విడుదల తేదీ : 24 జనవరి 2014 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5 | ||
దర్శకుడు : సురేష్ పి కుమార్ |
||
నిర్మాత : జైసన్ పులికొట్టిల్ – విన్స్ మంగడన్ | ||
సంగీతం : మణికాంత్ | ||
నటీనటులు : ప్రిన్స్, సేతు, రిచా పనాయ్, దిశా పాండే.. |
‘బస్ స్టాప్’, ‘రొమాన్స్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన ప్రిన్స్, సేతు హీరోలుగా రిచా పనాయ్, దిశా పాండే హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘మనసును మాయ సేయకే’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరించిన ఈ సినిమాకి సురేష్ పి. కుమార్ డైరెక్టర్. జైసన్ పులికొట్టిల్ – విన్స్ మంగడన్ సంయుక్తంగా కలిసి నిర్మించిన ఈ మూవీకి మణికాంత్ సంగీతం అందించాడు. ఇంతకీ మనసును మాయ సేయకే సినిమా ప్రేక్షకుల మనసును ఎంతవరకూ మాయ సేసిందో ఇప్పుడు చూద్దాం..
కథ :
జై(సేతు) ఒకపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎండి. జై భార్య మైథిలి(రిచా పనాయ్). జై ప్రేమించి మైథిలిని పెళ్లి చేసుకున్నప్పటికీ తనతో సరిగ్గా ఉండడు. ఇది పక్కన పెడితే అనాధ అయిన శివ(ప్రిన్స్) వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్. శివ సివిల్ ఆర్కిటెక్ట్ అయిన లాస్య(దిశా పాండే)ని చూసి ప్రేమలో పడతాడు. శివ తన ప్రేమని చెప్పాలనుకునే టైంలోనే లాస్య ఆత్మ హత్య చేసుకుంటుంది. అక్కడి నుండి కట్ చేస్తే శివ ఆకాశ రామన్నలా జై కి కాల్ చేసి తన చేతే తన ఫ్రెండ్స్ ని చంపిస్తుంటాడు. అసలు లాస్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అసలు శివ జై చేత తన సొంత ఫ్రెండ్స్ ని ఎందుకు చంపేలా చేసాడు? జైకి శివకి ఉన్న సంబంధం ఏమిటి? అనే ట్విస్ట్ లని మీరు తెరపైనే చూడాలి…
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే కొన్ని సస్పెన్స్ సీన్స్ ని డైరెక్టర్ బాగా తీసాడు. ప్రిన్స్ ది చిన్న పాత్రే అయినప్పటికీ కథకి చాలా అవసరం. ప్రిన్స్ బాగా చేసాడు. కానీ కాస్త సీరియస్ గా చెప్పాల్సిన డైలాగ్స్ విషయంలో మాత్రం ఇంకా కేర్ తీసుకోవాల్సింది. దిశా పాండే తనకిచ్చిన పాత్రకి బాగానే సరిపోయింది. పాటల్లో కాస్త గ్లామరస్ గా ఉంది. రిచా పనాయ్ ది చాలా చిన్న పాత్ర అయినప్పటికీ తన పాత్రకి ఓకే అనే పెర్ఫార్మన్స్ చేసింది. చాలా చోట్ల డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు కొన్ని లోకేషన్స్ చాలా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమాకి మొదటి మైనస్ పాయింట్ జై పాత్ర పోషించిన సేతు. సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్ర ఇదే కానీ ఈ పాత్రకి ఇతను న్యాయం చేయలేకపోయాడు. ఎంతో ఎమోషనల్ గా కనిపించాల్సిన సీన్స్ లో అంత ఎమోషన్ కనిపించదు, ఫుల్ ఎమోషన్ ఉన్న సన్నివేశాలే అంతంత మాత్రం చేసాడంటే మిగతా సీన్స్ ఏ రేంజ్ లో చేసుంటాడో మీకు ప్రత్యేకంగా వివరించనక్కర్లేదనుకుంటా.. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఫస్ట్ హాఫ్ లో కథ ఏ మాత్రం ముందుకు సాగదు. దానికి తోడు పాటలు వచ్చి ఆడియన్స్ ని చిరాకు పెడుతుంటాయి. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా దారుణంగా అనిపిస్తుంది.
సెకండాఫ్ ని కాస్త ఆసక్తికరంగానే ట్రై చేసాడు కానీ కథలో ఉండాల్సిన మెయిన్ లాజిక్ శివ జై ని ఎందుకు? ఎలా? ట్రాప్ చేసాడన్నది, అది కరెక్ట్ గా చూపించకుండా మిగతా ఎన్ని లాజిక్స్ చూపించినా ఎలాంటి ఉపయోగం లేదని ఆ టైంలో డైరెక్టర్ గ్రహించలేకపోయాడనుకుంటా. క్లైమాక్స్ మొదలైంది ఇక ముగించేస్తాడు అన్న తరుణంలో అనవసరమైన షాట్స్ వేసి దానికి ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ జత చేసి ప్రేక్షకులకి క్లైమాక్స్ మీద ఉన్న ఆసక్తిని చెడగొట్టేసారు. సినిమాని రెండు భాషల్లోనూ తీసారని చెప్పుకున్నారు కానీ చాలా 90% సీన్స్ కి జస్ట్ డబ్బింగ్ మాత్రమె చెప్పారు. చాలా సీన్స్ లో లిప్ సింక్ సరిగా ఉండదు. అలాగే ఎడిటర్ సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల పాటల్లో లిరిక్స్ వస్తున్నా హీరో, హీరోయిన్స్ ఫేస్ లో లిప్ మూమెంట్ మాత్రం ఉండదు. ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ అనేది నిల్.
సాంకేతిక విభాగం :
ప్రేక్షకులని సినిమా థియేటర్ లో బతికించే అంశాలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి రెండే.. ఒకటి మణికాంత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సీన్ డిమాండ్ చెయ్యకపోయినా ప్రేక్షకులని సీట్లోనే కూర్చోబెట్టాలని తెగ ప్రయత్నం చేసాడు. అలాగే పాటలు బాగున్నప్పటికీ సందర్భం పాడు లేకుండా రావడం వల్ల అవి మైనస్ అయిపోయాయి. ఇక రెండవది సినిమాటోగ్రఫీ.. ముందుగా పాటల కోసం, కొన్ని సీన్స్ కోసం ఎంచుకున్న లోకేషన్స్ చాలా బాగున్నాయి. వాటిని అందంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా చూసుకుంటే డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఫైట్ ఎపిసోడ్స్ అంత బాగాలేవు.
ఎడిటింగ్ అస్సలు బాలేదు. కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం అనే మూడు కీలక విభాగాలని సురేష్ పి కుమార్ డీల్ చేసాడు. కథ ఒకే దాన్ని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో డీల్ చేస్తే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ స్క్రీన్ ప్లే పెద్దగా లేకపోవడంతో ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. ఇక డైరెక్షన్ అంటారా కీలక నటులను సెలక్షన్ లోనే తప్పు జరిగినప్పుడు బెస్ట్ పెర్ఫార్మన్స్ మనం డైరెక్టర్ నుంచి ఆశించకూడదు. కావున డైరెక్టర్ గా కొన్ని సీన్స్ కి మార్కులు కొట్టేసాడు కానీ ఓవరాల్ గా బిలో యావరేజ్ అనిపించుకున్నాడు.
తీర్పు :
‘మనసును మాయ సేయకే ‘ అనే ఈ సినిమా ప్రేక్షకుల మనసును మాయ చేసేంతలా అయితే లేదు. జస్ట్ ఓకే అనిపించే కొండది పెర్ఫార్మన్స్, సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ తప్ప ఇందులో చెప్పుకోదగినవి ఏం లేవు. బోరింగ్ ఫస్ట్ హాఫ్, జై పాత్రకి సేతు న్యాయం చెప్పలేకపోవడం, వీక్ క్లైమాక్స్ ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. కామన్ ఆడియన్స్ కొరుకునే ఎలిమెంట్స్ ఈ సినిమాలో లేవు, అలా అని కొత్త దానం కోరుకునే వాళ్ళు చూడొచ్చు అని చెప్పుకునేలా కూడా ఏం లేవు. ఇక ఈ సినిమా చూడాలా వద్దా అన్నది మీ ఛాయస్..
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
రాఘవ