సమీక్ష : పవర్ – రవితేజ మార్క్ రొటీన్ మాస్ ఎంటర్టైనర్.!

సమీక్ష : పవర్ – రవితేజ మార్క్ రొటీన్ మాస్ ఎంటర్టైనర్.!

Published on Sep 14, 2014 1:25 AM IST
power-telugu-movie-review విడుదల తేదీ : 12 సెప్టెంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3 /5
దర్శకత్వం : కె.ఎస్ రవీందర్ (బాబీ)
నిర్మాత : రాక్ లైన్ వెంకటేష్
సంగీతం : ఎస్ఎస్ తమన్
నటీనటులు : రవితేజ, హన్సిక, రెజీన కసాండ్ర

‘బలుపు’ హిట్ తర్వాత దాదాపు ఒక సంవత్సరం పైగా గ్యాప్ తీసుకున్న తర్వాత మాస్ మహారాజ్ రవితేజ చేసిన పక్కా మాస్ ఎంటర్టైనర్ ‘పవర్’. బలుపు సినిమాకి కథా రచయితగా పనిచేసిన కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడిగా చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీని రాక్ లైన్ వెంకటేష్ నిర్మించాడు. రవితేజ రెండు షేడ్స్ ఉన్న డిఫరెంట్ పాత్రల్లో కనిపించిన ఈ సినిమాలో హన్సిక, రెజీన కసాండ్ర హీరోయిన్స్ గా నటించారు. గతంలో వరుస ఫ్లాప్స్ అందుకున్న రవితేజ రూటు మార్చి కచ్చితంగా హిట్టే కొట్టాలి అని బాగా గ్యాప్ తీసుకొని చేసిన ఈ ‘పవర్’ సినిమాలో టైటిల్ లో ఉన్న పవర్ ఉందా.? లేదా.? అనేది ఇప్పుడు చూడాలి..

కథ :

కోల్ కతా మొత్తాన్ని రౌడీయిజంతో తన గుప్పెట్లో పెట్టుకున్న గంగూలీ భాయ్(సంపత్)ని పోలీసులు అరెస్ట్ చేసి హై కోర్టులో సబ్ మిట్ చేయడానికి బయలు దేరుతారు. కోల్ కతా లోనే లంచం తీసుకోవడంలో కింగ్ అయిన ఎసిపి బలదేవ్ సహాయ్(రవితేజ) తన టీం రాజీవ్(అజయ్) – కుందన్(సుబ్బరాజు)తో కలిసి గంగూలీ భాయ్ ని కోర్టుకి తీసుకెళ్ళకుండా అడ్డుపడతారు. అలా గంగూలీ భాయ్ ని పోలీసులనుండి ఎస్కేప్ చేసి అతన్ని తీసుకొని అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతారు.

అక్కడ కట్ చేస్తే హైదరాబాద్… పోలీస్ ఆఫీసర్ కావాలని రోజూ కలలుకనే కుర్రాడు తిరుపతి(రవితేజ). కానీ పోలీస్ కావడానికి తను చేసే ప్రయత్నాలు అన్ని విఫలం అవుతూ ఉంటాయి. కోల్ కతా హోం మినిస్టర్ అయిన జయవర్ధన్ (ముకేష్ ఋషి) ఒకరోజు అనుకోకుండా బలదేవ్ సహాయ్ పోలికలతో ఉన్న తిరుపతి చూసి, తనతో మాట్లాడి అండర్ గ్రౌండ్ లో ఉన్న గంగూలీ భాయ్ ని పట్టుకోవడానికి బలదేవ్ సహాయ్ ప్లేస్ లో తిరుపతిని కూర్చో బెడతాడు.

అక్కడి నుంచి తిరుపతి అలియాస్ బలదేవ్ సహాయ్ గంగూలీ భాయ్ ని పట్టుకోవడానికి ఏం చేసాడు.? ఈ జర్నీలో బలదేవ్ సహాయ్ గురించి తిరుపతి ఏం తెలుసుకున్నాడు.? అసలు బలదేవ్ సహాయ్ అసలు లంచగొండి ఆఫీసరేనా? ఒకవేళ లంచగొండి అయితే అలా ఎందుకు మారాడు.? అసలు గంగూ భాయ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

మాస్ మహారాజ రవితేజ ఓ సినిమా చేసాడు అంటే అతనిలో ఉండే ఎనర్జీ లెవల్సే ఆ సినిమాకి మొదటి ప్లస్ అవుతాయి. ఈ సినిమాకి కూడా రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ మేజర్ ప్లస్ పాయింట్. రవితేజ ఈ మూవీలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర చేసాడు. ముందుగా మాస్ గెటప్ లో కనిపించిన తిరుపతి పాత్రలో తన మార్క్ పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడు. మరోవైపు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో లంచగొండి గా కనిపించే టిపికల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన సీరియస్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని మెప్పించాడు. ఇవికాకుండా రవితేజ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఎమోషనల్ సీన్స్ బాగా చేసాడు.

ఇక సినిమాలో కథకి సంబంధం లేకుండా కేవలం గ్లామర్ కోసం మాత్రమే ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నారు.. వారిద్దరిలో ఎక్కువ మార్కులు కొట్టేసిన రెజీన గురించి మొదటగా చెబుతా.. కనిపించేది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనే అయినా ఉన్నంతలో సూపర్బ్ ఎక్స్ ప్రెషన్స్ తో అందంగా కనిపిస్తూ మార్కులు కొట్టేసింది, వీటితో పాటు ఒక సాంగ్ లో గ్లామర్ డోస్ ప్లస్ లిప్ కిస్ బోనస్. రవితేజ – రెజీన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. ఇక రెండవ భామ హన్సిక నాలుగైదు సీన్స్ కి, 4 పాటలకి మాత్రం పరిమితమైంది. నోటంకి నోటంకి పాటలో బాగా అందాలను ఆరబోసింది. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఫస్ట్ హాఫ్ లో రవితేజతో కలిసి కాసేపు నవ్వించాడు.

ఫస్ట్ హాఫ్ లో సత్యం రాజేష్ – హన్సిక మధ్య వచ్చే ఎపిసోడ్ బాగా నవ్విస్తుంది. పోసాని కృష్ణమురళి, సప్తగిరి కూడా తాము ఉన్న కొద్దిసేపు ప్రేక్షకులని నవ్విస్తారు. ఇకపోతే సినిమాలో ఫస్ట్ హాఫ్ కాస్త ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. ఇంటర్వల్ బ్లాక్ కూడా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్, నోటంకి సాంగ్ బాగుంది. ప్రకాష్ రాజ్, సంపత్, ముకేష్ ఋషి, అజయ్, సుబ్బరాజు, బ్రహ్మాజీ తమ పాటల పరిధిమేర నటించారు.

మైనస్ పాయింట్స్ :

కెఎస్ రవీంద్రకి డైరెక్టర్ గా ఇది మొదటి సినిమా కావడం వలన చాలా చోట్ల బాగా కన్ఫ్యూజ్ అయినట్టు ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అందుకే అనుకున్న కాన్సెప్ట్ ని కూడా పర్ఫెక్ట్ గా చెప్పలేకపోయాడు. బలదేవ్ సహాయ్ పాత్రని డిఫరెంట్ గా తెరకి పరిచయం చేసినప్పటికీ అదే విభిన్నతని పాత్ర చివరి వరకూ చూపలేకపోయాడు. ఈ సినిమా కథకి అసలైన పాయింట్ బలదేవ్ సహాయ్ చేసే మిషన్. కానీ ఆమిషణ్ ఏంటి? ఎందుకు చేస్తున్నాడు.? దాని వల్ల ఉపయోగం ఏమిటి.? అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమా ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది.? అందుకే అసలు డైరెక్టర్ ఏం చెప్పలనుకున్నాడా అనేది ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయాడు.

ఇకపోతే ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే మరియు సెకండాఫ్.. సినిమా ట్రైలర్ ని చూసిన వారు, ఈ సినిమా సినిమా మొదలైన 10 నిమిషాలకే సినిమాలో వచ్చే ట్విస్ట్ లని ఊహించేయవచ్చు. సెకండాఫ్ లో ఒకటి రెండు యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి నచ్చవచ్చు, వాటిని పక్కన పెడితే… సెకండాఫ్ లో కామెడీ లేదు, సస్పెన్స్ లేదు, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ ని కూడా సరిగా చెప్పలేదు. ఇకపోతే ఈ సినిమాకి తీసుకున్న స్టొరీ లైన్ ని మనం ‘ఆపరేషన్ దుర్యోదన’ సినిమాలో చూసాం, ఇక్కడ సందర్భాలు, నేపధ్యం మారుతాయి అంతే తేడా… అలాగే టేకింగ్ పరంగా ‘విక్రమార్కుడు’ స్టైల్లో ఉంటుంది, మధ్య మధ్యలో దానికి ‘బలుపు’ సినిమా ఫ్లేవర్ ని కూడా మిక్స్ చేసారు. క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ సీన్ తర్వాత అదే ఎమోషన్ ని కంటిన్యూ చేయకుండా ఫన్ కోసం పెట్టిన లుంగీ డాన్స్ సీక్వెన్స్ ప్రేక్షకులని నవ్వించకపోగా, ఆడియన్స్ లో ఉన్న ఎమోషన్ ని పోగొట్టేసింది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్మెంట్ లో మేజర్ హైలైట్స్ గా ఒక రెండింటిని చెప్పుకోవచ్చు..అందులో మొదటిది జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ. సినిమాలో విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా కనిపిస్తాయి. ప్రతి లొకేషన్ ని సీన్ లో చాలా కలర్ఫుల్ గా ఉండేలా చూపించాడు. ముఖ్యంగా కోల్ కతా ఎపిసోడ్ ని చాలా బాగా షూట్ చేసాడు. ఇక రెండవ హైలైట్.. ప్రొడక్షన్ వాల్యూస్.. రాక్ లైన్ వెంకటేష్ పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై గ్రాండ్ గా కనిపిస్తుంది. తమన్ అందించిన పాటలు బాగున్నాయి, ఆ పాటలని విజువల్ గా కూడా బాగా తీసారు.. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జస్ట్ యావరేజ్. ఇంకాస్త బెటర్ మ్యూజిక్ ఉంది ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలా హీరోయిజం ఎలివేషన్ సీన్స్ లో ఎలివేషన్ కి తగ్గా మ్యూజిక్ వినపడలేదు. కోన వెంకట్ రాసిన కొన్ని పంచ్ డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ లో బాగా పేలాయి. ఆయన ప్రాస మీద కంటే సినిమా కంటెంట్ కి తగ్గట్టు డైలాగ్స్ రాసి ఉంటే బాగుండేది. రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.

ఎడిటర్ గౌతం రాజు సెకండాఫ్ మీద కాస్త శ్రద్ధ తీసుకొని సినిమా రన్ టైంని తగ్గించి ఉంటే బాగుండేది. ఇక మొదటి సినిమా డైరెక్టర్ బాబీ విషయానికి వద్దాం.. మొదటి నుంచి బాబీ అందించిన కమర్షియల్ గా పరవాలేదనిపించుకున్నా కొత్తదనం ఉండేది కాదు. వాటిలానే ఇందులో కూడా కొత్త కథేమీ లేదు(ఏ సినిమా నుంచి స్ఫూర్తి తీసుకున్నారు అనేది మైనస్ లో చెప్పాను).. కానీ పాత కథని కొత్తగా చూపిద్దాం అని ట్రై చేసాడు, కానీ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. బాబీ – చక్రవర్తి కలిసి రాసుకున్న స్క్రీన్ ప్లే కొంత వరకూ ఓకే, కానీ ఓవరాల్ సినిమాని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఇక బాబీ డైరెక్టర్ గా మాత్రం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అనుకున్న పాయింట్ ని ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా చెప్పలేకపోయినా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కొన్ని కమర్షియల్ సీన్స్ ని మాత్రం బాగా డీల్ చేసాడు. బాబీ ఇప్పుడు వెళ్తున్న మూస ధోరణిని వదిలి కాస్త డిఫరెంట్ పాయింట్ ని కమర్షియల్ గా చెప్పడానికి ట్రై చేస్తే డైరెక్టర్ గా తన మార్కు వేసుకునే అవకాశం ఉంది.

తీర్పు :

మాస్ మహారాజ్ రవితేజ ఒక సంవత్సరం పైగా గ్యాప్ తీసుకొని చేసిన ‘పవర్’ సినిమా అంత పవర్ఫుల్ గా లేదు. టైటిల్ లో ఉన్న పవర్ లో ఒక 60 – 70% సినిమాలో ఉండి ఉంటే రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేది. ‘పవర్’ అనేది కంటిన్యూగా ఒకే రేంజ్ లో వెళ్ళకుండా మధ్య మధ్యలో పవర్ కట్స్, వోల్టేజ్ డ్రాప్స్ అవడం వల్ల యావరేజ్ నుండి అబో యావరేజ్ సినిమాగా నిలిచింది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, ఫస్ట్ హాఫ్, హన్సిక – రెజీన ల గ్లామర్, సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మేజర్ హైలైట్స్ అయితే అనుకున్న పాయింట్ ని చెప్పలేకపోవడం, స్క్రీన్ ప్లే, సెకండాఫ్, సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. రవితేజ అభిమానులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు కానీ మిగతా వారే సెకండాఫ్ లో కాస్త నిరుత్సాహపడతారు. ఓవరాల్ గా ప్రస్తుతం బాక్స్ ఆఫీసు వద్ద ఎలాంటి సినిమా లేకపోవడం, ఇదొక కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కావడం వలన ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

 

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు