మా టీవీ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో గెలుపొందిన రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన మొదటి సినిమా ‘ది ఎండ్’. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా యువ చంద్ర, సుధీర్ రెడ్డి, గజల్ సోమయ్య నటీనటులుగా పరిచయం అవ్వగా, పావని రెడ్డి ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. మరి ఇప్పటి వరకూ షార్ట్ ఫిల్మ్స్ తో మెప్పించిన రాహుల్ ఫస్ట్ ఫిల్మ్ తో ఎంతవరకూ మెప్పించాడు అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
ఒకే కాలేజ్ లో చదివిన రాజీవ్ మాథ్యూస్(సుధీర్ రెడ్డి) ప్రియ(పావని రెడ్డి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వీరిద్దరూ హైదరబాద్ సిటీకి అవుట్ స్కర్ట్స్ లోని ఓ ఫాం హౌస్ లో ఉంటారు. రాజీవ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన గౌతమ్(యువ చంద్ర) లండన్ లో తన మెడిసిన్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కి వస్తాడు. రాజీవ్ గౌతమ్ ని తన ఇంటికి తీసుకెళతాడు. అప్పుడే ఆ ఫాం హౌస్ లో ఇంటి వర్క్ చేస్తున్న ఓ లేడీ ఇంటిపై నుంచి కింద పడి చనిపోతుంది.
అక్కడి నుంచి కట్ చేస్తే గౌతమ్ గోవాకి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులకి రాజీవ్ కి బాలేదని గౌతమ్ హైదరాబాద్ కి వస్తాడు. అప్పుడే రాజీవ్ తన భార్య ప్రియకి దెయ్యం పట్టిందని, వింత వింతగా బిహేవ్ చేస్తోందని, తనకి చుక్కలు చూపిస్తోందని గౌతమ్ కి చెబుతాడు. ఆ విషయం తెలుసుకున్న గౌతమ్ ఏం చేసాడు.? అసలు ప్రియకి నిజంగానే దెయ్యం పట్టిందా.? లేక కావాలనే చేస్తోందా.? ప్రియ తన భర్త అయిన రాజీవ్ కి ఎందుకు చుక్కలు చూపించింది.? అనే విషయాలను మీరు వెండితరపైనే చూసి తెలుసుకోవాలి..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అంటే ఈ సినిమాలో నటించిన నటీనటులనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాతో పరిచయం అయిన సుధీర్ రెడ్డి, యువ చంద్రలు చాలా మంచి నటనని కనబరిచారు. వీరిద్దరిలో సినిమాకి మొత్తం హైలైట్ గా నిలిచింది సుధీర్ రెడ్డి. సుదీర్ రెడ్డి మొదటి నుంచి తన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని టెన్షన్ కి గురి చేయడమే కాకుండా, అక్కడక్కడా బాగా నవ్విస్తాడు. ముఖ్యంగా సస్పెన్స్ ఎలిమెంట్స్ లో అతను భయపడే కొన్ని సీన్స్ ఆడియన్స్ కి బాగా నవ్వు తెప్పిస్తాయి. ఇక యువ చంద్ర తన కిచ్చిన పాత్రని చాలా సెటిల్ గా చేసాడు.
ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన పావని రెడ్డి డైరెక్టర్ అనుకున్న దెయ్యం పాత్రకి బాగా సరిపోవడమే కాకుండా చాలా బాగా నటించింది. లుక్స్ పరంగా చీరల్లో బాగుంది. ఇక ఈ సినిమాతో పరిచయం అయిన గజల్ సోమయ్య కాస్త గ్లామరస్ రోల్ ప్లే చేసింది. సినిమాలో ఒరిజినల్ కథకి పెద్దగా సంబంధం లేకపోయినా గ్లామరస్ అట్రాక్షన్ కోసం బాగా హెల్ప్ అయ్యింది. అలాగే తన వచ్చీరానీ తెలుగు డైలాగ్ డెలివరీతో కొంతవరకూ ఆకట్టుకుంది. కమెడియన్ వేణు అక్కడక్కడా నవ్వించాడు.
ఇక సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మొదలైన ఒక 30 నిమిషాల నుంచి సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడి నుంచి ఇంటర్వల్ వరకూ వచ్చే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్, కామెడీ బిట్స్ బాగుంటాయి. అలాగే ఇంటర్వల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. అలాగే సెకండాఫ్ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగుంటాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ రన్ టైం 148 నిమిషాలు ఉండడం.. సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ గా ఓ సినిమా తీస్తున్నాం అంటే తక్కువ రన్ టైంలో ప్రతి క్షణం ఆడియన్స్ లో ఉత్కంఠని కలిగిస్తూ తీస్తే అది ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అదే రన్ టైంని పెంచేసి ఒరిజినల్ ట్రాక్ నుంచి పక్కకి వెళ్ళాము అంటే ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. ఇదే విషయం ఈ సినిమాలో జరిగింది. సింపుల్ 100 నుంచి 120 నిమిషాల్లో ఈ సినిమాని ఫినిష్ చేసి ఉంటే సినిమా చాలా ఆసక్తికరంగా ఉండేది. అలాగే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా మొదలవుతుంది. మొదటి అరగంట వరకూ కథ చాలా బోరింగ్ గా సాగుతుంది. ఆ తర్వాత కూడా ఊహించినట్టే జరిగినా కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ మాత్రం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.
ఇక ఇంటర్వల్ కి ఆడియన్స్ ని కాస్త ఆసక్తికి గురిచేసిన డైరెక్టర్ రాహుల్ అదే టెంపోని కంటిన్యూ చెయ్యకుండా, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ స్టార్టింగ్ నుంచి కొద్ది సేపు బాగా రెగ్యులర్ గా మనం ఊహించిందే జరుగుతూ ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కొంతమంది ఊహించకపోయినా చాలా మంది ఊహించేసి ఎప్పుడు రివీల్ చేస్తారా అని వేచి చూస్తుంటారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ఈ సినిమాకి అవి రెండు మైనస్ అయ్యాయి. స్క్రీన్ ప్లే పెద్ద ఆసక్తిగాలేదు, దానికి తోడు ఎడిటింగ్ కూడా బాగా సాగదీసారు. ఇకపోతే సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా మిమ్మల్ని భయపెట్టేసి, మీ గుండెల్లో దడ పుట్టించేంత లేవు. సినిమాలో లాజికల్ గా కూడా చాలా మిస్టేక్స్ కనిపిస్తాయి. ఫైనల్ ట్విస్ట్ లో రివీల్ అయ్యే పాయింట్ కి నాంది ఎక్కడ అనేది కూడా చెప్పలేదు. ఇలాంటి లాజికల్ మిస్టేక్స్ చాలా ఉంటాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో చెప్పుకోవాల్సిన వారు ఇద్దరే ఉన్నారు. వాళ్ళే మ్యూజిక్ అందించిన వంశీ – హరి మరియు సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వనమాలి. ఒక సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ కి కెమెరా యాంగిల్స్ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి అనే విషయాలని ప్రవీణ్ బాగా డీల్ చేసాడు. తనకు ఇచ్చిన లోకేషన్స్ ని బాగా వినియోగించుకున్నాడు. ఇకపోతే వంశీ – హరిల మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు పెద్దగా కనెక్ట్ కాకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి బాగా సరిపోయింది. ఇక ఎడిటింగ్ ఆడియన్స్ లో టెన్షన్ ని క్రియేట్ చెయ్యలేకపోయింది. ఈ విషయంలో తనకంటే స్క్రీన్ ప్లే అంత డల్ గా రాసుకున్న డైరెక్టర్ దే ఎక్కువ తప్పుందని చెప్పాలి.
ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ సంక్రిత్యాన్ కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగలను డీల్ చేసాడు. కథ – ఇలాంటి కథని మనం కొద్ది సినిమాలలో చూసే ఉంటాము, కావున కొత్తగా అనిపించే పాయింట్ అయితే ఏమీ లేదు. స్క్రీన్ ప్లే – బాగా సాగాదీసేసారు, అంత లెంగ్త్ లేకుండా షార్ట్ గా చెప్పి ఉంటే బాగుండేది. దర్శకత్వం – రాహుల్ ఒక దర్శకుడిగా నటీనటుల నుంచి మంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు, అందే రేంజ్ లో ఆడియన్స్ కి కంటెంట్ ని కనెక్ట్ చెయ్యడంలో మాత్రం అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వలేకపోయాడు. కోటేశ్వర్ రావు నిర్మాణ విలువలు రిచ్ ఫీల్ ఇచ్చేలా ఉన్నాయి.
తీర్పు :
ఇప్పటి వరకూ షార్ట్ ఫిల్మ్స్ తో నెటిజన్స్ ని మెప్పించిన రాహుల్ రాహుల్ సంక్రిత్యాన్ తన మొదటి వెండితెర సినిమా ‘ది ఎండ్’ తో ప్రేక్షకులను ఓ మోస్తరుగా మాత్రమే మెప్పించగలిగాడు. ఈ సినిమా జోనర్ కి అవసరం లేని కొన్ని కమర్షియల్ పాయింట్స్ ని పక్కన పెట్టి రన్ టైంని తగ్గించి చెప్పి ఉంటే ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చేది. సుదీర్ రెడ్డి, యువ చంద్ర, పావని రెడ్డిల పెర్ఫార్మన్స్ మరియు ఇంటర్వెల్ ముందు వచ్చే ఓ అరగంట, క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ అయితే ఆడియన్స్ ని థ్రిల్ చేసే రేంజ్ లో లేని సస్పెన్స్ ఎలిమెంట్స్, సినిమా లెంగ్త్, బోరింగ్ నేరేషన్ ఈ సినిమాకి చెప్పదగిన మైనస్ పాయింట్స్. సస్పెన్స్ థ్రిల్లర్ విత్ హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు నచ్చే వారు ఈ సినిమాని ఓ సారి చూడొచ్చు..
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం