సమీక్ష : మన కుర్రాళ్ళే – వీళ్ళను భరించడం కష్టం.!

సమీక్ష : మన కుర్రాళ్ళే – వీళ్ళను భరించడం కష్టం.!

Published on Jan 1, 2015 2:00 PM IST
Mana_Kurralle_movie_Review విడుదల తేదీ : 01 జనవరి 2015
123తెలుగు. కామ్ రేటింగ్ : 1.75/5
దర్శకత్వం : వీర శంకర్
నిర్మాత : బి.వి.యస్.శ్రీనివాసు, ఎచ్.ఎస్.అరూన్
సంగీతం : రాజ్, గురుకిరణ్, మనోమూర్తి, జి.కె, శివకాకాని, మోహన్‌జోనా, భీమ్స్
నటీనటులు : అరవింద్ కృష్ణ, రాజ్ కళ్యాణ్, వెంకట్, కృష్ణుడు, రావు రమేష్, రచన మల్హోత్రా


అరవింద్ కృష్ణ, రచన మల్హోత్రా, రాజ్ కళ్యాణ్, శ్రుతి రాజ్, రావు రమేష్, కృష్ణుడు, వెంకట్ తదితరులు నటీనటులుగా వీర శంకర్ (పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ ఫేం) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మన కుర్రాళ్ళే’. ఈ సినిమాకు ఎనిమిది మంది సంగీత దర్శకులు పని చేయడం విశేషం. ఆస్రా నిర్మాణ్ ఇండియా సమర్పణలో వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై బి.వి.యస్.శ్రీనివాసు, ఎచ్.ఎస్.అరూన్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ :

అది 2007వ సంవత్సరం… సాఫ్ట్ వేర్, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగాలు అత్యున్నత స్థానంలో ఉన్నాయి. ఈ రంగాలలో ఉద్యోగులకు, వ్యాపారులకు చేతి నిండా డబ్బులే డబ్బులు. అనవసరపు ఖర్చులు, విలాసాలు, సరదాలతో జీవితం సాగిస్తుంటారు. నేలను నమ్ముకుని వ్యవసాయం సాగిస్తున్న ఓ పచ్చటి పల్లెటూరి నుండి హైదరాబాద్ వచ్చిన యువకులు సూరి (రాజ్ కళ్యాణ్), యువరాజ్ లు సాఫ్ట్ వేర్ రంగంలో, దొంగ సుబ్బి (కృష్ణుడు) రియల్ ఎస్టేట్ రంగంలో, అప్పు (వెంకట్) షేర్ మార్కెట్ రంగంలో స్థిరపడతారు. బాగానే డబ్బు సంపాదించినా, భవిష్యత్ గురించి ఆలోచన ఉండదు. బి.కామ్ చదివిన వీరి స్నేహితుడు లచ్చు(అరవింద్ కృష్ణ) సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. ఆర్ధిక మాంద్యం (రిసెషన్) దెబ్బకు ఒక్కసారిగా సాఫ్ట్ వేర్, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగాలు కుదేలవుతాయి. అదే సమయంలో వీరి గ్రామాన్ని సెజ్ (సోషల్ ఎకనామిక్ జోన్)గా ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీన్ని సూరి అన్నయ్య మరియు గ్రామ సర్పంచ్ అయిన రామరాజు (రావు రమేష్) వ్యతిరేకిస్తాడు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం లేని కారణంగా లచ్చు ఎటువంటి అవమానాలు ఎదుర్కున్నాడు..? విలాసవంత జీవితానికి అలవాటు పడ్డ యువరాజ్, అప్పు, దొంగ సుబ్బిల జీవితాలలో ఆర్ధిక మాంద్యం ఎటువంటి ప్రభావం చూపింది..? సెజ్ ను వ్యతిరేకించిన రామరాజు మరణానికి గల కారణాలేంటి..? రామరాజు మరణం తర్వాత లచ్చు, అప్పు, సూరిలు ఎటువంటి పోరాటం చేశారు..? ప్రపంచీకరణ ముసుగులో మనం ఏం కోల్పోతున్నాం..? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అంటే స్టార్ కాస్టింగ్ అని చెప్పుకోవాలి. ప్రధాన పాత్రలలో నటించిన రావు రమేష్, అరవింద్ కృష్ణ, వెంకట్, కృష్ణుడులు సన్నివేశంలో పస లేకపోయినా తమ నటనతో ప్రాణం పోశారు. వీరి నటన సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా రావు రమేష్ సర్పంచ్ పాత్రలో గ్రామంలో ప్రజల శ్రేయస్సు కోరే బలమైన నాయకుడిగా తనదైన శైలిలో నటించి మెప్పించారు. అతని పాత్రకు రాసిన డైలాగులు బాగున్నాయి. క్లాస్ లుక్ లో కనిపించే అరవింద్ కృష్ణ.. మాస్ క్యారెక్టర్ లో నటించాడు. అతని నటన పర్వాలేదు. రెండే సన్నివేశాలు అయినా సీనియర్ కమెడియన్ వేణు మాధవ్ కాస్త నవ్వించాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమా ప్రారంభమైన 20 నిముషాల తర్వాత క్లైమాక్స్ ఏంటో థియేటర్లో ప్రేక్షకుడు ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆర్ధిక మాంద్యం(రిసెషన్), సెజ్ ల నేపధ్యంలో తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. వాటి కంటే ఈ సినిమా కథ భిన్నంగా ఏమి ముందుకు సాగలేదు. ‘మన కుర్రాళ్ళే’ కథ అంత పేలవంగా ఉంది. పాత కథ అయినా ఆసక్తికరంగా, థియేటర్లో ప్రేక్షకుల ఊహకు అందకుండా చెప్పగలిగితే… మన తెలుగు ప్రజలు ఆదరించేవారు. ఈ సినిమాలో మనకు ఆ భాగ్యం కూడా కలగలేదు. ఒక్క క్లైమాక్స్ మాత్రమే కాదు, ఒక సన్నివేశం తర్వాత సన్నివేశం ఏంటో..? ఆ సన్నివేశంలో డైలాగులు ఎలా ఉంటాయో..? కూడా ముందే అర్ధమవుతాయి. స్క్రీన్ ప్లే అంత గొప్పగా ఉంది. ఇక, ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేసేది ఎక్కడ.

సినిమా ప్రారంభమే ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రులు.. క్రిడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ ఇస్తామంటూ ఎగబడే బ్యాంకర్లు.. హైదరాబాద్ శివార్లలో భూములను కోట్లుకు కోట్లు పారేసి కొనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. ఇలా పాత సినిమాలలో సన్నివేశాలను మళ్లీ తెరపై చూస్తున్నామనే భావన కలుగుతుంది. మిగతా సినిమా కూడా ప్రారంభాన్ని అనుసరించింది. సినిమా ఆసాంతం ఏదోక సినిమాలో గతంలో ఇదే తరహా సన్నివేశాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది తప్ప, కొత్తగా ఏమి అనిపించదు.

సాంకేతిక విభాగం :

ముజీర్ మాలిక్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. లో బడ్జెట్ సినిమా అయినా బెటర్ అవుట్ పుట్ ఇచ్చారు. ఈ సినిమా ఎనిమిది మంది సంగీత దర్శకులు పని చేశారని, భారతీయ సినిమా చరిత్రలో ఇదొక రికార్డు అని దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా, వినసొంపుగా లేనప్పుడు ఎంత మంచి సంగీత దర్శకులు పని చేస్తే ఏం లాభం. సంగీతంలో క్వాంటిటీ కాకుండా క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తే బాగుండేది. నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది. తన చేతిలో పెట్టిన సన్నివేశాలను ఒక ఆర్డర్ లో పెట్టడానికి ఎడిటర్ చాలా కష్టపడి ఉండి ఉంటారు. ఎందుకంటే.. సినిమాలో నలుగురు హీరోలు, ముఖ్యమైన రావు రమేష్ క్యారెక్టర్ మరొకటి. అందువల్ల అనవసర సన్నివేశాలను కత్తిరించడంపై దృష్టి పెట్టలేదు. ప్రతి ఒక్కరికీ సమ ప్రాధాన్యం ఇచ్చారు. నిర్మాణ విలువలు బాగోలేదు. సినిమాలో గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి.

ఈ సినిమా చూసిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడేనా ఈ సినిమా తెరకేక్కించింది అనే సందేహం కలుగుతుంది. కథ, కథనం, మాటలు, దర్శకత్వం విభాగాలను నిర్వర్తించిన వీర శంకర్, ఒక్క దాంట్లో కూడా సరైన పనితీరు కనబరచలేదు. దర్శకత్వంలో ఆ మెరుపులు లేవు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేదు. కనీసం ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించిన సినిమాలా కూడా కనబడడం లేదు. కామెడీ సన్నివేశాలు వస్తున్న సమయంలో ప్రేక్షకులు నవ్వడం మానేసి ఎప్పుడు ఈ సీన్ అయిపోతుందా అన్నట్లు చూశారు. డైలాగులలో పంచ్ లేదు. చివరి రెండు పాటలు మినహా ఒక్క పాటకు కూడా సరైన సందర్భం లేదు. ఏదో అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి.

తీర్పు :

యువత తలచుకుంటే ఏదైనా సాధించగలదు, ప్రపంచీకరణ ముసుగులో మన సంస్కృతిని, మూలాలను, భూమి తల్లిని మర్చిపోతున్నాం అనే అంశాన్ని ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ సినిమాలో కాస్తయినా కొత్తదనం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో అయినా కొత్త సినిమా చూద్దామని భ్రమపడిన ప్రేక్షకుల ఆశలపై దర్శకనిర్మాతలు నీళ్ళు చల్లారు. ఎక్కడో పాత సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్య తారాగణం పడిన శ్రమ, అద్బుత నటన పేలవమైన దర్శకత్వం కారణంగా వృధా అయ్యాయి. ఎంత వీరి నటన బాగున్నా, ‘మన కుర్రాళ్ళే’ కదా అని సినిమాను భరించడం కష్టం. సంతోషం కోసం ఈ సినిమా చూడడం కన్నా, ఇతర మార్గాలను అన్వేషించడం ఉత్తమం.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5
123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు