సమీక్ష : పటాస్ – మసాలా ఎంటర్టైనర్

సమీక్ష : పటాస్ – మసాలా ఎంటర్టైనర్

Published on Jan 24, 2015 1:00 PM IST
patas_review విడుదల తేదీ : 23 జనవరి 2015
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, శృతి సోది, ఎమ్మెస్ నారాయణ..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘పటాస్’ సినిమా నేడు విడుదలైంది. శృతి సోది హీరోయిన్. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాలకు ఎప్పుడూ లేని రీతిలో ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందో..? లేదో..? ఓ సారి చూడండి.

కథ :

కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) అవినీతిపరుడైన పోలీస్ అధికారి. తనను తాను కావాలని హైదరాబాద్ కు బదిలీ చేయించుకుంటాడు. ఒకసారి అతను హైదరాబాద్ చేరగానే.. తన అధికారాలు ఉపయోగించి తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో, అతను హైదరాబాద్ డిజిపి (సాయి కుమార్)కు తలనొప్పిగా మారిన స్థానిక రాజకీయ నాయకుడు (అశుతోష్ రాణా)ను ప్రోత్సహిస్తాడు.

కళ్యాణ్ సిన్హా హైదరాబాద్ రాక వెనుక ఒక నిజం ఉందని తెలుసుకున్న హైదరాబాద్ డిజిపి షాక్ కి గురవుతాడు. ఇదే కథలోని అసలైన ట్విస్ట్. ఆ నిజం ఏమిటి..? కళ్యాణ్ సిన్హా ఎందుకు అవినీతి అధికారిగా మారాడు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే.. మీరు వెండితెరపై కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాను చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమా మేజర్ ప్లస్ పాయింట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్లో ఉండడం. కళ్యాణ్ రామ్ ను ఒక ఎనర్జిటిక్ క్యారెక్టర్ లో చూపిస్తూ సినిమా ఆసాంతం వినోదాత్మకంగా తెరకెక్కించిన క్రెడిట్ దర్శకుడు అనిల్ రావిపూడికి చెందుతుంది. సినిమాలో అవసరమైన చోట కామెడీని యాడ్ చేసి సినిమాలో ఒక్కసారి కూడా టెంపో, ఎగ్జైట్ మెంట్ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. కథ రొటీన్ కథ అయినప్పటికీ, పూర్తి వినోదాత్మకంగా ప్రేక్షకులకు కథను చెప్పిన విధానం అద్బుతంగా ఉంది.

బహుశా కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇదే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు మరియు అతను పాత్రలో నటించిన తీరు సూపర్బ్. ట్రైలర్స్ లో చూపించినట్టు, సినిమా అంతా చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. పవర్ ఫుల్ సన్నివేశాలలో అతని నటన డీసెంట్ గా ఉంది. ఫైట్స్, సాంగ్స్ లో డాన్స్ బాగా రావడం కోసం కళ్యాణ్ రామ్ చేసిన హార్డ్ వర్క్ తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ శృతి సోది స్క్రీన్ పై అందంగా కనిపించింది. బాలకృష్ణ ‘అరె ఓ సాంబ..’ రీమిక్స్ సాంగును అద్బుతంగా చిత్రీకరించారు, సేకంగ్ హాఫ్ లో ఈ సాంగ్ హైలైట్ గా నిలిచింది.

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కళ్యాణ్ రామ్ పక్కనే కనిపించిన కమెడియన్ శ్రీనివాస రెడ్డి పండించిన కామెడీ హైలైట్. తన పాత్రను సమర్దవంతంగా పోషించాడు. కళ్యాణ్ తో అతను కలిసి నటించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. అశుతోష్ రాణా, సాయి కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు. షైనింగ్ స్టార్ సుభాష్ గా ఎమ్మెస్ నారాయణ మరోసారి అలరించారు. ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో సాగిపోగా, సెకండ్ హాఫ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

ముందు చెప్పినట్టుగా ఈ సినిమా కథ చాలా రొటీన్ & ఓల్డ్ గా ఉంది. కథ పరంగా సినిమాలో పెద్దగా ఏమి ఉండదు, ప్రేక్షకులు ఈజీగా ఎం జరుగుతుందో ఊహించవచ్చు. హీరోయిన్ సినిమాలో నటించడానికి ఆస్కారం లేదు, కథలో కేవలం పాటలకు పరిమితమైంది. సినిమాలో పోలీసు శాఖ సంబంధించి కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు. సినిమా నిడివి తగ్గించడం కోసం కొన్ని ఫైట్స్ లో కాస్త కత్తిరించి ఉంటె బాగుండేది.

సాంకేతిక విభాగం :

సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. పాటలన్ని బాగున్నాయి, వాటిని అంతే అందంగా తెరపై లావిష్ గా చిత్రీకరించారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్.. సినిమాలో చాలెంజింగ్, యాక్షన్ సన్నివేశాలను మరొక స్థాయికి తీసుకువెళ్ళింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మూడ్ కు తగ్గట్టు డైలాగులు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.

దర్శకుడిగా తొలి సినిమాతో అనిల్ రావిపూడి తనలో టాలెంట్ బాగా ఉందని నిరూపించుకున్నాడు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు కథలో కావలసినంత కామెడీ ఉండేలా చూసుకోవడంలో, కళ్యాణ్ రామ్ ను పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన తీరు బాగుంది. అతను కథను నేరేట్ చేసిన తీరు సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. స్క్రీన్ ప్లే క్రిస్పీగా ఉంది, సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ ప్రేక్షకుల మదిలో రానివ్వలేదు.

తీర్పు :

ఓవరాల్ గా, కళ్యాణ్ రామ్ కెరీర్లో ‘పటాస్’ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవర్ ఫుల్ హీరో క్యారేక్టరైజెషన్ మరియు స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకులను ఆలరించే ఎంటర్టైన్మెంట్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ముందు రొటీన్ కథను పెద్దగా పరిగణలోకి తీసుకోనవసరం లేదు. కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాను తప్పకుండా చూడండి.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు