికే పెళ్లి అని తెలియకుండా కలిసి తిరగడం లాంటివి సీన్స్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు అర్జున్ సాయి మంచి కథాంశం తీసుకున్నా.. అంతే స్థాయిలో ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ, ఆయన రూపొందించిన నాటక మరియు ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కొన్ని పర్వాలేదు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వాస్తవిక చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాత సురేష్ పాటిల్ ను అభినందించాలి. ఆయన నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
తీర్పు:
‘ఉత్సవం’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, ముఖ్యంగా నాటకాల నేపథ్యం తాలూకు డ్రామా బాగున్నాయి. అలాగే, నటీనటుల నటన ఆకట్టుకుంది. కాకపోతే, స్లో నేరేషన్, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ కావడం, అలాగే పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రంలో కొన్ని చోట్ల వచ్చే ఎమోషనల్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team