విడుదల తేదీ : 05 సెప్టెంబర్ 2014 | ||
123తెలుగు. కామ్ రేటింగ్ : 2/5 | ||
దర్శకత్వం : హారిక్ | ||
నిర్మాత : గంగపట్నం శ్రీధర్ – గోపికృష్ణ | ||
సంగీతం : అజయ్ అరసాద | ||
నటీనటులు :అనిరుధ్, చాందిని… |
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నెటిజన్స్ కి( యు ట్యూబ్ ద్వారా) బాగా పరిచయం ఉన్న డైరెక్టర్ హారిక్ దేవభక్తుని, నటుడు అనిరుధ్(డై హార్డ్ ఫ్యాన్ అఫ్ పవన్ కళ్యాణ్) కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ‘కిరాక్’. అనిరుధ్ సరనస చాందిని నటించిన ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరాక్ లో హారిక్ మూడు సబ్ స్టోరీస్ ని ప్రేక్షుకులకు చూపించాడు. ఇన్ని రోజులు షార్ట్ ఫిల్మ్స్ తో ఆకట్టుకున్న హారిక్ – అనిరుధ్ లు వెండితరపై కూడా తమ సత్తా చాటుకున్నారా.? లేదా.? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
ఓపెన్ చేస్తే.. కిరాక్ కథ 1999వ సంవత్సరం వైజాగ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మొదలవుతుంది. ఆ ఎగ్జిబిషన్ కి వచ్చిన ఓ స్మాల్ ఫ్యామిలీ.. అమ్మ, నాన్న, నాలుగేళ్ల పాప(అమృత), చిన్న బాబు. ఈ ఎగ్జిబిషన్ లో అమృత మిస్ అయిపోతుంది. అక్కడి నుంచి కట్ చేస్తే 2014..
పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని మన హీరో రాకేష్(అనిరుధ్). ఎప్పటికన్నా పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలన్నదే రాకేష్ లక్ష్యం. మహేష్ బాబుకి వీరాభిమాని మన హీరోయిన్ అమృత(చాందిని). ఒకే కాలేజ్ లో చదివే వీరిద్దరూ ప్రతి సినిమాలోలానే కొద్ది రోజులకి ప్రేమలో పడతారు. ఈ టైంలోనే రాకేష్ షార్ట్ ఫిల్మ్ చెయ్యాలని ఓ హ్యాండీ కామ్ కొంటాడు. అప్పటి నుంచి రాకేష్ లైఫ్ లో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి.ఆ హ్యాండీ కామ్ కి అనిరుధ్ కి ఉన్న సంబంధం ఏమిటి.? హ్యాండీ కామ్ వల్ల రాకేష్ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? చిన్నప్పుడు తప్పిపోయిన అమృత, రాకేష్ లవర్ అమృత ఒకటేనా? కాదా? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..
ప్లస్ పాయింట్స్ :
మూడనమ్మకాల గురించి డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ ఈ సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్. ఆ విషయంలో ప్రతి ఒక్కరూ హారిక్ ని సపోర్ట్ చేస్తారు. రియల్ లైఫ్ లో మరియు షార్ట్ ఫిల్మ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేసే అనిరుధ్ ఈ సినిమాలో కూడా 80% అదే చేసాడు. కావున దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఇది కాకుండా మిగిలిన 20% లో తను చేసిన హర్రర్ సీన్స్ లో అనిరుధ్ నటన చాలా బాగుంది. కాస్త ఇమిటేషన్ తగ్గించి, తన ఒరిజినల్ మానరిజమ్స్, నటనని తెరపై చూపించగలిగితే అనిరుధ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
ఇక కాళి చరణ్ ఫేం చాందిని లుక్స్ పరంగా ఈ సినిమాలో చూడటానికి చాలా బాగుంది. లవ్ ట్రాక్ ఎపిసోడ్స్ అన్నీ చాలా బాగా చేసింది. అలాగే సినిమాలో వాడుకున్న పవన్ కళ్యాణ్ – మహేష్ బాబుల పేర్లు కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. క్రికెట్ పిచ్చి కనకరాజు పాత్రలో వెన్నెల కిషోర్ వేసిన కొన్ని అంటే కొన్ని పంచులు మాత్రం ఆడియన్స్ ని కాస్త నవ్విస్తాయి. ఇంటర్వల్ బ్లాక్ మరియు సెకండాఫ్ లో వచ్చే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా స్టొరీ లైన్ లో ఉన్న ఒక్క మెసేజ్ ని పక్కన పెడితే, దీన్ని సినిమా అనుకోవడం కంటే పలు సినిమాల పేరడీల (స్పూఫ్స్) బాండాగారం అని చెప్పుకోవచ్చు. ఇలా ఎందుకన్నాను అంటే లెక్కపెట్టుకుంటే హీరో ఇంట్రడక్షన్ నుంచి పూర్తయ్యే లోపు మనకు 75% పైనే స్పూఫ్ కనిపిస్తాయి. ప్రతి హిట్ సినిమాలోని ఓ మంచి సీన్ ని తీసుకొని ఆ సీన్ కి డైలాగ్స్ మార్చి రాసి ఈ సినిమాలో పెట్టేసారు. పోనీ స్పూఫ్స్ పెట్టారు పో, ఆ స్పూఫ్స్ తో ఆడియన్స్ ని నవ్వించాలిగా, కనీసం స్పూఫ్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యకపోతే మాత్రం ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తది.. డైరెక్టర్ కొత్తగా ట్రై చెయ్యలేదు పో, కనీసం స్పూఫ్స్ తో కూడా ఎంటర్టైన్ చేయలేకపోతే ఇక అందులో డైరెక్టర్ గొప్పదనం ఏముంది..
ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ తీసిన హారిక్ షార్ట్ ఫిల్మ్స్ కి ఫీచర్ ఫిలిం కి ఉన్న తేడాని తెలుసుకునే ప్రయత్నంలో కాస్త కన్ఫ్యూజ్ కాకుండా ఉండి ఉంటే బాగుండేది. ఇలా ఎందుకు అన్నాను అంటే సినిమా టేకింగ్ మొత్తం షార్ట్ ఫిల్మ్ స్టైల్లోనే ఉంటుంది. డైరెక్టర్ అనుకున్నది చాలా చిన్న పాయింట్, కానీ ఫీచర్ ఫిల్మ్ అనేసరికి దానికి ఏదో కమర్షియల్ అంశాలు జత చెయ్యాలి, సాంగ్స్ పెట్టాలి, కామెడీ ఉండాలి అని ఏవేవో జత చేసి కాన్సెప్ట్ ని సాగదీసి ఆడియన్స్ కి బోర్ కొట్టించేసారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అస్సలు కథలోకి వెళ్ళకుండా కథని అటు ఇటూ సాగదీస్తూ బోర్ కొట్టించారు.
అసలు కథే స్లోగా సాగుతోంది అంటే మధ్య మధ్యలో పాటలు వచ్చి ఇంకా బోర్ కొట్టిస్తాయి. స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే కథ ఎక్కడా వేగవంతంగా ముందుకు కదలదు. సో ఆడియన్స్ సినిమా మొత్తం నీరసంగా సినిమా చూడాల్సి వస్తుంది. ఈ సినిమాలో ఉపయోగించిన స్క్రీన్ ప్లే ని మనం మాధవన్ హీరోగా వచ్చిన ’13బి’ సినిమాలో చూసాము. అలాగే ఇలాంటి సినిమాలకి అత్యంత కీలకమైన రీ రికార్డింగ్ సరిగా చేయలేదు. అలాగే సినిమాలో చేసిన కొన్ని సిజి ఎఫెక్ట్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. పోసాని కృష్ణమురళి ట్రాక్ కూడా ప్రేక్షకులను నవ్వించలేక పోయింది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో చెప్పుకోవడానికి ఏమన్నా ఉంది అంటే.. కాస్తో కూస్తో సినిమాటోగ్రఫీ గురించే చెప్పుకోవాలి. ఉన్నంతలో విజువల్స్ ని బాగా చూపించాడు. ఇక అజయ్ అరసాద అందించిన పాటలు బాగానే ఉన్నా సినిమాకి మాత్రం పెద్దగా హెల్ప్ అవ్వలేదు. సాయి కార్తీక్ ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడని పేరు వేసారు కానీ ఒక్క సీన్ కి కూడా సరైన మ్యూజిక్ ఇవ్వలేదు. దీనివల్ల సినిమా అంతా ఉప్పు లేని పప్పులా తయారైంది. ఎడిటర్ ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది, చెప్పాలంటే 123 నిమిషాల సినిమాని ఓ 100 నిమిషాల సినిమా చేసి ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేదేమో..
ఇక చెప్పుకోవాల్సింది ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన హారిక్ గురించి.. కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను హారిక్ డీల్ చేసాడు.. కథ – చెప్పాలనుకున్న మెసేజ్ పాయింట్ బాగుంది, ఆ పాయింట్ చెప్పడం కోసం అల్లుకున్న కథే ఆసక్తికరంగా బాలేదు, స్క్రీన్ ప్లే – వేగం లేదు, అంతకు మించి ఇదే స్క్రీన్ ప్లే ఎక్కడో చూసినట్టు ఉంటుంది, దర్శకత్వం – వెండితెర ప్రేక్షకులని మెప్పించే స్థాయిలో లేదు. హారిక్ ఈ సినిమాలో రొమాన్స్ – కామెడీ – హర్రర్ ఇలా అన్ని చూపించాలనుకున్నారు. ఇలా మూడు జోనర్స్ ని మిక్స్ చేయకుండా ఏదో ఒకటి లేదా రెండిటి మీదే దృష్టి పెట్టి ఉంటే సినిమా బాగుండేదేమో..! నిర్మాణ విలువలు ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది.
తీర్పు :
షార్ట్ ఫిల్మ్స్ గ్యాంగ్ నుంచి వచ్చిన కొందరు దర్శకులు, నటులలో కొంతమంది వెండితెర ప్రేక్షకులని మెప్పిస్తే, కొంతమంది వారిని మెప్పించలేకపోయారు. అదే షార్ట్ ఫిల్మ్ గ్యాంగ్ నుంచి వచ్చిన హారిక్ డైరెక్ట్ చేసిన ‘కిరాక్’ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొన్ని చోట్ల యావరేజ్ అనిపిస్తే కొన్ని చోట్ల మాత్రం చిరాక్ తెప్పిస్తుంది. అనిరుధ్, చాందిని జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని నిరాశపరుస్తుంది. కొత్తదనం లేని కథ, స్లోగా సాగే స్క్రీన్ ప్లే, షార్ట్ ఫిల్మ్ స్టైల్ టేకింగ్ చెప్పదగిన మేజర్ మైనస్ పాయింట్స్ అయితే సినిమాలో వాడుకున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పేర్లు, అనిరుధ్ – చాందినిల పెర్ఫార్మన్స్ చెప్పదగిన ప్లస్ పాయింట్స్.