హీరో సోహైల్‌కు మాతృవియోగం

‘బిగ్ బాస్’ ఫేమ్, హీరో సోహైల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోహైల్ తల్లి గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

కరీంనగర్ ప్రాంతానికి చెందిన సోహైల్‌కు తండ్రి సయ్యద్ సలీం, తల్లి, తమ్ముడు సయ్యద్ నబీల్ ఉన్నారు. సోహైల్ తల్లి ఫైమా సుల్తానా గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. డయాలసిస్ నిమిత్తం మెడికవర్ హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఆమె పరిస్థితి విషమించడంతో కన్ను మూసినట్లుగా తెలుస్తోంది.

దీంతో సోహైల్ శోకసంద్రంలో మునిగిపోయాడు. సోహైల్ తల్లి పార్థివ దేహాన్ని తన స్వస్థలం కరీంనగర్‌కు తరలిస్తున్నారు. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సోహైల్ టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్-4’తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

‘లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు’ వంటి వరుస సినిమాలతో సోహైల్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. సోహైల్ తల్లి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ విచారం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version