రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం “తల్లి మనసు”. వి.శ్రీనివాస్(సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు.
ఇటీవల తొలికాపీ సిద్దమైన ఈ చిత్రం, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని నిర్మాత ముత్యాల అనంత కిషోర్ తెలిపారు. “ఈ చిత్రాన్ని చుసిన సెన్సార్ సభ్యులు చాలా బావుందని, తల్లికి సంబంధించిన ఓ మంచి సబ్జెక్టుతో ఇటీవల కాలంలో ఇలాంటి చిత్రం రాలేదని ప్రశంసించడం ఆనందంగా ఉంది. డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. నైజాంలో ఈ చిత్రాన్ని ఏషియన్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తాం” అని నిర్మాత తెలిపారు.
చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ.. “తల్లి సబ్జెక్టుతో ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని మేము ఏదైతే ఆశించి, మా సొంత బ్యానర్లో ఈ చిత్రాన్ని తీశామో అది నెరవేరింది. ఒక మంచి సబ్జెక్టుతో మా అబ్బాయి నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ కావడం సంతోషదాయకం”. అని అన్నారు.
దర్శకుడు వి.శ్రీనివాస్(సిప్పీ) మాట్లాడుతూ.. “గతంలో తల్లి సబ్జెక్టుతో ఎన్నో సినిమాలు వచ్చి ఉండవచ్చు. కానీ, ఓ మధ్య తరగతి తల్లి ఎలాంటి సంఘర్షణలకు గురయ్యిందన్న అంశాన్ని ప్రేక్షకులకు హత్తుకునేలా వైవిధ్యంగా చెప్పాం. తెరపై ఎక్కడా ఆర్టిస్టులు కనిపించరు. ఆద్యంతం పాత్రలు మాత్రమే కనిపించి, ప్రేక్షకుడు కథలో లీనమవుతాడు” అని అన్నారు.