నా పేరు ఎందుకు తీస్తున్నారు..? – రకుల్ ప్రీత్ సింగ్


ప్రస్తుతం టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై యావత్ ఇండస్ట్రీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ బాధ్యతగల పదవిలో ఉన్న మహిళా మంత్రి సినిమా వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను రాజకీయాల కోసం వాడటం ఏమిటని పలువురు నెట్టింట విమర్శలు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ట్రోలింగ్ జరుగుతోంది.

ఈ క్రమంలో మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ కామెంట్స్‌పై స్పందించింది. తెలుగు సినిమా పరిశ్రమలోని మహిళలపట్ల రాజకీయ నేతలు చేస్తున్న నిరాధారమైన వ్యాఖ్యలు నిజంగా కలిచివేస్తున్నాయని.. సాటి మహిళా మంత్రి కూడా సినిమా రంగంలోని మహిళలపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా హేయమైన చర్యగా భావిస్తున్నానని ఆమె పేర్కొంది. సినిమా రంగానికి చెందిన తాము డిగ్నిటీ మెయింటెయిన్ చేసేందుకు చాలా సైలెంట్‌గా ఉంటామని.. అయితే తమ మౌనాన్ని చేతగానితనంగా భావించొద్దని రకుల్ ఈ సందర్భంగా తెలిపింది.

తనకు ఎలాంటి రాజకీయ పార్టీతో గాని, రాజకీయ నేతలతో కాని సంబంధం లేకున్నా తన పేరును తీసుకొస్తున్నందుకు చాలా బాధగా ఉందని రకుల్ తెలిపింది. తన పేరును రాజకీయాల్లోకి లాగొద్దని ఆమె ఈ సందర్భంగా కోరింది. మీకు నచ్చిన కథను సినిమా వారిపై రుద్ది ప్రజల్లోకి అసత్య ప్రచారాలను తీసుకెళ్లొద్దని రకుల్ ఈ సందర్భంగా తన ఎక్స్ వేదికలో పోస్ట్ చేసింది.

Exit mobile version