ప్రత్యేక ఇంటర్వ్యూ : రేష్మ – నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని.!

Reshma
‘మొగలి రేకులు’ సీరియల్ ద్వారా బుల్లి తెరకి పరిచయమై ఆ తర్వాత ‘ఈ రోజుల్లో’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి రేష్మ. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న రేష్మ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆమెతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. ఎంతో ఫ్రీగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఆమె తనకి టాలీవుడ్ పట్ల ఉన్న మక్కువని, తన రాబోయే సినిమాల గురించి అలాగే తనకి ఇష్టమైన వాటి గురించి మాతో పంచుకుంది.. ఆ విశేషాలు మీ కోసం…

ప్రశ్న) ముందుగా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. అలాగే దీపావళి శుభాకాంక్షలు. ఈ రెండు ఒకేసారి రావడం మీకెలా అనిపిస్తోంది?

స) నాకు బాగా ఇష్టమైన పండుగ అంటే దీపావళి. అలాంటి దీపావళి రోజున నా పుట్టిన రోజు కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి నా చిన్నప్పుడు 5/6 వ క్లాస్ చదివేటప్పుడు ఇలా రెండూ ఒకేసారి వచ్చాయి. ఈ రోజు ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. మాములుగా నవంబర్ 17 మా తమ్ముడి బర్త్ డే, కానీ వాడి బర్త్ డే ని కూడా నా బర్త్ డే రోజే సెలబ్రేట్ చేస్తారు. దాంతో ఈ రోజు ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నాను.

ప్రశ్న)వెరీ గుడ్.. అసలు మీకు సినిమాల్లోకి రావాలని ఎందుకనిపించింది? మొదటి అవకాశం ఎలా వచ్చింది?

స) నాకు చిన్ననాటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఆసక్తితో కొన్ని కమర్షియల్ ప్రకటనలు చేసాను. ఆ తర్వాత మొగలి రేకులు సీరియల్ లో పల్లవి పాత్ర పాత్ర చేసాను. ఆ తర్వాత నాకు మొదట వెంకటేష్ గారు చేసిన ‘బాడీ గార్డ్’ సినిమాలో ఓ పాత్ర చేయడానికి బెల్లంకొండ గారు అవకాశం ఇచ్చారు. అప్పుడే ఈ రోజుల్లో ప్రొడక్షన్ మానేజర్ గారు నా ఫోటోలు చూసి ఆడిషన్స్ కి పిలిచారు. వెళ్ళగానే మారుతి గారు చూసి కొన్ని ఎక్స్ ప్రెషన్ పెట్టమని చెప్పి ఫైనలైజ్ చేసారు. అలా నాకు హీరోయిన్ గా నాకు మొదటి అవకాశం వచ్చింది.

ప్రశ్న) మీ ఫ్యామిలీ గురించి చెప్పండి? అలాగే మీరు హీరోయిన్ గా సినిమాల్లోకి వస్తామంటే వారేమన్నారు?

స) అమ్మ అడ్వకేట్, నాన్న సింగరేణిలో ఆఫీసర్ గా పనిచేస్తారు. ఇద్దరూ చదువుకున్న వాళ్ళే కావడం వల్ల సినిమాల్లోకి వస్తాననగానే వాళ్ళు నన్నేమీ అనలేదు కానీ అమ్మాయికి చదువు చాలా ముఖ్యం. ముందు డిగ్రీ పూర్తి చెయ్యమన్నారు. అలాగే నేను లా లో డిగ్రీ ఫినిష్ చేసాకే హీరోయిన్ అయ్యాను. నాకు అమ్మ, నాన్న నుంచి ఎప్పుడూ ఫుల్ సపోర్ట్ ఉంటుంది.

ప్రశ్న) మొదటి సినిమా తర్వాత మీరందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి?

స) సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటగా దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డా.డి. రామానాయుడు గారు ఫోన్ చేసి చాలా బాగా చేసావ్ అని మెచ్చుకోవడం మరిచిపోలేనిది. అలాగే దాసరి నారాయణ రావు గారు, దిల్ రాజు గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, బెల్లంకొండ సురేష్ గారు ఎంతో మెచ్చుకున్నారు.

ప్రశ్న) మీ మొదటి సినిమాలో మిమ్మల్ని స్క్రీన్ మీద చూసిన వాళ్ళందరూ జూనియర్ త్రిష లాగా ఉన్నారని అన్నారు. దీన్ని మీరెలా తీసుకుంటున్నారు?

స) నేను త్రిష గారితో కలిసి ‘బాడీ గార్డ్’ సినిమాలో నటించాను. త్రిష లాంటి టాలెంట్ హీరోయిన్ తో నన్ను పోల్చడం చాలా ఆనందంగా ఉంది. చెప్పాలంటే ఆ కాంప్లిమెంట్ ని స్పూర్తిగా తీసుకొని ఇంకా ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాను. చెప్పాలంటే పోలికతోనే కాకుండా యాక్టింగ్ లో కూడా రేష్మకి ఓ సెపరేట్ స్టైల్ ఉందని అన్నారు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ..

ప్రశ్న) హీరోయిన్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి పర్సనల్ గా మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమన్నా ఉన్నాయా?

స) నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. చెప్పాలంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను ఒక అమ్మలా చూసుకుంటోంది. మాములుగా తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తుంటాయి. అవి కరెక్ట్ కాదండి. టాలెంట్ ఉన్న వాళ్ళని ఇండస్ట్రీ ఎప్పుడూ గుర్తిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వార్తలు కొన్ని బయట వస్తుండడం వల్ల ఇండస్ట్రీకి రావాలనుకున్న కొంతమంది తెలుగమ్మాయిలు భయపడుతున్నారు. ఎందుకు నేను ఇంత నమ్మకంగా చెబుతున్నానంటే టాలెంట్ ఉంటే ఆఫర్స్ వస్తాయని చెప్పడానికి నేనే ఉదాహరణ. మొదటి సినిమా సక్సెస్ వచ్చినప్పుడు గానీ, ఆ తర్వాత ఫ్లాప్ వచ్చినప్పుడు గానీ నేను తమిళ్, కన్నడ అంటూ ఇతర భాషల్లో అవకాశాలు వెతుక్కోలేదు. నేను ఇక్కడే సినిమాలు చేస్తున్నాను. నాకు తెలుగులో సినిమాలు చేయడమంటే ఇష్టం. అలాగే చివరిగా ఒకటి మన ఇండస్ట్రీ గురించి మనమే ఎప్పుడూ చెడుగా చెప్పకూడదు..

ప్రశ్న) తమిళ్, కన్నడ లేదా ఇతర భాషల వైపు ఆసక్తి చూపడం లేదంటున్నారు. ఒకవేళ అక్కడి నుంచి అవకాశాలు వస్తే సినిమాలు చెయ్యరా?

స) నా మొదటి సినిమా ‘ఈ రోజుల్లో’ హిట్ అయ్యాక తమిళ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. కానీ ప్రస్తుతం నా దృష్టి అంతా తెలుగు సినిమా పైనే ఉంది. చెప్పాలంటే వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ గుర్తింపు తెచ్చుకోవడం వేరు, ఇక్కడి వారు కష్టపడి ఇక్కడే గుర్తింపు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు నా టాలెంట్ గుర్తించారు కాబట్టే నాకు అవకాశాలు వస్తున్నాయి. మన ఇండస్ట్రీలోని వారు ఇస్తున్న గౌరవం, గుర్తింపు మరియు వారి సపోర్ట్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. వేరే భాషల్లో పెర్ఫార్మన్స్ కి ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే నేను చేస్తాను. కానీ నా ఫస్ట్ ఛాయస్ మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే..

ప్రశ్న) మీరు ప్రస్తుతం చేస్తున్న సినిమాలేమిటి?

స) ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ్ గారి డైరెక్షన్ లో చార్మీ గారు ప్రధాన పాత్ర చేస్తున్న ‘ప్రతి ఘటన’ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నాది కూడా ఓ కీలకమైన పాత్ర. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకి చాలా భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న) ఇప్పటి వరకూ ఎక్కువగా లవ్ ఎంటర్టైనర్స్ లోనే నటించారు. ఇప్పుడు భిన్నంగా ఉండబోతుంది అంటున్నారు. ఈ సినిమాలో మీ పాత్ర గురించి, అలాగే సినిమా గురించి ఏమన్నా చెప్తారా?

స) ‘ప్రతి ఘటన’ సినిమా ఎంటర్టైన్మెంట్ కిందకి రాదు. ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ప్రస్తుతం సొసైటీలో అమ్మాయిల మీద అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విషయంలో పబ్లిక్ ఎలా రియాక్ట్ అవ్వాలి అనేదాన్ని ఈ సినిమాలో చూపించనున్నాం. అలాగే రాజకీయాల మీద సెటైర్స్ కూడా ఉంటాయి. అలాగే నాకు చాలా రోజుల నుంచి లంగా ఓని స్టైల్ సినిమాలో చేయాలని ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాలో లంగా ఓని కట్టుకొని అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను.

ప్రశ్న) ‘ప్రతి ఘటన’ సినిమాలో అసలు ఆఫర్ ఎలా వచ్చింది?

స) ‘లవ్ సైకిల్’ సినిమాలో నేను తమ్మా రెడ్డి భరద్వాజ్ గారితో కలిసి నటించాను. అప్పటి నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. ఆయన సీనియర్ డైరెక్టర్ కూడా, నన్ను పిలిచి ఈ సినిమాలో ఒక పాత్ర చెయ్యాలి అని అడగ్గానే వెంటనే ఒప్పేసుకున్నాను.

ప్రశ్న) హీరోయిన్ గా మీకు అవకాశాలు వస్తున్నప్పుడు, మరి ఎందుకు ఈ సినిమాలో సపోర్ట్ రోల్ చేస్తున్నారు? ముందు కూడా ఇలాంటి అవకాశాలు వస్తే చేస్తారా?

స) మీలానే ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత చాలా మంది హీరోయిన్ గా అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటి సపోర్ట్ రోల్ చేస్తున్నావని అడిగారు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. ఇది వరకు చెప్పినట్టు ఇది అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాల కాన్సెప్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు. ఇలాంటి విషయాలు నేను విన్నప్పుడు కంటతడి పెట్టుకుంటాను. ఈ విషయంలో నా వంతు నేను ఏదన్నా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేస్తున్నాను. అలాగే ముందు ముందు హీరోయిన్ గానే సినిమాలు చేస్తాను. ఒకవేళ ‘ప్రతి ఘటన’ సినిమాలో లా పెర్ఫార్మన్స్ కి ప్రాధాన్యం ఉన్న పాత్ర వస్తే సపోర్ట్ రోల్స్ చేస్తాను.

ప్రశ్న) మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్, లేదా మీరు కచ్చితంగా పనిచేయాలనుకునే డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారా?

స) నాకు కృష్ణ వంశీ గారు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు ఏదీ మిస్ కాకుండా చూసాను. ఆయన ప్రతి సినిమా నా బ్రెయిన్ లో రిజిష్టర్ అయిపోయాయి. అలాగే హీరోయిన్స్ కూడా చాలా అందంగా చూపిస్తారు. ఎప్పటికైనా ఆయనతో వర్క్ చేసే చాన్స్ రావాలని దేవున్ని కోరుకుంటున్నాను(నవ్వులు). అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారంటే కూడా ఇష్టం.

ప్రశ్న) టాలీవుడ్ లో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు?

స) నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. నేను చేసిన ‘లవ్ సైకిల్’ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానిలా కనిపిస్తాను. ఆ సినిమాలో చాలా సీన్స్ లో ఆయన్ని ఇమిటేట్ చెయ్యాలి. నేను నిజంగా ఆయన అభిమాని అవడం వల్ల ఆయనలానే చేసేసాను(నవ్వులు). పవన్ కళ్యాణ్ గారి తర్వాత మహేష్ బాబు గారంటే ఇష్టం. హీరోల్లో వీరిద్దరంటేనే ఇష్టం.

ప్రశ్న) ఒకవేళ పవన్ కళ్యాణ్ తో పనిచేసే అవకాశం వస్తే ఆ క్షణంలో మీ ఫీలింగ్ ఏంటి?

స) (నవ్వులు).. ఆశకి కూడా ఓ హద్దు ఉండాలి..(మళ్ళీ నవ్వులు). నేను అంత ఆశించడంలేదు. కానీ పవన్ గారికి అభిమానినని గర్వంగా చెప్పుకుంటున్నాను.

ప్రశ్న) మన సీనియర్ హీరోయిన్స్ లో మీరు బాగా స్ఫూర్తిగా తీసుకున్న హీరోయిన్ ఎవరు?

స) నాకు సౌందర్య, విజయశాంతి అంటే చాలా ఇష్టం. సౌందర్య గారి నటన చాలా సహజంగా ఉంటుంది. ఎప్పటికైనా ఆమెని ఒక్కసారన్నా చూడాలి అనుకున్నాను, కానీ దురదృష్టం ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు బాగా ఏడ్చాను. విజయశాంతి గారి ‘ప్రతి ఘటన’ అంటే నాకు చాలా ఇష్టం అలాంటి పాత్ర వస్తే ఎంత కష్టపడి అయినా చాలెంజింగ్ గా తీసుకొని చేస్తాను.

ప్రశ్న) మీకు ఇలాంటి పాత్రలు చెయ్యాలి అనేలా డ్రీం రోల్స్ ఏమన్నా ఉన్నాయా?

స) ఉన్నాయండి. ‘జోదా అక్బర్’ లో ఐశ్వర్య రాయ్ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. నాకు అలాంటి పాత్ర చేయాలని ఉంది. ఆ పాత్రలో హీరోయిన్ లో ఉన్న టాలెంట్ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.

ప్రశ్న) ఇప్పటి వరకూ మీరు చేసిన సినిమాల్లో మీకు మర్చిపోలేని సంఘటనలు ఏమన్నా ఉన్నాయా?

స) చెప్పాలంటే.. ‘బాడీ గార్డ్’ సినిమాలో వెంకటేష్ గారు, అలీ గారు లేడీ గెటప్స్ లో వచ్చి లేడీస్ హాస్టల్ లో ‘పూవాయ్ పువాయ్’ పాటకి డాన్సులు వేసే సీన్ ఒకటి ఉంటుంది. 2011లో నా పుట్టిన రోజు నాడు ఆ సీన్ తీసారు ఆ రోజు నాకు ఏదో అందర్నీ మా ఇంటికి పిలిచి పార్టీ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది. అది మర్చిపోలేని సంఘటన.

ప్రశ్న) సినిమాలు కాకుండా, ఖాళీ టైం లో ఏం చేస్తుంటారు?

స) మేజిస్ట్రేట్ అవ్వాలనేది నా లక్ష్యం. ప్రస్తుతం సినిమాల వల్ల అది చెయ్యలేకపోతున్నాను. కానీ ఖాళీ టైంలో దాని గురించి తెలుసుకుంటూ ఉంటాను. సినిమాల నుంచి రిటైర్ అయ్యాక ఎలాగైనా మేజిస్ట్రేట్ అవుతాను.

ప్రశ్న) ప్రతి ఘటన సినిమా కాకుండా వేరే సినిమాలు ఏమన్నా చేస్తున్నారా?

స) ప్రస్తుతం ఓ సినిమా కథ వింటున్నాను. అది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇంకో రెండు వారాల్లో ఆ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను.

ప్రశ్న) చివరిగా తెలుగు ప్రేక్షకులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?

స) తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక్కడే పుట్టి ఇక్కడే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటున్నాను, అలాగే తమిళ్, కన్నడ, మలయాళం అంటూ వేరే భాషల వైపు వెళ్ళడం లేదంటే దానికి మన తెలుగు ప్రేక్షకులే కారణం. వాళ్ళకి ఎప్పుడూ ఋణపడి ఉంటాను.

అంతటితో ఎంతో ఓపెన్ గా, చక్కగా మాట్లాడిన తెలుగమ్మాయి రేష్మతో మా ఇంటర్వ్యూని ముగించాం. తన కోరికలు అన్ని త్వరలో నెరవేరి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం..

రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

Exit mobile version