విడుదల తేదీ : మార్చి 07, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : తారుక్ రైనా, సాహిల్ మెహతా, భవ్షీల్ సింగ్ సాహ్ని, నికితా దత్తా తదితరులు
దర్శకుడు : రామ్ మధ్వాని
నిర్మాతలు: అమిత మధ్వాని, రామ్ మధ్వాని
సంగీతం : సమీర్ ఉద్దిన్
సినిమాటోగ్రఫీ : కావ్య శర్మ, ధవళిక సింగ్
ఎడిటర్ :అభిమన్యు చౌదరి, అమిత్ కరియా
సంబంధిత లింక్స్ : ట్రైలర్
భారత దేశ స్వాత్యంత్రానికి ముందు జరిగిన జలియన్‌వాలా బాగ్ దురంతం ఎలాంటి కారణాలతో చోటు చేసుకుంది.. అసలు ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏమిటి.. దాని వెనకాల ఎవరు ఉన్నారు.. ఆ సమయంలో భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.. అనే అంశాలతో తెరకెక్కిన ‘ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్’ వెబ్ సిరీస్ మార్చి 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్‌లని అమృత్సర్ జలియన్‌వాలా బాగ్‌లో నిరాయుధులైన భారతీయులపై బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ జనరల్ డైయర్ కాల్పులకు ఆదేశిస్తాడు. ఈ ఘటనలో 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇక ఈ దురంతం తో దాదాపు 400 మంది భారతీయులు మృతి చెందారు. దీంతో లండన్‌లో చదువుకున్న కాంతిలాల్ సహ్ని(తారుక్ రైనా) ఈ ఉదంతంపై హంటర్ కమిషన్ ఎంక్వైరీలో వాదిస్తాడు. ఈ ఘటనలో అతను తన స్నేహితులైన హరి సింగ్(భవ్షీల్ సింగ్), అల్లాభక్ష్(సాహిల్ మెహతా)లను కోల్పోతాడు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు కాంతిలాల్ చేసే వాగ్వివాదం ఎలా ఉంటుంది.. అతడు ఏయే అంశాలను కమిషన్ ముందు వివరిస్తాడు.. చివరకు అతనికి ఎలాంటి న్యాయం జరిగిందనేది ఈ వెబ్ సిరీస్ కథ.
ప్లస్ పాయింట్స్ :
1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ దురంతం గురించి దర్శకుడు రామ్ మధ్వాని చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. అయితే, ఈ ఘటనకు ముందుకు భారత్‌లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేవి చక్కగా ప్రెజెంట్ చేశారు. ఇక బ్రిటిష్ పాలనలో ఎలాంటి అకృత్యాలు జరిగాయి.. వాటి వల్ల భారతీయులు ఎలాంటి కష్టాలు పడ్డారనే అంశాలను మనకు ఇందులో మరోసారి చూపే ప్రయత్నం చేశారు.
దర్శకుడు రామ్ మధ్వాని తీసుకున్న పాయింట్ బాగుంది. ఆయన చెప్పాలనుకున్న విషయానికి ముందు ఎలాంటి పరిస్థితులు, ఘటనలు చోటు చేసుకున్నాయనేవి సమాంతరంగా వివరించిన తీరు బాగుంది. నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా తారుక్ రైనా లాయర్ పాత్రలో చక్కటి ప్రతిభను కనబరిచారు.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి హిస్టారికల్ డ్రామాను ప్రెజెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కథనం విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడాలి. కానీ ఈ విషయంలో చిత్ర యూనిట్ తడబడింది. జలియన్‌వాలా బాగ్ దురంతం ఇప్పటికే చాలా సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో చూపెట్టారు. దానికి సంబంధించిన సీన్స్ చాలా లెంగ్తీగా సాగదీయడం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా లోపాలు కనిపిస్తాయి.
ఇక ఈ ఉదంతం జరిగే ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూపెట్టాలనుకోవడం బాగుంది. కానీ, పదే పదే ఇలాంటి సీన్స్ రిపీట్ కావడం.. కథ తిరిగి తిరిగి ఒకే పాయింట్ దగ్గరకు రావడం చాలా బోరింగ్‌గా ఉంది. ఇలాంటి డ్రామాలో కొందరైనా గుర్తుపట్టే ఆర్టిస్టులు ఉంటే బాగుండేది.
ఇలాంటి కాన్సెప్ట్‌లో పాటలకు పెద్దగా స్కోప్ ఉండదు. కానీ, ఇందులో తారుక్ రైనా తానే స్వయంగా పాడిన పాటలను పెట్టడం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. బ్రిటిష్ ఆఫీసర్ పాత్రల్లో నటించిన వారు కూడా కొందరు విసిగిస్తారు. కథ చాలా స్లోగా సాగడంతో ప్రేక్షకులు ఎక్కువగా స్కిప్ చేస్తూ ఈ వెబ్ సిరీస్‌ను చూస్తారు.
సాంకేతిక వర్గం :
దర్శకుడు రామ్ మధ్వాని ఎంచుకున్న పాయింట్ మంచిదే. కానీ, దాన్ని ప్రెజెంట్ చేసే విధానం ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. కథలోని చాలా సీన్స్ తిరిగి ఒకే పాయింట్ దగ్గరకు రావడం.. బోరింగ్‌గా ఉంటుంది. స్క్రీన్‌ప్లే పై మరింత ఫోకస్ పెట్టాల్సిందిగా కనిపిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్‌లో చాలా లెంగ్తీ సీన్స్ కూడా ప్రేక్షకులను విసిగిస్తాయి. సినిమాటోగ్రఫీ వర్క్ ఈ వెబ్ సిరీస్‌కు కలిసొచ్చే అంశం అని చెప్పాలి. చాలా సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేశారు. ఇక ఎడిటింగ్ వర్క్ చాలా చేయాల్సి ఉంది. చాలా సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉంటే, ఈ కథ మరింత ఎంగేజింగ్గ ఉండేది. మ్యూజిక్ విషయంలో బీజీఎం వరకు ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్’ వెబ్ సిరీస్‌ను మేకర్స్ ఓ హిస్టారికల్ డ్రామాగా ప్రెజెంట్ చేయాలని ప్రయత్నించారు. కానీ, ఇందులోని స్క్రీన్‌ప్లే మొదలుకొని నెరేషన్, రిపీటెడ్ సీక్వెన్స్‌లు, సంగీతం తదితర అంశాలు ప్రేక్షకులను డిజప్పాయింట్ చేస్తాయి. నటీనటులు తమ పర్ఫార్మెన్స్తో మెప్పించే ప్రయత్నం చేసినా ప్రేక్షకులకు ఈ వెబ్ సిరీస్ పెద్దగా నచ్చకపోవచ్చు. ఎంగేజింగ్ అంశాలున్న హిస్టారికల్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ వెబ్ సిరీస్‌ను స్కిప్ చేయవచ్చు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team