సమీక్ష : బిస్కెట్ – టేస్ట్ బాలేదు.!

bisket విడుదల తేదీ : 01 డిసెంబర్ 2014
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : అనిల్ గోపిరెడ్డి
నిర్మాత : స్రవంతి – రాజ్
సంగీతం : అనిల్ గోపిరెడ్డి
నటీనటులు : అరవింద్ కృష్ణ, డింపుల్, వెన్నెల కిశోర్..

ఇట్స్ మై లవ్ స్టొరీ, ఋషి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అరవింద్ కృష్ణ హీరోగా, రొమాన్స్, మహేష్ సినిమాలతో పరిచయమైన డింపుల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘బిస్కెట్’. గతంలో వైకుంఠపాళి సినిమాకి దర్శకత్వం వహించిన అనిల్ గోపిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా నూతన సంవత్సర కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ సినిమాలో బిస్కెట్ ఎవరు ఎవరికి వేసారో? ఎవరు వేయించుకున్నారో? ఆ బిస్కెట్ ప్రేక్షకులకు ఎలా అనిపించిందో? ఇప్పుడు చూద్దాం…

కథ :

అశ్విన్ (అరవింద్ కృష్ణ) ఓ కంపెనీలో పనిచేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. అశ్విన్ ప్రమోషన్ కోసం తన బాస్ అజయ్ ఏం చెప్తే అది చేస్తుంటాడు. అశ్విన్ – చిట్టి రాజు(వెన్నెల కిషోర్) మంచి ఫ్రెండ్స్. చిట్టి రాజు పనిచేసే కంపెనీకి ఎండి రఘు. అశ్విన్ దీక్షని(డింపుల్)ని చూసి ప్రేమలో పడతాడు. కట్ చేస్తే ఇద్దరికీ లవ్, కట్ చేస్తే బ్రేక్ అప్. అదే తరుణంలో ఓ రోజు అశ్విన్ – చిట్టి రాజు బాగా తాగి వాళ్ళ ఎండీలు అయిన అజయ్, రఘులని చంపాలనుకుంటారు. కానీ అనుమానాస్పదంగా రఘు చనిపోతాడు. ఆ కేసు అశ్విన్- చిట్టి రాజుల మీదకి వస్తుంది. ఆ కేసు నుండి అశ్విన్ – చిట్టి రాజులు ఎలా తప్పించుకున్నారు? అసలు రఘుని ఎవరు హత్య చేసారు? అలాగే విడిపోయిన అశ్విన్ – దీక్ష చివరికి కలుసుకున్నారా? లేదా? అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే తాగుబోతు రమేష్ పాత్ర. అతని పాత్ర సెకండాఫ్ లో వచ్చినప్పటికీ ప్రేక్షకులని బాగా నవ్విస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ కి తాగుబోతు రమేష్ ప్రాణం పోశాడని చెప్పాలి. డింపుల్ చూడటానికి బ్యూటిఫుల్ గా ఉంది, నటన కూడా పాత్రకి తగ్గట్టు ఉంది. అలాగే కొన్ని చోట్ల గ్లామరస్ గా కనిపించి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అరవింద్ కృష్ణ నటన బాగుంది, అలాగే స్టైలిష్ గా ఉన్నాడు. అజయ్ నటన కూడా బాగుంది. సినిమా మొదటి 20 నిమిషాలు చాలా వేగంగా సాగుతుంది.

మైనస్ పాయింట్స్ :

పైన చెప్పినట్టు సినిమా మొదలు కావడం కథలోకి వెళ్ళడం, పాత్రల పరిచయాలు ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోతాయి. కానీ 20 నిమిషాల తర్వాత నుంచి పెద్దగా ముందుకు కదలదు. అక్కడి నుంచి దాదాపు క్లైమాక్స్ వరకు బాగా స్లోగా, బోరింగ్ గా సాగుతుంది. వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్ ని దాదాపు సినిమా అంతా ఉన్నప్పటికీ ఒకటో రెండో సీన్స్ లో తప్ప పెద్దగా ప్రేక్షకులను నవ్వించలేకపోయాడు. అలాగే డాన్ షాడో పాత్రలో అలీ, డైరెక్టర్ గా ఎంఎస్ నారాయణ ఉన్నప్పటికీ ప్రేక్షకులను నవ్వించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు.

క్లైమాక్స్ ఎపిసోడ్ లో తాగుబోతు రమేష్ కనిపించినప్పుడల్లా నవ్విస్తున్నప్పటికీ ఆ ఎపిసోడ్ మాత్రం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి డబ్బింగ్ సింక్ సరిగా కుదరలేదు. చాలా చోట్ల వాయిస్ ఓవర్ వస్తుంది, అది పూర్తవ్వగానే డైలాగ్స్ వచ్చేస్తుంటాయి కానీ ఆ డైలాగ్స్ సంబందించిన సీన్ మాత్రం కాస్త ఆలస్యంగా స్టార్ట్ అవుతుంది. సినిమాని క్రైమ్ కథాంశంతో తీసినప్పుడు లాజిక్స్ ఉండాలి కానీ అవి మనకు పెద్దగా కనిపించవు. క్రైమ్ కామెడీ రొమాంటిక్ మూవీ అని చెప్పిన ఈ సినిమాలో క్రైమ్ – చెప్పుకునేంత లేదు, కామెడీ – ఒక్క తాగుబోతు రమేష్ తప్ప ఎవరూ నవ్వించలేదు. రొమాన్స్ – ఓకే లా అనేలా మాత్రమె ఉండటం వల్ల దర్శకుడు ఏ ఒక్క దానిలోనూ సక్సెస్ కాలేకపోయాడు.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల జస్ట్ ఓకే అనేలా ఉంది. ఎడిటింగ్ బాలేదు. ఎడిటర్ ఈ సినిమాని ట్రిమ్ చేసి రెండు గంటలు చేసారు. కానీ ఇంకా కట్ చేసి ఉంటే బాగుండేది. డైలాగ్స్ రొటీన్ గానే ఉన్నాయి.

వైకుంఠపాళి అనే సీరియస్ సినిమా తీసిన అనిల్ గోపిరెడ్డి ప్రేక్షకులను నవ్వించాలని ద్వితీయ ప్రయత్నంగా చేసిన బిస్కెట్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలేకపోయాడు. కథ- స్క్రీన్ ప్లే – మ్యూజిక్ – దర్శకత్వం అని 4 విభాగాలను డీల్ చేసాడు. కథ – పాత కథే, స్క్రీన్ ప్లే – చాలా స్లోగా, బోరింగ్ గా ఉంది, మ్యూజిక్ – ఓకే, దర్శకత్వం – అంత క్లారిటీగా చెయ్యలేదు. చివరిగా ‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి ‘అనే మాట ఈ సినిమాకి వర్తిస్తుందని చెప్పాలి.

తీర్పు :

నూతన సంవత్సర కానుకగా విడుదలైన ‘బిస్కెట్’ సినిమా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తియ్యదనాన్ని పంచలేకపోయింది. తాగుబోతు రమేష్ కామెడీ, డింపుల్ గ్లామర్, ఓకే అనిపించే అరవింద్ కృష్ణ నటన తప్ప ఈ సినిమాలో చూడటానికి ఏం లేదు. కొత్త సంవత్సరం బాగా ఎంజాయ్ చెయ్యాలనుకునే వారు ఈ సినిమాకి దూరంగా ఉండటమే మంచిది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version