గత శనివారం వచ్చిన ‘విల్లా(పిజ్జా 2)’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సంచిత శెట్టి. విల్లా సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న సంచిత శెట్టి సినిమా విజయం సాధించడంతో చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆమెతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) సినిమా హిట్ అయినందుకు శుభాకాంక్షలు. విల్లా సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ముందే ఊహించారా? అసలు విల్లా సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది?
స) థాంక్స్.. మేము ఈ సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ముఖ్యంగా తెలుగులో ప్రేక్షకులు ఇలా రిసీవ్ చేసుకుంటారని అసలు ఊహించలేదు. ఆ విషయంలో టీం మొత్తం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో కూడా నా పాత్రకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది నేను ఊహించలేదు. ‘సూదు కవ్వం’ సినిమా షూటింగ్ ఇంకో నాలుగు రోజుల్లో పూర్తయిపోతుంది అనగా అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తే ఆఫీస్ కి వెళ్లాను. పిజ్జా 2 కోసం ఆడిషన్స్ చెయ్యాలన్నారు. ఆడిషన్స్ కి వెళ్లాను డైరెక్టర్ దీపన్ కి నచ్చడంతో వెంటనే ఓకే చేసేసారు. ఇలా కంటిన్యూగా ఒకే బ్యానర్ లో వరుసగా రెండు సినిమాలు చేయడం ఎంతో లక్కీగా అనిపించింది.
ప్రశ్న) ఈ మూవీ డైరెక్టర్ దీపన్, హీరో అశోక్ సెల్వన్ గురించి చెప్పండి?
స) డైరెక్టర్ కి ఇది తొలి సినిమా. కానీ అన్ని సినిమాలోని అన్ని పాత్రల్ని బాగా డీల్ చేసాడు. బాగా ఇంటెలిజెంట్ పర్సన్. ఇప్పుడు రొమాంటిక్, కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. థ్రిల్లర్ సినిమాలు రావాల్సిన టైంలో దీపన్ ఓ మంచి స్క్రిప్ట్ తో ఈ సినిమాని చేసాడు. ఈ విషయంలో అతన్ని అభినందించాలి.
అశోక్ సెల్వన్ నేను చేసిన ‘సూదు కవ్వం’ సినిమాలో కూడా నటించాడు. విల్లా హీరోగా అతనికి తొలి మూవీ. అశోక్ చాలా కూల్ పర్సన్, అతనితో వర్క్ చెయ్యడం కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓవరాల్ గా అశోక్ మంచి నటుడు.
ప్రశ్న) మీరు కథ విని సినిమాని సెలక్ట్ చేసుకుంటారా లేక ఆఫర్ రాగానే ఓకే చెప్తున్నారా?
స) నేను ఆఫర్ వచ్చింది కదా అని సినిమాకి ఓకే చెప్పడం లేదు. కథ విని నచ్చితేనే సినిమాకి సైన్ చేస్తాను. మీరు చూసుకుంటే నా మొదటి సినిమాకి రెండవ సినిమాకి 8 నెలలు గ్యాప్ ఉంది. అలాగే 3వ సినిమా చెయ్యడానికి మరో 8 నెలలు పట్టింది. దాన్నిబట్టే మీకు నాకు స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా చేస్తున్నానని అర్థం అయ్యుండాలి. వచ్చిన ప్రతి ఆఫర్ ని ఎంచుకొని ఉంటే నాకు అంత గ్యాప్ ఉండేది కాదు.
ప్రశ్న) తెలుగు/తమిళ్ లో మీరు పనిచేయాలనుకుంటున్న హీరోలు, డైరెక్టర్స్ ఎవరన్నా ఉన్నారా? అలాగే మీ డ్రీం రోల్స్ గురించి చెప్పండి.
స) తెలుగులో అయితే రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారితో పనిచెయ్యాలని ఉంది. హీరోల్లో అయితే మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పనిచెయ్యాలి. తమిళ్ లో అయితే సూర్య, విజయ్ లతో నటించాలని ఉంది. వారితో పనిచేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనేది నా డ్రీం. అలాంటి సినిమాలు చేస్తే సినిమా మొత్తం ఫోకస్ నా మీదే ఉంటుంది కాబట్టి హీరోయిన్ కి మంచి గుర్తింపు వస్తుంది. ఎలాంటి కథాంశం అయిన లేడీ ఓరియెంటెడ్ సినిమా అయితే నేను చేయడానికి రెడీ.
ప్రశ్న) కమర్షియల్ సినిమాల్లో ఫుల్ లెంగ్త్ గ్లామర్ రోల్స్ వస్తే చేయడానికి సిద్దమేనా? మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి?
స) సూదు కవ్వం లో మోడ్రన్ పాత్రలోనే కనిపిస్తాను. ప్రస్తుతం గ్లామర్ అంటే మోడ్రన్ గా కనిపించాలి, షాట్స్, టీ షర్ట్స్ లాంటివి వేసుకోవాలి. పాత్ర డిమాండ్ చేస్తే నేను గ్లామరస్ గా కనిపించడానికి సిద్దమే. ప్రస్తుతం మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. కానీ వాటి గురించి ఇప్పుడు నేను చెప్పలేను. అందులో ఒకటి లేదా రెండు తెలుగులోనే ఉండే అవకాశం ఉంది.
ప్రశ్న) మీరు తెలుగు ప్రేక్షకులకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?
స) తెలుగు సినిమా ఆడియన్స్ అంటే నాకు చాలా ఇష్టం. వారందరికీ సినిమా వాళ్ళంటే చాలా ప్రేమ. వాళ్ళకి ఫ్యామిలీ, జాబ్ అంటూ ఎన్ని బాధ్యతలు ఉన్నా వాళ్ళు తమకు ఇష్టమైన హీరో/హీరోయిన్ కోసం కొంత సమయం కేటాయిస్తారు. అందుకే వాళ్ళంటే నాకిష్టం. అలాగే మంచి సినిమాలే చేస్తున్నానని అనుకుంటున్నాను. నా సినిమాలని చూసి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.
అంతటితో సంచిత శెట్టితో మా చిట్ చాట్ ని ముగించాం. త్వరలోనే అతనా కోరికలు నెరవేరాలని కోరుకుందాం..