సమీక్ష : మేడ్ ఇన్ వైజాగ్ – సాగదీసిన సింపుల్ స్టొరీ లైన్

విడుదల తేదీ : 20 జూలై 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు :కణ్మణి
నిర్మాత : ఉదయ్ శంకర్ ఆకెళ్ళ 
సంగీతం : అవినాష్-విశ్వజిత్
నటీనటులు :యశ్విన్, నిఖితా నారాయణ్ తదితరులు 


అప్పట్లో వడ్డే నవీన్ తో ‘నా ఊపిరి’, సుమంత్ తో ‘చిన్నోడు’ వంటి సినిమాలను తీసిన కణ్మణి కాస్త విరామం తరువాత యశ్విన్ అనే కొత్త నటుడ్ని హీరోగా పరిచయం చేస్తూ, ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ సినిమాలో నటించిన నిఖితా నారాయణ్ హీరోయిన్ గా ‘మేడ్ ఇన్ వైజాగ్’ అనే లో బడ్జెట్ సినిమాను తీసాడు. ఈ సినిమా మరాఠీలో విజయం సాధించిన ‘ముంబై- పూణే- ముంబై’ సినిమాకు రీమేక్. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించగలదో లేదో చూద్దామా..

కధ:

తనకు ఇష్టంలేకపోయినా వాళ్ళ అమ్మ బలవంతంమేరకు ఒక పెళ్ళికొడుకును కలవడానికి నిఖితా నారాయణ్ హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్తుంది. కొన్ని అవాంతరాల వల్ల ఆ పెళ్ళికొడుకుని కలవలేక కొత్త ప్రదేశంలో ఇమడలేకపోతున్న ఆమెకు అదే ఊర్లో ఆ ఊరంటే చాలా ఇష్టమైన యశ్విన్ పరిచయమవుతాడు. వీరిద్దరూ ఒక రోజంతా కలిసి గడిపిన వీరిద్దరి మధ్య ఎటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి?? ఆఖరికి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా? ఇంతకీ హీరోయిన్ కలుద్దామనుకున్న పెళ్లి కొడుకు ఎవరు?? అతనితో ఈ స్టొరీకు వున్న సంబంధం ఏమిటి?? అనేది తెరపై చూడాలి

ప్లస్ పాయింట్స్:

తెలుగు సినిమాని అందమైన ప్రదేశాలలో తియ్యాలంటే ఇండియాను వదిలి ఎక్కడికో విదేశాలకు వెళ్లిపోతుంటారు. అటువంటి వారికి ఇండియా కాదు కదా కనీసం ఆంధ్రా కుడా వదిలివెళ్ళనవసరంలేదని తెలిపడానికి ఇక్కడ వైజాగ్ లోనే అద్భుతమైన లోకేషన్లలో సినిమాను తీసారు. కైలాసగిరి, డాల్ఫిన్ నోస్, ఆర్.కె బీచ్ లను కెమెరా కళ్ళలో అందంగా బంధించారు. హీరోగా నటించిన యశ్విన్ పర్వాలేదనిపించాడు. ఒడ్డు పొడుగు బాగానే ఉన్న ఈ హీరోకు ఒక యాంగిల్ లో హీరో రామ్ షేడ్స్ కొన్ని వున్నాయి. కామెడి సీన్ల వరకూ బాగానే నటించినా సెంటిమెంట్, యాక్షన్ సీన్ల దగ్గర కాస్త మెరుగుపరుచుకోవాలి. నిఖితా నారాయణ్ పాత్ర మేరకు బాగానే నటించింది.

బ్యాక్ గ్రౌండ్ లో రిపీట్ అయ్యే సాంగ్ బాగుంది. కథకు అవసరం లేవు గనుక ఫైట్లు, అక్కర్లేని పాటలు పెట్టడానికి దర్శకుడు నానా పాట్లూ పడలేదు. సో, మూస ధోరణి నుండి బయటకొచ్చినందుకు దర్శకుడిని మెచ్చుకోవాలి.

మైనస్ పాయింట్స్:

సినిమా స్టొరీ లైన్ చాలా చిన్నది. మొదట్నుంచి దాచి పెట్టిన ట్విస్ట్ చాలా మంది ముందే ఊహించగలరు. ఇటువంటి స్టొరీ ట్రాక్ ను ‘మగధీర’, రామ్ నటించిన ‘గణేష్’ సినిమాలలో చిన్న చిన్న ట్రాకులుగా వాడుకున్నవే. ఒకవేళ ట్విస్ట్ ను ఊహించినా మన ఊహకందని స్థాయిలో పతాక సన్నివేశాలను తీసివుంటే ఆ ఫీల్ లో పడి దీని గురించి మరిచిపోయేవారు. కానీ క్లైమాక్స్ సీన్ లను పేలవంగా తియ్యడంతో ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురవుతారు. సినిమా అంతా రెండు పాత్రల మధ్యే జరుగుతుండడంతో మొదట్లో ఉన్న ఫ్రెష్ నెస్ రానురానూ చిరాకుగా మారిపోతుంది. సినిమాను సాగదీయడానికి హీరోకు, హీరోయిన్ లకు విడివిడిగా ఒక లవ్ స్టొరీను చెప్పుకోచ్చాడే గానీ వాటితో స్టొరీకు ఎటువంటి సంబంధం వుండదు.

వేణు మాధవ్, దువ్వాసి లపై చిత్రీకరించిన కామెడి సీన్లు మనల్ని నవ్వించకపోగా మన సహనాన్ని పరీక్షిస్తాయి. ఇటువంటి సినిమాలలో కీలక పాత్ర పోషించవలిసిన సంభాషణలు చాలా చప్పగా వున్నాయి. హీరో, హీరోయిన్లు ఒకరిఫై ఒకరు జోకులు వేసుకుని వారు నవ్వుకోవడమే తప్ప ఒక్కసారి కూడా ప్రేక్షకులని నవ్వించలేకపోయారు. మాస్ ప్రేక్షకులను మెప్పించే ఏ ఒక్క అంశం ఈ సినిమాలో లేకపోవడం మరో పెద్ద మైనస్.

సాంకేతిక విభాగం:

దర్శకుడు కణ్మణి అనుకున్న కథను తెరకెక్కించగలిగాడు కానీ ప్రేక్షకులకు ఫీల్ ను క్యారీ చెయ్యడంలో తడబడ్డాడు. సినిమాటోగ్రాఫర్ మల్లికార్జున తన పరిధిమేరకు లోకేషన్లను తెరపై అందంగా చూపించాడు. అవినాష్ – విశ్వజిత్ లు అందించిన సంగీతం స్థాయికి తగ్గట్టు లేదు. సినిమా అంతా ఒకే రోజు నిడివిలో జరుగుతుంది కాబట్టి నిర్మాతకు కాస్ట్యూమ్స్ ఖర్చు తగ్గించారు. అయినప్పటికీ ఉదయ్ శంకర్ అందించిన నిర్మాణవిలువలు పర్వాలేదనిపించాయి. ఎడిటర్ కత్తెరకు ఇంకా చాలా చోట్ల పనిచెప్పివుంటే బాగుండేది.

తీర్పు:

చిన్న సినిమాలు, యూత్ సినిమాలు అంటే బూతును ఆశ్రయిస్తున్న ఈ రోజుల్లో ఒక చిన్న ఫీల్ గుడ్ స్టొరీలైన్ ను బేస్ చేసుకుని దర్శకుడు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినదే కానీ కామెడీ సంభాషణలలో పస లేకపోవడం, టేకింగ్ లో కాస్త నస తోడవ్వడంతో ఆ ఫీల్ ను మనకు అందించలేకపోయారు. మాస్ ను మెప్పించే అంశాలు ఏమి లేవుగనుక ఈ సినిమా షార్ట్ ఫిలింకు ఫీచర్ ఫిలింకు మధ్యన ఉండిపోతుంది. వైజాగందాల్ని చూడాలనుకున్న వారు ఒకసారి వెళ్ళచ్చు. లేదంటే ఈ సినిమాను మీ లిస్టు నుండి పాస్ చేసేయచ్చు

123తెలుగు రేటింగ్ – 2/5
రివ్యూ : వంశీ కృష్ణ

Exit mobile version