సమీక్ష : సాహసం – సూపర్బ్ అడ్వెంచరస్ మూవీ

విడుదల తేదీ : 12 జూలై 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకుడు : చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత : బివిఎస్ఎన్ ప్ర్రసాద్
సంగీతం : శ్రీ
నటీనటులు : గోపీచంద్, తాప్సీ..


టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని మరోసారి విభిన్న చిత్రాల డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటితో కలిసి చేసిన అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సాహసం’. కొంతవరకూ పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ సినిమాలో సొట్టబుగ్గల సుందరి తాప్సీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకి ఓ ప్రత్యేక అనుభూతికి లోను చేస్తుందని అంటున్నారు. ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఈ సినిమాని మేము ప్రత్యేకంగా తిలకించడం వల్ల అందరికంటే ముందే ఈ సినిమా రివ్యూని మీకందిస్తున్నాం. చంద్రశేఖర్ యేలేటి మేజిక్, గోపీచంద్ సాహసాలు, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులని ఎంతవరకూ ఆకట్టుకున్నాయో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీలో గౌతమ్(గోపీచంద్) ఓ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. చాలా వేగంగా ధనవంతుడు అయిపోవాలనేది అతని లక్ష్యం. దాంతో అతని లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బాబాలను కలిసి జాతకాలు చూపించుకుంటూ, లాటరీ టికెట్స్ కొంటూ ఉంటాడు. కానీ అతని లక్, లాటరీ టికెట్ల ఫలితాలు అతన్ని బాగా నిరుత్సాహపరుస్తుంటాయి. అప్పుడే అతనికి ఓ కొత్త దారి దొరుకుతుంది. గౌతమ్ కి తన తాత గారైన వర్మ(సుమన్) భారత్ – పాకిస్థాన్ విడిపోకముందు పెషవర్ లో వజ్రాల బిజినెస్ ఉంటుంది. వర్మ అప్పట్లో తన వారసుల కోసం అని వజ్రాలను ఓ చోట దాచి పెట్టి ఉంటారు. అది తెలిసిన గౌతమ్ ఎలాగైనా వాటిని సంపాదించాలనుకుంటాడు. అనుకోకుండా ఆ వజ్రాల నిధి పాకిస్థాన్ లో ఉంటుంది, అది కూడా లెజండ్రీ హింగ్లాజ్ దేవి టెంపుల్ కి ముడిపడి ఉంటుంది.

తన తాత గారి వీలునామా, ఆయన తయారు చేసిన కొన్ని వస్తువులతో తన నిధిని ఎలాగైనా దక్కించుకోవాలని పాకిస్థాన్ బయలుదేరుతాడు. అందుకోసం హిందూ మతానికి, దేవాలయాలకు ప్రాధాన్యత నిచ్చే శ్రీనిధి(తాప్సీ) సాయం తీసుకుంటాడు. కానీ గౌతమ్ అనుకున్న జర్నీ అంత సులభం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌతమ్ కి ఆ ప్రోపర్టీ పాకిస్థాన్ టెర్రరిస్ట్ అయిన సుల్తాన్(శక్తి కపూర్) చేతిలో ఉంటుంది. వారందరినీ ఎదిరించి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? లేదా? అనే అడ్వెంచరస్ డ్రామాని తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

గోపీచంద్ గౌతమ్ పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోయాడు. గోపీచంద్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు సూపర్బ్, అలాగే గౌతమ్ పాత్రకి అతని బాడీ లాంగ్వేజ్ అచ్చుగుద్దినట్టు సరిపోయింది. తాప్సీ చూడటానికి బాగుంది, అలాగే భక్తి శ్రద్దలు కలిగిన యువతి పాత్రలో బాగా నటించింది. ఖయామత్ రాజుగా అలీ కొన్ని నవ్వులు పూయించాడు. క్రూరమైన టెర్రరిస్ట్ పాత్రలో శక్తి కపూర్ నటన సింప్లీ సూపర్బ్. అతని కాస్ట్యూమ్స్ మరియు పెర్ఫార్మన్స్ నమ్మశక్యంగా ఉంది. గోపీచంద్ కి తండ్రి పాత్రలో నారాయణ మూర్తి ఓకే అనిపించారు, సుమన్ ది చిన్న పాత్రే అయినప్పటికీ పాత్రకి తగ్గట్టు చేసారు.

ఈ సినిమా థీమ్, స్టొరీ తెలుగు సినిమాకి కొత్తగా ఉంటుంది. చంద్రశేఖర్ యేలేటి అనుకున్న కాన్సెప్ట్ ని చాలా పర్ఫెక్ట్ గా హండిల్ చేసారు. సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి, అలాగే లడఖ్ ని చాలా అద్భుతంగా చూపించారు. అలాగే అక్కడ పాకిస్థానీ వాతావరణాన్ని క్రియేట్ చేసి చూపించడంలో ఈ చిత్ర టీం సక్సెస్ అయ్యారు. ఈ గుప్త నిధిని చేరుకోవడానికి లభించే ఆధారాలు మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. నేషనల్ ట్రెషర్ హంట్, టాంబ్ రైడర్, ఇండియానా జోన్స్ లాంటి సినిమాలను ఎంజాయ్ చేసేవారు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు.

ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఫైట్స్ ని వాస్తవానికి దగ్గరగా ఆకట్టుకునే విధంగా తీసారు. ముఖ్యంగా గన్ ఫైట్స్ మరియు కార్ చేజ్ సీక్వెన్స్ లు బాగున్నాయి. ఇంటర్వల్ బ్లాక్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ని చాలా బాగా షూట్ చేసారు.

మైనస్ పాయింట్స్ :

సినిమా పరంగా ఇది వీలవుతుందా అనే కొన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. ఉదాహరణకి.. ఒక హైదరాబాద్ సెక్యూరిటీ గార్డ్ తనకి శిక్ష పడుతుందని కూడా ఆలోచించకుండా పాకిస్థానీ టెర్రరిస్టులతో పోరాడడం లాంటివి. సినిమాలో కొన్ని చోట్ల ఎమోషన్ అనేది కాస్త పడి పడి లేస్తూ ఉంటుంది. అలీ కామెడీ ట్రాక్ ఇంకాస్త బాగుండాల్సింది. ఈ సినిమాలో కామెడీ, గ్లామర్ మిస్ అవడంతో ఈ సినిమా బి, సి సెంటర్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే చాన్స్ కాస్త తక్కువగా ఉంది. బుజ్కషి ఎపిసోడ్ మీద అంచనాలను పెంచేశారు అది అనుకున్నంత స్థాయిలో లేదు.

సాంకేతిక విభాగం :

శ్యాం దత్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ హైలైట్. ఆయన పనితనం ఆడియన్స్ కో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. రామకృష్ణ వేసిన సెట్స్ అద్భుతంగా ఉన్నాయి. శ్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎడిటింగ్ చాలా నీట్ గా ఉంది.

ఒక అడ్వెంచర్ సినిమాని ప్రేక్షకులకి అందించడంలో చంద్రశేఖర్ యేలేటి సక్సెస్ అయ్యారు. అతనికి ఇచ్చిన బడ్జెట్ లో సినిమాని చాలా సోప్పర్బ్ గా తెరకెక్కించాడు. కానీ ఆయన సినిమాలో కాస్త ఎంటర్టైన్మెంట్ మీదా కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

తీర్పు :

”సాహసం” యావరేజ్ గా అనిపించే తెలుగు సినిమా అయితే కాదు. ఈ సినిమా ప్లాట్, సెట్టింగ్స్, అలాగే టేకింగ్ ఒక ఫ్రెష్ నవల లాంటి ఫీల్ ని కలిగిస్తుంది. బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ, మంచి యాక్షన్ సీక్వెన్స్ లు మరియు కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకి హైలైట్. మరోవైపు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల బి,సి సెంటర్స్ లో కాస్త ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. మన దేశంలో తీసిన కొన్ని’ ఇండియానా జోన్స్’ మొమెంట్స్ కోసం ఈ సినిమాని చూడొచ్చు. చివరిగా ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా హ్యాపీగా ఈ సినిమాని చూడొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

రివ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLCIK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version