సమీక్ష : గాలిపటం – యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్.!

సమీక్ష : గాలిపటం – యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్.!

Published on Aug 9, 2014 9:10 AM IST
gali-patam-review విడుదల తేదీ :08 ఆగష్టు 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : నవీన్ గాంధీ
నిర్మాత : సంపత్ నంది, కిరణ్.ఎం, విజయ్ కుమార్ వట్టికుటి
సంగీతం : భీమ్స్
నటీనటులు : ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, రాహుల్ రవీంద్రన్..

‘ప్రేమ కావాలి’ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయమైన ఆది వరుసగా లవ్ ఎంటర్టైనర్స్ లో నటించాడు. రొటీన్ కి భిన్నంగా ట్రై చెయ్యాలని ఆది చేసిన న్యూ జోనర్ మూవీ ‘గాలిపటం’. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాల దర్శకుడైన సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన ఈ సినిమా ద్వారా నవీన్ గాంధీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘గాలిపటం’ సినిమా ఆడియన్స్ మనసు గెలుచుకుందో లేదో అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

కార్తీక్(ఆది) – శ్వేత (ఎరికా ఫెర్నాండెజ్)లు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారు. ఒకే ఆఫీసులో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ అయిన వీరి లైఫ్ కొద్ది రోజులు బాగానే ఉంటుంది. కానీ కొద్ది రోజులకి ఇద్దరి మధ్యా గొడవలు మొదలవుతాయి. అలా ఓ రోజు గొడవ పడుతూ ఉన్న సందర్భంలో ఇద్దరూ వాళ్ళ పాత లవర్స్ గురించి ఓపెన్ ఇపోతారు. గతంలో కార్తీక్ పరిణీతి(క్రిస్టినా అఖీవా)ని ప్రేమించి ఉంటాడు. అలాగే గతంలో అరవ్ రెడ్డి(రాహుల్ రవీంద్రన్) శ్వేతని ప్రేమించి ఉంటాడు. కానీ పలు కారణాల వల్ల వీరి ప్రేమ సఫలం అవ్వదు.

కార్తీక్ ప్రేమ గురించి శ్వేతకి, శ్వేత ప్రేమ గురించి కార్తీక్ తెలియగానే వీరిద్దరూ ఇక కలిసుండ లేము అని విడాకులు తీసుకోవాలనుకుంటారు. అసలు కార్తీక్ పరిణీతిలు ఎందుకు విడిపోయారు? అలాగే అరవ్ రెడ్డి – శ్వేత ప్రేమ ఎందుకు సక్సెస్ కాలేదు? పెళ్లి చేసుకొని విడిపోవాలనుకున్న కార్తీక్ – శ్వేతల మధ్య ఏం జరిగింది? చివరికి వాళ్ళు విడిపోయారా లేదా కలిసిపోయారా? అన్నది మీరు సినిమాలో చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా ద్వారా సమాజంలో జరుగుతున్న కొన్ని బోల్డ్ పాయింట్స్ ని చెప్పాలనుకొని ట్రై చేసిన సంపత్ నందిని ముందుగా మెచ్చుకోవాలి. అలాగే ఈ సినిమా కోసం ఎంచుకున్న నటీనటులు ఈ సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పుకోవాలి. ముందుగా ఆది గత సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమాలో కనిపించాడు. అలాగే పెర్ఫార్మన్స్ పరంగా కూడా చాలా మెచ్యూరిటీని చూపించాడు. లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ మరియు ఎమోషనల్ సీన్స్ బాగా చేసాడు. క్రిస్టినా అఖీవా రష్యన్ అమ్మాయి అయినప్పటికీ ఆమె పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. ఈ మధ్య పరాయి భాషల నుంచి వచ్చే వారు డైలాగ్స్ విషయంలో, ఎక్స్ ప్రెషన్స్ విషయంలో అస్సలు కేర్ తీసుకోరు. కానీ క్రిస్టినా ఎంతో కేర్ తీసుకొని డైలాగ్స్ చాలా బాగా చెప్పింది. అలాగే లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో హావభావాలను కూడా బాగా పలికించింది.

ఇక ఎరికా ఫెర్నాండెజ్ పెళ్ళై అసలైన ప్రేమ కోసం ఎదురు చూసే అమ్మాయి పాత్రలో హావభావాలను బాగా పలికించింది. ఎమోషనల్ సీన్స్ బాగా చేసింది. రాహుల్ రవీంద్రన్ చేసింది చిన్న పాత్ర అయినా సినిమాకి మాత్రం చాలా కీలకం. అలాగే చాలా మెచ్యూర్ పెర్ఫార్మన్స్ చూపించాడు. ఇకపోతే ప్రీతీ రానా, ప్రగతి, పోసాని కృష్ణ మురళి, తెలంగాణ శకుంతల మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసారు. సప్తగిరి వచ్చేది రెండు సీన్స్ అయినప్పటికీ ప్రేక్షకులను బాగా నవ్విస్తాడు. ముఖ్యం గా సెకండాఫ్ లో ముసలి వాళ్ళతో వచ్చే సీన్ అందులో పవన్ కళ్యాణ్ కాటమరాయుడా సాంగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అలాగే ఆది – క్రిస్టినా అఖీవా లవ్ ట్రాక్ యువతని బాగా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ యువతకి, పెద్దలకి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఆడియన్స్ ని కొత్త అనుభూతికి లోనయ్యేలా చేస్తుంది. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ అనేది తెలుగు సినిమాకి చాలా కొత్త ఫార్మాట్ అని చెప్పుకోవాలి.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ ని ఎంటర్టైన్మెంట్ తో రాసుకున్న సంపత్ నంది సెకండాఫ్ మొత్తాన్ని ఎమోషనల్ వైపే నడిపించడంతో ఆడియన్స్ అక్కడక్కడా బోర్ ఫీలవుతారు. సినిమాలో రెండు లవ్ ట్రాక్స్ ఉంటాయి కానీ సెకండాఫ్ లో ఒక్క లవ్ ట్రాక్ తో కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయారు. అలాగే సెకండాఫ్ లో కొన్ని బోల్డ్ సీన్స్ పెట్టారు. అది నిజమే అయినా మరీ ఇంతలా చూపించాలా అనిపిస్తుంది.

అలాగే చమ్మక్ చంద్ర చేత కామెడీ కోసం అని చేయించిన జబర్దస్త్ కామెడీ స్కిట్స్ ఒక మాదిరిగా ఉన్నప్పటికీ అవి కథని పక్కదారి పట్టించేలా ఉంటాయి. చెప్పాలంటే సినిమాని నుంచి వాటిని తొలగించేయవచ్చు. స్క్రీన్ ప్లే పరంగా సెకండాఫ్ క్లైమాక్స్ లో ఓ కొత్త ట్విస్ట్ ఇవ్వడం కోసం దానికి ముందు వచ్చే సీన్స్ ని చాలా రొటీన్ గా, ఊహాజనితంగా రాసుకున్నారు. అందువల్ల సెకండాఫ్ ని కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

మొదటగా టాలీవుడ్ కి ఇలాంటి జోనర్ అందించాలని ఆలోచన వచ్చి కథ రాసిన సంపత్ నంది నుంచి మొదలు పెడదాం. సంపత్ నంది ఈ కథ కోసం బాలీవుడ్ సినిమాల నుంచి కొన్ని పాయింట్స్ ని స్పూర్తిగా తీసుకున్నాడు. కానీ ఆ పాయింట్స్ ని తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ చెయ్యడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ హాఫ్ వేగంగా ఉండేలా రాసుకున్నాడు. కానీ సెకండాఫ్ పై ఇంకాస్త శ్రద్ధ తీసుకొని కాస్త వేగంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది. ఇక డైలాగ్స్ చాలా బాగున్నాయి.
సినిమా హైలైట్స్ లో డైలాగ్స్ కూడా ఒక పార్ట్.

ఇక సాంకేతిక విభాగంలో హైలైట్స్ గా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ మరియు మ్యూజిక్. కె. బుజ్జి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేంని, అలాగే రాసుకున్న సీన్స్ లో ఉన్న ఫీలింగ్స్ ని తెరపై కనిపించేలా చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ విజుబల్స్ లోని ఫీల్ ని ఏమాత్రం పోనివ్వకుండా భీమ్స్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో తన సత్తా చాటుకున్నాడు. అలాగే భీమ్స్ అందించిన పాటల్లో అద్నాన్ సమీ, కైలాస్ ఖేర్ పాడిన పాటలు సినిమాకి హైలైట్ అవుతాయి. ఎడిటర్ రాంబాబు సెకండాఫ్ మీద కాస్త శ్రద్ధ తీసుకొని కాన్సెప్ట్ కి పక్కగా వెళ్తున్న సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది.

ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నవీన్ గాంధీ. సంపత్ నంది రాసిన స్క్రిప్ట్ కి వందకి వంద శాతం న్యాయం చేసాడని చెప్పాలి. ప్రతి ఒక్కరి నుంచి సూపర్బ్ పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. అలాగే లవ్ మేకింగ్ సీన్స్ ద్వారా ఆడియన్స్ ని సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయ్యేలా చెయ్యగలిగాడు. మొదటి సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు వస్తుంది. అనుకున్న కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చెయ్యడంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలైన సంపత్ నంది, కిరణ్, విజయ్ కుమార్ లు బాగా రిచ్ గా ఈ సినిమాని నిర్మించారు.

తీర్పు :

లవ్ ఎంటర్టైనర్స్ లోనే టాలీవుడ్ కి ఓ కొత్త తరహా సినిమాని అందించాలి అనే కాన్సెప్ట్ తో తీసిన ‘గాలిపటం’ సినిమా యువతని బాగా ఆకట్టుకుంటుంది. కథ, కథనం, టేకింగ్, నటీనటుల సెలక్షన్ దగ్గర నుంచి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న ఈ టీం అనుకున్న కథని ప్రేక్షకులకి అందించడంలో సక్సెస్ అయ్యారు. ఆది, క్రిస్టినా అఖీవా, ఎరికా ఫెర్నాండెజ్, రాహుల్ రవీంద్రన్ ల నటన, ఎంటర్టైనింగ్ గా సాగే ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ లోని కొన్ని సీన్స్, మ్యూజిక్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే సెకండాఫ్ లో కథని కాస్త సాగదీయడం, అలాగే కొన్ని బోరింగ్, కథకి అవసరం లేని సీన్స్, మరీ బోల్డ్ గా చెప్పిన కొన్ని పాయింట్స్ ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ఈ వారాంతంలో ‘గాలిపటం’ సినిమాని మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయవచ్చు..

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు