తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ది సంస్థ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూర్ దిల్ రాజు(వెంటకరమణ రెడ్డి) బుధవారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈమేకు ఎఫ్‌డీసి కార్యాలయంలో బుధవారం ఉదయం ఆయన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్‌గా తనకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు తాను నిత్యం శ్రమిస్తానని.. దీనికి అందరి సహకారం అవసరం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

తెలుగు సినీ పరిశ్రమకు మద్రాస్ నుంచి వచ్చిన తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. TFDC చైర్మన్‌గా తనపై చాలా బాధ్యత ఉందని.. ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Exit mobile version