రజినీ బ్యాక్ టు వర్క్.. కానీ..!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ మూవీ ‘వేట్టయన్’ బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేదనే చెప్పాలి. ఇక ఈ సినిమా తరువాత రజినీ అనారోగ్యం కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ చిత్రంలో రజినీకాంత్ నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ రజినీ అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఓ సర్జరీ కారణంగా రజినీకాంత్ షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆయన తిరిగి షూటింగ్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆయన ఇప్పుడు షూట్ చేయబోయేది కూలీ సినిమా కాదని తెలుస్తోంది. దర్శకుడు నెల్సన్ డైరెక్షన్‌లో బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’కి సీక్వెల్‌గా రాబోతున్న ‘జైలర్-2’ చిత్ర టీజర్ కోసం రజినీ షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ మొదటి వారంలో రజినీకాంత్ ఈ టీజర్ షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా ఈ టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక కూలీ చిత్ర షూటింగ్‌లో కూడా రజినీకాంత్ త్వరలోనే జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version